మధిరలో భట్టి నామినేషన్.. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు

విధాత: మధిర నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గురువారం అనుచరులతో భారీగా తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు మధిర క్యాంపు కార్యాలయంలో ఎన్నికల్లో విజయం పొందాలని వేద పండితులు వేదమంత్రోచ్ఛారణలతో విజయీభవ అంటూ ఆశీర్వదించారు. చర్చి పాస్టర్లు, ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీని ప్రారంభించారు.
ప్రచార రథానికి భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని గుమ్మడికాయతో హారతి ఇచ్చి, భట్టి విక్రమార్కుకు వీర తిలకం దిద్దారు. ‘భట్టి సీఎం.. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, భట్టి నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. దారి పొడవునా బంతిపూల వర్షం కురిపిస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. భట్టి నామినేషన్ దాఖలుకు పెద్దఎత్తున మహిళలు, రైతులు, యువకులు, పార్టీ శ్రేణులు కదిలి రావడంతో సందడిగా మారింది.
మధిర పట్టణంలోదాదాపు కిలోమీటర్ మేరకు నామినేషన్ ర్యాలీ కొనసాగింది. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి భట్టి విక్రమార్క నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన భట్టి, ఇటీవల బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఖమ్మం నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఐటీ దాడులను ఖండించారు.
నామినేషన్ వేళ ఐటీ దాడులతో భయపెట్టాలని చూస్తున్నారని, బీజేపీ, బీఆరెస్ కలసి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదంటూ, పొంగులేటికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ అఖండ మెజార్టీతో విజయాన్ని నమోదు చేస్తుందని భట్టి ధీమా వ్యక్తం చేశారు.