CM Revanth Reddy | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌.. ఈసారి సెంచరీ ఖాయం : సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌.. ఈసారి సెంచరీ ఖాయం : సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy | తెలంగాణలో తమకు తిరుగులేదని అహంకారంతో విర్రవీగుతున్న కల్వకుంట్ల గడీలను బద్దలు కొట్టి మూడు రంగుల జెండా ఎగరేశామని, ఇక్కడే ప్రజా పాలనకు నాంది పలికామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రభుత్వం మూణ్ణాళ్ల ముచ్చటేనని, సంక్షేమ పథకాలు అమలు చేయరని, కలిసి ఉండరని చాలా మంది ప్రచారం చేశారని అన్నారు. కానీ నవ్విన వాళ్ల ముందు తలెత్తుకుని నిలబడి.. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టామని చెప్పారు. తెలంగాణ మోడల్‌ను దేశం అనుసరించేలా తీర్చిదిద్దామని అన్నారు. కులగణనను పూర్తి చేసి బీసీల లెక్క తేల్చామని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని ఉన్నా.. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. 18 నెలల్లో రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, పేదలకు సన్న బియ్యం, రైతు రుణమాఫీ చేసి రైతుల రుణ విముక్తులను చేశామని వివరించారు. వరి వేస్తే ఉరే అని ఆనాటి ప్రభుత్వం చెప్పిందని, తాము మాత్రం.. వరి వేయండి.. సన్నాలకు బోనస్‌ కూడా ఇస్తామని చెప్పామని గుర్తు చేశారు. 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా అందించిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని తెలిపారు. ‘మోదీ వస్తాడో, కిషన్ రెడ్డి వస్తాడో, కెసీఆర్ వస్తాడో రండి.. రైతులకు మేలు చేసింది ఎవరో అసెంబ్లీలో చర్చిద్దాం’ అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

ఇందిరమ్మ అంటేనే సంక్షేమం

పేదలకు రూ. 5 భోజనం పెట్టే కార్యక్రమానికి ఇందిరమ్మ పేరు పెడితే కొందరు విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమం అంటేనే ఇందిరమ్మ.. ఇందిరమ్మ అంటేనే పేదల సంక్షేమం అని చెప్పారు. ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సులు అద్దెకు అందించి లాభాలు గడించేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టామని.. ఆత్మగౌరవంతో బ్రతికేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజా పాలనలో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతున్నదన్నారు. మహిళలు స్వయం సహాయక సంఘాలలో చేరి.. ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని సీఎం రేవంత్‌ గుర్తు చేశారు. 18 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, వంద నియోజకవర్గాల్లో 20 వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. యువతకు నైపుణ్యాన్ని అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. 2030 ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించేలా యువతను తీర్చిదిద్దుతామన్నారు. పార్టీ కార్యకర్తలే తమ బ్రాండ్ అంబాసిడర్లన్న రేవంత్‌రెడ్డి.. సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించాలని, ఈ యుద్ధంలో కల్వకుంట్ల కుటుంబం గడీలు బద్దలు కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కార్యకర్తలకు నూరు శాతం న్యాయం నా బాధ్యత

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. కార్యకర్తలకు నూటికి నూరు శాతం న్యాయం చేసే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య 150 కి పెరిగి.. మహిళా రిజర్వేషన్ రాబోతున్నదని.. 60 మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారని తెలిపారు. టికెట్ల కోసం ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని, మీ టికెట్ మీ ఇంటికే వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వంద అసెంబ్లీ సీట్లు, 15 ఎంపీలు గెలిపిస్తామని, రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, భారీగా పార్టీ శ్రేణులు హాజరయ్యారు.