ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న, వరి ధాన్యం సేకరణపై జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..మిషన్ మోడ్‌లో పనిచేస్తూ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు తలెత్తవని, ఏ సమస్య వచ్చినా కలెక్టర్లు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. కొనుగోళ్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఎగుమతిలో నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్టర్లపై చర్యలు
కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించాలని, గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్లకు తరలించాలని రేవంత్ స్పష్టం చేశారు. ధాన్యం లోడ్ తరలించేందుకు ఒప్పందం మేరకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లను ఉపేక్షించరాదు అని, అవసరమైతే అలాంటి వారిపై క్రిమినల్ కేసులకూ వెనకాడొద్దు అని తెలిపారు. ధాన్యం లోడింగ్ విషయంలో జాప్యం జరగకుండా స్థానికంగా ఉన్న హమాలీలను గుర్తించి వారితో పని చేయించుకోవాలని, ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రశీదు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలా చేయడం వల్ల తాలు, తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడొచ్చు అని చెప్పారు.
తాత్కాలిక గౌడన్లు ఏర్పాటు చేసుకోండి
లారీల కొరత ఉంటే దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించాలని, ధాన్యం తరలించడానికి అవసరమైన వాహనాలను అందుబాటులో ఉండేలా చూడాలని ఈ సందర్భంగా రవాణా శాఖ కమిషనర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పలు ప్రాంతాల్లో గోదాముల సమస్య ఉన్నట్లు తెలుస్తోంది అని, అలాంటి ప్రాంతాల్లో అవసరం మేరకు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అవసరమైన చోట రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లను అందుబాటులోకి తీసుకుని ధాన్యాన్ని తరలించాలని పేర్కొన్నారు. వెసులుబాటు ఆధారంగా అక్కడినుంచి గోడౌన్లకు తరలించేలా ప్రణాళికలుండాలని సూచించారు.
నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు
ప్రాంతాల వారిగా సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్లు సరైన చర్యలు తీసుకోవాలని, ప్రతి అధికారి జవాబుదారితనంతో వ్యవహరించాల్సిందేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించే అధికారులు, కలెక్టర్లపై చర్యలకు ప్రభుత్వం వెనకాడదని హెచ్చరించారు. మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని, ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగొద్దు అని స్పష్టం చేశారు. అవసరమైన చోట పోలీస్ సహాయం తీసుకుని కలెక్టర్లు ధాన్యం సేకరణ సాఫీగా జరిగేలా చూడాలని ఆదేశించారు.
టార్ఫాలిన్లు అందుబాటులో పెట్టండి
అకాల వర్షాల సమయంలో రైతులకు నష్టం జరగకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ఇలాంటి సమయాల్లో ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచాలని రేవంత్ రెడ్డి తెలిపారు. వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని, వాతావరణ సూచనలను రైతులకు చేరవేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి అని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతీ ఐకేపీ సెంటర్‌కు ఒక అధికారిని నియమించి, ప్రతి రైస్‌మిల్లు వద్ద ఒక బాధ్యతాయుతమైన అధికారిని నియమించి కొనుగోలు, తరలింపు పర్యవేక్షించాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావుతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ కుమారుడు..!
శ్రీకాంత్ చారి తల్లికి పదవీ..అమరవీరుడి కుటుంబానికి దక్కిన గౌరవం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram