వర్షాలతో అలర్ట్..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తడవకుండా అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

విధాత, హైదరాబాద్ : వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులపై అలర్ట్‌గా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తడవకుండా అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

కల్లాల్లోని ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తైన కేంద్రాల నుంచి టార్పాలిన్లను తరలించాలని అన్నారు. బలమైన ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. సీఎం తాజా ఆదేశాలతోనైనా కొనుగోలు కేంద్రాలలో భారీగా పేరుకపోయిన ధాన్యం కుప్పలు కొనుగోలు, ఎగుమతి వేగంగా జరుగాలని రైతులు ఆశిస్తున్నారు. రోజుల తరబడి ఎండల మధ్య ధాన్యం కుప్పల వద్ద కొనుగోలు కోసం నిరీక్షిస్తూ.. వానల నుంచి ధాన్యం కాపాడుకుంటూ తీవ్ర తంటాలు పడుతున్నారు.

Latest News