SC Reservations | మాదిగ విద్యార్థుల‌కు సీఎం రేవంత్ రెడ్డి శుభ‌వార్త‌.. తాజా ఉద్యోగ నోటిఫికేష‌న్ల‌లో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అమ‌లు చేస్తామ‌ని శాస‌న‌స‌భ‌లో ప్ర‌క‌ట‌న‌

SC Reservations | సీఎం రేవంత్ రెడ్డి శాస‌న‌స‌భ‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అవ‌స‌ర‌మైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేష‌న్ల‌లో మాదిగ ఉప‌కులాల‌ వ‌ర్గీక‌ర‌ణ అమ‌లు చేస్తామ‌ని శాస‌న‌స‌భా వేదిక‌గా రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు.

SC Reservations | మాదిగ విద్యార్థుల‌కు సీఎం రేవంత్ రెడ్డి శుభ‌వార్త‌.. తాజా ఉద్యోగ నోటిఫికేష‌న్ల‌లో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అమ‌లు చేస్తామ‌ని శాస‌న‌స‌భ‌లో ప్ర‌క‌ట‌న‌

SC Reservations | హైద‌రాబాద్ : ఎస్సీ, ఎస్టీ రిజ‌ర్వేష‌న్ల ఉప‌వ‌ర్గీక‌ర‌ణ‌పై సుప్రీంకోర్టు గురువారం కీల‌క తీర్పు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. విద్యా సంస్థ‌ల్లో ప్ర‌వేశాలు, ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీల‌కు కేటాయించిన రిజ‌ర్వేష‌న్ల‌ను ఉపవ‌ర్గీక‌ర‌ణ చేసే అధికారం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఉంటుంద‌ని భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానం తీర్పు వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి శాస‌న‌స‌భ‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అవ‌స‌ర‌మైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేష‌న్ల‌లో మాదిగ ఉప‌కులాల‌ వ‌ర్గీక‌ర‌ణ అమ‌లు చేస్తామ‌ని శాస‌న‌స‌భా వేదిక‌గా రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు.

శాస‌న‌స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌ట‌న సారాంశం ఇదే..

‘కొన్ని ద‌శాబ్దాల నుంచి మాదిగ ఉప‌కులాల‌కు సంబంధించిన ల‌క్ష‌లాది మంది యువ‌కులు ఎస్సీ రిజ‌ర్వేష‌న్ల‌లో ఏబీసీడీ వ‌ర్గీక‌ర‌ణ కోసం పోరాటాలు చేస్తున్నారు. 27 ఏండ్ల నుంచి ఉమ్మ‌డి రాష్ట్రంలో కానీ, ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఏబీసీడీ వ‌ర్గీక‌ర‌ణ కోసం మాదిగ, మాదిగ ఉప‌కులాలు పోరాటాలు చేయ‌డం జ‌రిగింది. ఒక‌నాడు ఇదే శాస‌న‌స‌భ‌లో మాదిగ ఉప‌కులాల వ‌ర్గీక‌ర‌ణ కోసం వాయిదా తీర్మానం ఇస్తే నాతో పాటు నాటి శాస‌న‌స‌భ్యుడు సంప‌త్‌కుమార్‌ను కూడా ఈ స‌భ నుంచి బ‌హిష్క‌రించ‌డం జ‌రిగింది. గ‌త ప్ర‌భుత్వం ఏబీసీడీ వ‌ర్గీక‌ర‌ణ మీద కేంద్రానికి, ప్రధానికి విజ్ఞ‌ప్తి చేయ‌డానికి అఖిల‌ప‌క్షాన్ని తీసుకెళ్తామ‌ని చెప్పి తీసుకెళ్ల‌కుండా మాదిగ సోద‌రుల‌ను మోసం చేయ‌డం జ‌రిగింది. కానీ డిసెంబ‌ర్ 3, 2023 నాడు ప్ర‌జా ప్ర‌భుత్వం బాధ్య‌త తీసుకున్న త‌ర్వాత ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క సూచ‌న మేర‌కు మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ నేతృత్వంలో శాస‌న‌స‌భ్యులందరినీ, అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్‌ని ఢిల్లీకి, సుప్రీంకోర్టుకు పంపించి న్యాయకోవిదుల‌తో చ‌ర్చించి, సుప్రీంకోర్టులో బ‌ల‌మైన వాద‌న‌ను తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వినిపించ‌డంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగ ఉప‌కులాల‌కు అనుకూల‌మైన తీర్పును ఇవ్వ‌డం జ‌రిగింది. నేను మ‌న‌స్ఫూర్తిగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధ‌ర్మ‌స‌నానికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. ఏడు మంది జ‌డ్జిల్లో ఆరు మంది జ‌డ్జిలు రాష్ట్రాల‌కు వ‌ర్గీక‌ర‌ణ చేయ‌డానికి అనుమ‌తి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున నేను స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేస్తున్నాను. దేశంలోనే అంద‌రి కంటే ముందు భాగాన నిల‌బ‌డి ఏబీసీడీ వ‌ర్గీక‌ర‌ణ అమ‌లు చేసే బాధ్య‌త తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకుంట‌ది. అవ‌స‌ర‌మైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేష‌న్ల‌లో కూడా వ‌ర్గీక‌ర‌ణ‌ను అమ‌లు చేయ‌డానికి అవ‌స‌ర‌మైతే ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చి మాదిగ సోద‌రుల‌కు, యువత‌కు న్యాయం చేసే బాధ్య‌త మేం తీసుకుంటాం. ఈ నేప‌థ్యంలో స‌భ్యులంద‌రూ ఏకాభిప్రాయానికి వ‌చ్చి మాదిగ ఉప‌కులాల వ‌ర్గీక‌ర‌ణ‌కు సంపూర్ణంగా స‌హ‌క‌రించాల్సిందిగా రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున విజ్ఞ‌ప్తి చేస్తున్నాను’ అని సీఎం త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.