త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తా: చీఫ్ విప్ వినయ్

- కేయూ సమస్యలపై చీఫ్ విప్ వినయ్ హామీ
- నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమణ
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేయూ విద్యార్థుల సమస్యలపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హామీ ఇచ్చారు. పీహెచ్ డీలో అవకతవకలు జరిగాయని, ఎకడమిక్ ఇయర్ కోల్పోతున్నామనే ఆవేదనతో గత 34 రోజుల నుంచి విద్యార్థులు దీక్షలు చేపట్టారని అన్నారు. సోమవారం కేయూలో దీక్షలు నిర్వహిస్తున్న విద్యార్థులను కలిసి చర్చించారు. వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు.
అనంతరం చీఫ్ విప్ మాట్లాడుతూ కేయూ సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. విద్యార్థుల కోరిక మేరకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, వాకాటి కరుణతో మాట్లాడతానని అన్నారు. కేటీఆర్ విద్యార్థుల సమస్యలను కూడా వెంటనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారన్నారు.
ఎన్నికల సమయం కావడంతో రాజకీయాలు చేయొద్దని వినయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు కూరపాటి వెంకట నారాయణ, సదానందం, రవీందర్, సంగాని మల్లేశం, ఇఫ్తారి, విద్యార్థి నాయకులు బైరపాక ప్రశాంత్, వీరస్వామి, తిరుపతి యాదవ్, వీరేందర్, బొట్ల మనోహర్, రాజు నాయక్, రాంబాబు, రాజేష్, శంకర్, నాగరాజు, విజయ్ కన్నా, రాకేష్, కృష్ణ, పాషా, అంబాల కిరణ్, మేడ రంజిత్ పాల్గొన్నారు.