CM Revanth Reddy | కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి బృందం భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల బృందం పలుశాఖల కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి ఆయా శాఖల నుంచి రావాల్సిన అనుమతులు, నిధుల మంజూరీపై చర్చలు జరిపారు.

రాష్ట్రానికి నిధుల మంజూరీపై చర్చలు..వినతులు
రూ.500గ్యాస్ సిలిండర్ పథకం రాయితీ ముందస్తు చెల్లింపుకు అభ్యర్థన
మూసీ రివర్ ఫ్రండ్ డెవలప్‌మెంట్‌కు నిధులివ్వాలి..
జల్ జీవన్ నిధుల మంజూరీకి వినతి
విధాత, హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల బృందం పలుశాఖల కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి ఆయా శాఖల నుంచి రావాల్సిన అనుమతులు, నిధుల మంజూరీపై చర్చలు జరిపారు. వినతి పత్రాలు అందించారు. రేవంత్‌రెడ్డి బృందం సోమవారం కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీతో భేటీ అయ్యారు. తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్‌రెడ్డి తెలియజేశారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీ) చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.
అనంతరం జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ కావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు సహకరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలోని మురికి నీరు అంతా మూసీలో చేరుతోందని, దానిని శుద్ది చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురికి నీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు, గోదావరి నది జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లతో నింపే పనులకు రూ.6 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి సీ.ఆర్.పాటిల్‌ను కోరారు.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్ నీటి ఇబ్బందులు ఉండవని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి సీఎం రేవంత్‌రెడ్డి తీసుకెళ్లారు. 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైనా ఈ పథకం కింద ఇప్పటి వరకు తెలంగాణకు నిధులు ఇవ్వలేదన్న రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నల్లా లేని 7.85 లక్షల ఇళ్లతో పాటు పీఎంఏవై (అర్బన్), (రూరల్) కింద చేపట్టే ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.16,100 కోట్ల వ్యయమవుతుందని, ఈ ఏడాది నుంచి జల్‌జీవన్ మిషన్ నిధులు తెలంగాణకు కేటాయించాలని కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి బృందం విజ్ఞప్తి చేసింది.