అసెంబ్లీలో చీఫ్ విప్ ఎవరంటే.. పరిశీలనలో ముగ్గురి పేర్లు!
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ ఎంపిక కసరత్తు ప్రారంభమైంది.

(విధాత, హైదరాబాద్)
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ ఎంపిక కసరత్తు ప్రారంభమైంది. విప్‌లుగా ఎమ్మెల్యేలు జాటోత్ రామచందర్ నాయక్, అడ్లూరి లక్షణ్ కుమార్, బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ లను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ కావడంతో చీఫ్ విప్ ఎవరు అవుతారనే ఆసక్తి పెరిగింది. షెడ్యూల్డు కులాలకు చెందిన వారిని నియమిస్తారా? లేదా అగ్రశ్రేణి వర్గానికి చెందిన వారిని ఎంపిక చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
షెడ్యుల్డ్ కులాలకు చెందిన సభ్యులను ఎంపిక చేయాల్సి వస్తే ఇద్దరి ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వేముల వీరేశం, మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన జీ వివేక్ వెంకటస్వామి పేర్లు పరిశీలనకు వచ్చినట్లు చెబుతున్నారు. అగ్రశ్రేణి వర్గం నుంచి అయితే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఉండవచ్చంటున్నారు. వేముల వీరేశం ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి విజయం సాధించారు.
గతంలో ఆయన బీఆరెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య చేతిలో వీరేశం ఓటమి పాలయ్యారు. ఆ తరువాత లింగయ్య బీఆరెస్‌లో చేరడంతో వీరేశంకు విలువ లేకుండా పోయింది. తనకు టిక్కెట్ దక్కే అవకాశాలు లేకపోవడంతో వీరేశం మొన్న జరిగిన ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరడం, గెలుపొందడం కూడా జరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ సభ్యులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
చెన్నూరు నుంచి విజయం సాధించిన జీ వివేక్ వెంకటస్వామి ఎన్నికలకు ముందే బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్ రెడ్డి కోరిక మేరకు వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరి చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి, బీఆరెస్ అభ్యర్థి బాల్క సుమన్‌పై 37,515 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. షెడ్యూల్డ్ కులానికి చెందిన వీరేశం మాదిగ ఉప కులానికి చెందిన వారు కాగా వివేక్ వెంకటస్వామి మాల ఉప కులానికి చెందిన వారు. ప్రస్తుతం మంత్రి మండలిలో డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ మాల ఉప కులానికి చెందినవారు ఉన్నారు.
మళ్లీ అదే కులానికి చెందిన వివేక్ వెంకటస్వామిని ఎంపిక చేస్తారా? అనే సందేహాలు ఉన్నాయి. మాదిగ ఉప కులానికి చెందిన సీ దామోదర రాజనరసింహ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా మంత్రిమండలిలో ఉన్నారు. సీడబ్ల్యూసీకి శాశ్వత ఆహ్వానితుడిగా అధిష్ఠానం ఇటీవలే నియమించింది. తెలంగాణలో మాదిగలు అధికంగా ఉండడంతో పార్టీ ఆయనకు పెద్ద పదవిని కట్టబెట్టింది. ఇప్పటికే మాల ఉప కులానికి చెందిన ఇద్దరికి పదవులు ఇచ్చినందున, వీరేశంకు మాదిగ కోటాలో చీఫ్ విప్ ఇచ్చే అవకాశాలను తోసిపుచ్చలేమని పరిశీలకులు అంటున్నారు.
అయితే పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో వివేక్ చేరడమే కాకుండా ఎమ్మెల్యేగా గెలుపొంది తన సత్తా చూపించుకున్నారు. జిల్లాలో మరికొందరు అభ్యర్థులకు తనవంతుగా సాయం చేశారనే కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. చీఫ్ విప్ కన్నా ఆయన మంత్రి పదవి పైనే ఎక్కువగా ఫోకస్ చేశారని తెలుస్తోంది. మంత్రి పదవి ఇస్తే సముచితంగా ఉంటుందని, చీఫ్ విప్ ఆయన స్థాయికి తగింది కాదని అంటున్నారు. ఇక మల్ రెడ్డి రంగారెడ్డి విషయానికి వస్తే, రేవంత్ రెడ్డి పిసిసి గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అండగా ఉంటున్నారు.
రంగారెడ్డి జిల్లా నుంచి ఎవరూ గెలుపొందనందున తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన ఆరాటపడుతున్నారు. ఈ దిశగా ఆయన తన ప్రయత్నాలను కూడా ముమ్మరం చేశారు. ఇబ్రహీంపట్నం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఓడించిన తనకు మంత్రి పదవి ఇస్తే న్యాయం చేసిన వారు అవుతారని అనుచరులు చెప్పుకొంటున్నారు. వీరేశంతో పాటు వివేక్ పేర్లను కాదంటే మల్ రెడ్డి రంగారెడ్డికి చీఫ్ విప్ ఇవ్వవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురి పేర్లు కాకుండా మరికొందరు పేర్లు తెరమీదికి వచ్చి ఎంపికైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.