ఏసయ్యా.. దీవించు!
ఉమ్మడి మెదక్ జిల్లాలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో సోమవారం క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరిగాయి
– మెదక్ చర్చిలో వైభవంగా క్రిస్మస్ వేడుకలు
– ప్రత్యేక ప్రార్థనలతో వేడుకలు ప్రారంభించిన బిషప్ పద్మారావ్
– హాజరైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే
– భక్తులతో కిటకిటలాడిన ఏసు మందిరం
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి మెదక్ జిల్లాలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో సోమవారం క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజామున 4 గంటలకు మొదటి ఆరాధనతో బిషప్ పద్మారావు వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. భక్తులకు దైవ సందేశం ఇచ్చారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావ్, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వేర్వేరుగా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని, క్రిస్టియన్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గురువులు దీవెనలు అందజేశారు. చర్చి ప్రతినిధులు అతిథులను శాలువాలతో సత్కరించారు. చర్చి ముందు క్రిస్మస్ కేక్ కట్ చేసి భక్తులకు అందజేశారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా డయాసిస్ పరిధిలోని ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్దఎత్తున తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీఎస్ఐ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పోలీసులు గట్టిబందోబస్తు నిర్వహించారు. లక్షలాది భక్తులు తరలిరావడంతో చర్చి ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది.
శాంతిని పంచే వేడుక : బిషప్
శాంతిని పంచే పండుగ క్రిస్మస్ అని బిషప్ కే పద్మా రావ్ భక్తులకు దైవ సందేశం ఇచ్చారు. జీసస్ జన్మించి 2 వేల ఏండ్లు దాటినా కరుణామయుడిగా, దయామయుడిగా క్రైస్తవుల ఆరాధనలు అందుకుంటున్నాడన్నారు. ఏసు అంటే రక్షణ.. ఏసు జననమే రక్షోదయమన్నారు. రక్షణ కార్యానికి దేవునిచే నియుక్తుడై, అభిషిక్తుడైన క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్ అని బిషప్ ఉద్బోధించారు. లోకాన్ని బాధించే చీకటి కుట్రల సమస్యల నుంచి తప్పించి, శాంతిని ప్రసాదించే పండుగ క్రిస్మస్ అని కొనియాడారు.
వందేళ్ల ఉత్సవానికి ప్రభుత్వ సహకారం: ఎమ్మెల్యే
వచ్చే ఏడాది మెదక్ చర్చి వందేళ్ల ఉత్సవం ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరపున సహకారం అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ అన్నారు. యేసు దయ, ప్రేమ, కరుణ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఏసుక్రీస్తు దీవెనలతో మెదక్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకుందామన్నారు.
ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి: ఎమ్మెల్సీ
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ధోరణిలో జీవితాన్ని గడపాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేయగా యేసు ప్రభువు దీవెనలను అందించారు. ప్రభువు యేసు చెప్పిన బాటలోనే పయనించాలన్నారు. మెదక్ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలు పవిత్ర ప్రదేశంగా భావిస్తారని, అందుకే అన్ని మతాల ప్రజలు చర్చ్ ను సందర్శించి ప్రార్థనలు చేస్తారని, ఇంత గొప్ప చారిత్రాత్మక చర్చ్ మన ప్రాంతంలో ఉండడం గర్వ కారణమన్నారు.
ఏసు ప్రభువు ఆశీస్సులుండాలి : మాజీ ఎమ్మెల్యే
ఏసుప్రభు ఆశీస్సులు ప్రజలపై ఉండాలని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కోరారు. ప్రతిఒక్కరు శాంతి, సమాధానంతో ఉండాలన్నదే అన్ని మతాల సారాంశమన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అకాంక్షించారు. ప్రపంచ గుర్తింపు ఉన్న మహా దేవాలయం మెదక్ లో ఉండటం అదృష్టమన్నారు. పేదల ఆకలి తీర్చే ఉద్దేశ్యంతో కట్టిన మెదక్ చర్చ్ ఆసియా ఖండంలోని రెండో పెద్ద చర్చ్ గా ప్రసిద్ధి చెందడం విశేషమన్నారు.
దుకాణాల వద్ద సందడి
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మహాదేవాలయం ప్రాంగణంలో ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి. పిల్లలకు జాయింట్ వీల్స్, రంగుల రాట్నాలు ఏర్పాటు చేశారు. రంగురంగుల బొమ్మల దుకాణాలు, స్వీట్స్ షాప్స్ తోపాటు ఇతర దుకాణాలు పెద్దఎత్తున వెలిశాయి. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన భక్తులు చర్చి ప్రాంగణంలోని శిలువ వద్ద క్యాండిల్స్ వెలిగించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భక్తులు కానుకలు సమర్పించడంతో పాటు గొర్రెలను దేవుడికి సమర్పించారు. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో మెదక్ లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించారు. కొత్త సంవత్సరం వరకు చర్చి ప్రాంగణంలో వేడుకలు కొనసాగనున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram