కాంగ్రెస్ అడ్డగోలు విధానాల వల్లే దేశం వెనుకబడింది: సీఎం కేసీఆర్

ప్రజాస్వామిక వ్యవస్థలో ఉండాల్సిన రాజకీయ పరిణితి లేదు. చాలా తక్కువ ఉంది. రాజకీయ పరిణితి లేకపోవడంతో ఎన్నికలు రాగానే ఆగమాగం లక్షల కోట్లు పెట్టి సంతలో పశువుల్లా మాదిరి నాయకులను కొనడం జరుగుతోంది. ఇది సరికాదు. అబద్దాలు, పనికిమాలిన ఆరోపణలు జరుగుతాయి. ఇవన్నీ అధిగమించాలంటే రాజకీయ పరిణితి పెరగాలి.
అలా రాజకీయ పరిణితి పెరిగిన దేశాల్లో పేదరికం, దరిద్రం పోతున్నాయి. మనదేశంలో కూడా రావాలి. ప్రజలు గెలిచేటటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియ రావాలి. ప్రజస్వామ్య దేశంలో వజ్రాయుధం ఓటు. ఆ ఓటు మీ తలరాతను మారుస్తది. ఆషామాషీగా నాలుగు పైసలకు ఆశపడి ఓటు వేయొద్దు. మన తలరాతను లిఖించే ఓటును జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాలి. అందుకే నేను కోరేది ఏంటంటే.. ఆగమాగమై ఓట్లు వేయొద్దు. మీరు ఊరికి పోయిన తర్వాత మీ ఊర్లలో చర్చ చేయాలి. కేసీఆర్ మాటలపై పది మందిని పోగేసి చర్చ చేయాలి.
తెలంగాణ ప్రజలు, హక్కుల కోసం పుట్టింది బీఆర్ఎస్ పార్టీ. 15 ఏండ్లు ఉద్యమం చేశాం. 10 ఏండ్లు అధికారంలో ఉండి ఏం చేశామో మీ కండ్ల ముందుంది. కాంగ్రెస్ ఏకబిగిన 50 ఏండ్లు పరిపాలించింది. ఆంధ్రాలో తెలంగాణను కలిపింది కాంగ్రెస్ పార్టీ. సమైక్య రాష్ట్రంలో మంచినీళ్లు, సాగునీళ్లు, కరెంట్ లేదు. ఉద్యమాలు, తుపాకీ మోతలు, ఎన్‌కౌంటర్లు, అమాయకులు చనిపోవడం, పోలీసులు చనిపోవడం రక్తపాతంలా ఒక విచిత్రమైన పరిస్థితి. ఆ దుస్థితి ఎవరి వల్ల వచ్చిందో ఆలోచించాలి. ఇవాళ తియ్యగా మాట్లాడితే సరిపోదు. ఇదంతా మీ చరిత్ర కాదా..? 58 ఏండ్లు మా గోస పోసుకున్నది మీరు కాదా..? మొన్నటికి మొన్న కూడా ఇబ్బంది పెట్టారు.
తెలంగాణ ఉద్యమ ఉప్పెనను చూసి రాజకీయ లబ్ది కోసం 2004లో తెలంగాణ ఇస్తామని పొత్తు పెట్టుకున్నారు కాంగ్రెస్ నాయకులు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. కానీ రాష్ట్రాన్ని వెంబడే ఇవ్వలేదు.15 ఏండ్లు మోసం చేశారు. ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీని ఖతం పట్టించే పని చేశారు. మళ్లీ ఉద్యమాన్ని నాశనం చేసే పరిస్థితి చేశారు. మనం మొండిగా ఉండి.. కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో తేలాలని వదిలేది లేదని మొండిగా పోయినం. చావు అంచులకు పోయి ఆమరణ దీఅక్ష చేస్తే తెలంగాణ ప్రకనట చేశారు. మళ్లా వెనక్కి వెళ్లారు. మళ్లా చాలా మంది పిల్లలు చనిపోతే, మనం కొట్లాడితే అప్పుడు దిగొచ్చి తెలంగాణ ఇచ్చారు.
‘కాంగ్రెస్ హయాంలో పంట పెట్టుబడి కోసం బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకున్న రైతు తిరిగి కట్టకపోతే ఇంటి తలుపులు పీక్కపోయిండ్రు. బావుల కాడి మోటార్లు ఎత్తుకపోయిండ్రు. అంతేగానీ రైతుల కోసం నాడు ఒక్క రూపాయి ఇయ్యలే. ఇప్పుడు రైతుబంధు అనే పథకాన్ని సృష్టించింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం. దాంతో ఇయ్యాల్ల కొంచెం కొంచెం రైతుల మొఖాలు తెల్లబడుతున్నయ్. రైతుబంధు రూపంలో పెట్టుబడి వచ్చి, పంటలకు 24 గంటల కరెంటు వచ్చి ఇప్పుడిప్పుడే రైతులు గడ్డకుపడే పరిస్థితి వస్తున్నది’ .
‘గ్రామాలు సల్లగుండాలె, వ్యవసాయ స్థిరీకరణ జరగాలె, రైతులు మంచిగ బతుకాలె అని నిర్ణయించి తాము రైతుబంధు, రైతు బీమా తదితర పథకాలు తీసుకొచ్చినం. కానీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నడు. కేసీఆర్‌కు ఏం పని లేక రైతుబంధు తెచ్చిండు అంటున్నడు. నిజంగా రైతుబంధు దుబారనేనా..? రైతు బంధును ఎత్తేసేందుకు కాంగ్రెస్ గొడ్డలి భుజాన పెట్టుకుని రెడీగా ఉన్నది. వాళ్లు గెలిస్తే రైతు బంధుకు రాం రాం అంటరు. తీర్థం బోదాం తిమ్మక్క అంటే నేను గుల్లె, నువ్వు సల్లె. తియ్యగ పుల్లగ మాట్లాడితె నమ్మి గోల్‌మాల్ కావద్దు. తర్వాత నేను చేయగలిగేది కూడా ఏముండదు. మీరే కొట్లాడాల్సి వస్తది. నేను 24 ఏండ్లు కొట్లాడిన. ఇగ మీదే బాధ్యత’.
‘ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడు ఏమంటున్నడు..? కేసీఆర్ కరెంటును దుబారా చేస్తున్నడు, 24 గంటలు ఎందుకు, 3 గంటలు చాలు అంటున్నడు. మరి 3 గంటల కరెంటు సరిపోతదా..? కర్ణాటకల ఇదే కథ చేసిండ్రు. ఎన్నికల ముందు 24 గంటలు ఇస్తమని చెప్పిండ్రు. ఇప్పుడు 5 గంటలు ఇస్తున్నం అంటున్నరు. కానీ 4 గంటలే ఇస్తున్నరు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇక్కడ ఓ సభల మాట్లాడుతూ.. తమ దగ్గర రోజుకు 5 గంటల కరెంటు ఇస్తున్నం, కేసీఆర్ కావాలంటే నువ్వు బెంగళూరుకు రా సూద్దువు అంటున్నడు. దానికి నేనేమన్నా… 24 గంటల కరెంటు ఇస్తోళ్ల దగ్గరికొచ్చి నువ్వు 5 గంటలు ఇస్తున్నం అంటే దేంతోటి నవ్వాల్రా బాబు నాకర్థతమైతలేదని చెప్పిన’.
‘బీసీ బిడ్డలకు అవకాశం రావడం లేదు. మంథనిలో ఉన్న ప్రతి ఒక్క బీసీతో మాట్లాడుతన్న. రానికాడ టికెట్ రాకపాయే.. వచ్చిన కాడ చైతన్యం ఏమైతున్నట్టు.. ? నేను మంథనిలో బీసీ బిడ్డలతో పంచాయితే పెట్టుకుంట నేను చెబుతున్నారు. ఇవాళ నేను వెళ్లి తర్వాత ప్రతి బీసీ ఇంట్లో, ప్రతి బలహీన వర్గాల ఇంట్లో చర్చ జరగాలి’.
‘బీసీ నాయకుడు.. బలంగా ఎదిగి వచ్చి పని చేస్తుంటే.. ఎందుకు అతన్ని ఇబ్బంది పెట్టాలి ? అవకాశాలు వచ్చేదే తక్కువ మందికి. అవకాశం వచ్చినప్పుడు మన బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ఐక్యత ఎందుకు లోపిస్తున్నది ? నేను మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా. ఎవరైతే బీసీ ఉద్యోగస్తులున్నరో.. బీసీ విద్యార్థులున్నరో.. బీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నరో దయచేసి మీ చైతన్యాన్ని ఈ ఎన్నికల్లో చూపించాలి. పుట్ట మధు గత ఎన్నికల్లో ఓటమిపాలైనా.. వెంటనే వచ్చిన అవకాశంతో జడ్పీ చైర్మన్‌ను చేసుకున్నాం. నేను మీకు ఒకటే మనవి చేస్తున్నా. ఇది వెనుకబడిన ప్రాంతం. ఎలక్షన్లు కాంగనే అవతలపడేటోళ్లు కాదు. పుట్ట మధులాగా ప్రజల మధ్యనే ఉండెటోళ్లు కావాలే మనకు. మంటిపనైనా ఇంటోడు కావాల్రా అన్నారు’.
‘హైదరాబాద్‌లో కుసున్నోళ్లకు ఓటు వేస్తే ఏమైతది ? ఫలితం ఏం వస్తుంది ? పోయి కలుసుడే. భ్రమలోపడి, వెర్రిలోపడి అలాంటివారికి ఓటువేస్తే రాదు.. ఇక్కడే ప్రజల్లో ఉండి ముండికి మన్నంటంగ తిరిగినోడే సిపాయి. వాళ్లు గెలిస్తేనే మనం బాగుపడుతాం తప్ప.. స్టయిల్‌గా వచ్చి చేతులు ఊపి మాట్లాడేవారితో కాదు. అందువల్ల నేను మీ అందరికీ కోరుతున్నా. బీసీ బిడ్డకు అవకాశం వచ్చినప్పుడు చైతన్యం చూపించి చూపించాలి. పుట్ట మధును తప్పకుండా ఈ సారి గెలిపించాలి. మంథనిలో ఒకరోజంతా మీతోనే ఉంటాను.
‘మంథని టౌన్‌లో ఈ నియోజకవర్గ అవసరాల మీద సమీక్ష పెట్టి అవసరమైతే ప్రత్యేకంగా రూ.1000కోట్లు మంజూరు చేసి మంథని తీర్చిదిద్దే బాధ్యత నాది. మీ దరిద్రం పోగెట్టే బాధ్యత నాది అని మనవి చేస్తున్నా. మీకు ఏం అవసరాలున్నాయో మధుకు తెలుసు. ఆ రోజు నేనుకూడా ఉంటా. అన్ని మండలాల నాయకులను పిలుచుకొని.. ఆఫీసర్లను కూర్చుండబెట్టుకుందాం. మీకు ఏం ఏం చావాలో చేసి పెట్టే బాధ్యత నాది. నా మాటగా ప్రజలకు గ్రామగ్రామాల్లో అని బీఆర్‌ఎస్ లీడర్లు, కార్యకర్తలను కోరుతున్నా. ప్రత్యేకమైన నిధిని వెనుకబడ్డ మంథని నియోజవర్గానికి ఇస్తాం. తప్పకుండా పూర్తిస్థాయిలో అభివృద్ధికి సహకరిస్తా. మధు ఆధ్వర్యంలో ఆ పనులన్నీ చేసుకోవాలని సూచిస్తున్నా’ .
బీఆర్ఎస్ పార్టీకి హైకమాండ్ ఢిల్లీలో ఉండదు. మన బాసులు తెలంగాణ ప్రజలే. ప్రజలు ఏది కోరితే అదే జరుగుతది. మన నిర్ణయాలు ఇక్కడే జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఢిల్లీలో స్విచ్ వేస్తేనే ఇక్కడ లైట్లు వెలుగుతాయి. ఇవన్నీ వట్టి పోసిగాళ్లే. టికెట్ల కోసం ఆఫీసులు కాలబెట్టుకుంటున్నారు. అలా లేదు మన దగ్గర. అందర్నీ బ్యాలెన్స్ చేసుకుని ముందుకు పోతున్నాం. వారికి డజన్ మంది సీఎంలు. ఏడాదికి ఎంత మంది మారుతరో తెలియదు.. కర్ణాటకలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఒక నిశ్చితమైన అభిప్రాయం లేకుండా, ఒక సిద్ధాంతం లేకుండా, రాష్ట్రానికో నీతి పెట్టారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ కదా..? తెలంగాణలో ప్రకటించిన స్కీమ్స్ ఛత్తీస్‌గఢ్‌లో పెట్టారా..? పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లో చేస్తున్నారా..? ఏ ఎండకు ఆ గొడుగు పట్టి ఎన్నికలు అయిపోగానే బయటపడాలనేది కాంగ్రెస్ పని.
మీ మధ్యలో ఉండే మధును గెలిపించాలి. పుట్ట మధు అదైర్య పడుతున్నారు. కొంత మందిని కొనుక్కుపోతున్నారని. వారి మీద ఊర్లో రియక్షన్ వస్తది. నువ్వేం చితించే పని లేదు. కొన్నోడు, అమ్ముడు పోయినోడు ఎవరో తెలిసిపోతది. నేను కరీనంరగ్ ఎలక్షన్ల ఉన్నప్పుడు అట్లనే చేశారు. చొప్పదండి నియోజకరవ్గంలో ఐదుగురు పార్టీ మండల అధ్యక్షులను కొనేశారు. ఆ ఊర్లలో వారిని దంచిండ్రు.. ఐదు ఓట్లు కూడా రాలేదు. ఇక్కడ కూడా అదే జరుగుతది. నీవేం రందీపడకు ప్రజలకు చైతన్యం ఉంది. ఆ పైసల కోసం మోసపోయేటోళ్లు కాదు ప్రజలు.
కొంతమంది పిచ్చి నాయకులు గొర్రెల్లాగా పోవొచ్చు కానీ.. ప్రజలకు అది లేదు. పోయిన సారి జరిగిన నష్టం తెలిసింది. నూరు కథల పడ్డా.. ప్రజల మనసులో ఏముందంటే గ్యారెంటీగా బీఆర్ఎస్ సర్కార్ వస్తది అందులో అనుమానం లేదు. అలాంటప్పుడు మధు ఉంటే లాభమైతది.. వేరే ఆయన ఉంటే లాభమైతదా..? గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యేనే రావాలి.. అప్పుడే లాభం జరుగుతది. మంథని ఎమ్మెల్యేగా మధు గెలిస్తేనే మీకు లాభం జరుగుతుంది. ఎక్కడికి పోయినా పని చేసుకొచ్చే సామర్థ్యం ఆయనకు ఉంది.
దేశంలో రైతుల గురించి గానీ, దళిత బిడ్డల గురించి గానీ, గిరిజన ఆదివాసీల గురించి గానీ కాంగ్రెస్ పార్టీ సరైన పద్ధతిలో ముందుకు వెళ్తే ఇవాళ దేశం ఇట్ల ఎందుకుంటుండె..? ఈ పరిస్థితులు ఎందుకు ఉంటుండె..? ఇది మీరొకసారి ఆలోచించాలె. మన కంటే వెనుకకు స్వాతంత్య్రం వచ్చిన చైనా కూడా ఎంతో ముందుకు దూసుకుపోయి అమెరికాతో పోటీ పడుతున్నది. మరె మనకు ఈ గతి ఎందుకు..? ఇవి ఆలోచించకుండా గుడ్డిగ ఓటేస్తే మంచి ఫలితం రాదు. దెబ్బతింటం. అందుకే ఆలోచించకుండా, బాధ్యత లేకుండా ఓటు వేయొద్దని నేను కోరుతున్నా’
‘మంథనిలో పీవీ నర్సింహారావు హయాంలో మొదలుపెట్టిన రింగ్ రోడ్డును ఎవరూ పూర్తి చేయలే. పుట్ట మధు వచ్చినంకనే నా వెంటపడి దాన్ని పూర్తి చేసిండు. అనేక గ్రామాలకు రోడ్లు లేకుండె. నదుల మీద బ్రిడ్జిలు లేకుండె. నా వెంటపడి కొన్ని వందల కిలోమీటర్లకు రోడ్లు వేయించిండు. పలిమెల, పంకెన లాంటి మారూమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వేయించిన ఘనత పుట్ట మధుది. ఆయన ఎంత చేయాల్నో అంత చేసిండు. కానీ మీరే ఆయన పని చేసిండ్రు. నిజమా.. కాదా..?’