CM Revanth Reddy | బీఆర్ఎస్ హయాంలో ఆడపిల్లను జైలుకు పంపారు.. ఆ పాపం ఊరికేపోదు.. కవిత జైలుపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ హయాంలో ఓ మహిళా జర్నలిస్టును ఆడపిల్ల అని చూడకుండా జైలుకు పంపించారని, ఆ పాపం ఊరికే పోదు.. అందుకే మీ ఇంట్ల జైళ్లకు పోతున్నారని కవితను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ : బీఆర్ఎస్ హయాంలో ఓ మహిళా జర్నలిస్టును ఆడపిల్ల అని చూడకుండా జైలుకు పంపించారని, ఆ పాపం ఊరికే పోదు.. అందుకే మీ ఇంట్ల జైళ్లకు పోతున్నారని కవితను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో విద్యుత్ పద్దులపై చర్చ సందర్భంగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కరెంట్ కోతలపై ప్రశ్నించిన మహిళా జర్నలిస్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు నమోదు చేసిందని పేర్కొన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
ఈ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నేనేంతో మాట్లాడాను. పార్లమెంట్‌లో కేసీఆర్ నోరు కూడా తెరవేలేదు. పార్లమెంట్ రికార్డులను తెప్పించండి.. త్యాగాల పునాదుల మీద, ఆత్మ బలిదానాల చేసుకున్న శవాల మీద అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కానీ మాకు ప్రజలు అధికారం ఇచ్చారు. కేసు పెట్టామని ఒక జర్నలిస్టు గురించి మాట్లాడారు.
ఆ జర్నలిస్టు ఒ కటీవీ చానెల్‌కు సీఈవో. ఆ చానెల్ రాసివ్వకపోతే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి జైల్లో వేసి ఆ చానెల్‌ను గుంజుకున్నారు. ఆ జర్నలిస్ట్‌కు నా లాయర్‌తో బెయిల్ ఇప్పించాను. చానెల్‌ను గుంజుకున్న విధానంపై చర్చకు సిద్ధంగా ఉంటే ఆధారాలు బయటపెడుతాను. మీరు మొసలి కన్నీరు కార్చుతున్నారు. మీ మాట వింటలేదు అని ఆ ఆడపిల్లను జైలుకు పంపారు. ఆ పాపం ఊరికే పోదు. అందుకే మీ ఇంట్ల జైళ్లకు పోతున్నారు.. ఆ రౌండ్ మీకు వచ్చింది. చేసిన పాపలు ఊరికే పోవు అని పెద్దలు చెప్పారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
మమ్మల్ని రాజకీయ కక్షతోనే గతంలో జైలుకు పంపించారు. ఫామ్ హౌస్‌లు కట్టుకుంది మీరు. నియమాలు ఉల్లంఘించింది మీరు. వాటిని బయటపెట్టినందుకు జైల్లో పెట్టి.. 16 రోజులు ఒక్క మనిషి లేకుండా తీవ్రవాదులను పెట్టినట్లు చర్లపల్లిలో డిటెన్షన్ సెల్‌లో పెట్టారు. నేను భయపడలేదు.. లొంగిపోలేదు.. నిటారుగా నిలబడి కొట్లాడాను. మీరు ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టి మొన్నటి ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు. విద్యుత్ మీద మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లేదంటే మీ పరువే పోతుంది. మీకు చర్చ కావాలనుకుంటే ఆగస్టు 1, 2 తేదీల్లో గంట కూడా విరామం ఇవ్వకుండా చర్చకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.