ఈనెల 26 న బతుకమ్మ కుంటలో బతుకమ్మ సంబురాలు

ఈనెల 26, బతుకమ్మ కుంటలో బతుకమ్మ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు, 29న సరూర్ నగర్ స్టేడియంలో గిన్నిస్ రికార్డ్ కార్యక్రమం.

ఈనెల 26 న బతుకమ్మ కుంటలో బతుకమ్మ సంబురాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విధాత): ఈనెల 26 బతుకమ్మ కుంటలో నిర్వహించే బతుకమ్మ సంబరాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు సీఎస్ రామకృష్ణ వెల్లడించారు. బతుకమ్మ కుంటలో నిర్వహించే బతుకమ్మ సంబరాలు, 29న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించే భారీ బతుకమ్మ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు అధికారులను ఆదేశించారు. 29 న నిర్వహించే కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డ్ లో నమోదయ్యే అవకాశం ఉన్నందున విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం సంబంధిత ఉన్నతాధికారులతో సీఎస్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. అంబర్ పేట్ లో ప్రభుత్వం పునరుద్ధరించిన బతుకమ్మ కుంట లో నిర్వహించే బతుకమ్మ సంబరాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 26 న పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలతో హాజరవుతున్నందున తగు ఏర్పాట్లను చేపట్టాలని జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులను ఆదేశించారు.

బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఆహ్వానాలను ప్రజాప్రతినిధులు, వీఐపీ లకు సకాలంలో పంపించాలని జీహెచ్ఎంసీ కమీషనర్ ను ఆదేశించారు. సాయంత్రం 4 గంటల నుండే పెద్ద సంఖ్యలో మహిళలు బతుకమ్మ కుంటకు చేరుకునే అవకాశమున్నందున శానిటేషన్, తగు బందోబస్తు, తాగునీటి సదుపాయం తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని అన్నారు. అదేవిధంగా 29 న సరూర్ నగర్ స్టేడియంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ కార్యక్రమం గిన్నెస్ బుక్ రికార్డ్ లో నమోదయ్యే అవకాశం ఉందని, ఈ కార్యక్రమంలో దాదాపు 10 వేలకు పైగా మహిళలు బతుకమ్మలతో హాజరవుతారని వెల్లడించారు. సరూర్ నగర్ స్టేడియంలోనూ మహిళలకు మౌలిక సదుపాయాల ఏర్పాటు తో పాటు స్టేజి ఏర్పాట్లు, విద్యుదీకరణ, శానిటేషన్ లను చేపట్టాలని రామకృష్ణా రావు స్పష్టం చేశారు.

వీటితో పాటు, 27 న ట్యాంక్ బండ్ పై సాయంత్రం బతుకమ్మ కార్నివల్, 29 న పీపుల్స్ ప్లాజా, 30 న ట్యాంక్ బండ్ పై పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశామని టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు. ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేయడానికి సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

ఈ టెలి కాన్ఫరెన్స్ లో రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, నగర పోలీస్ కమీషనర్ సి.వీ. ఆనంద్, ఆర్టీసీ ఎం.డీ సజ్జనార్, హైడ్రా కమీషనర్ రంగనాధ్, జీహెచ్ ఎంసీ కమీషనర్ కర్ణన్, ఫైర్ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి, హైదరాబాద్, రంగా రెడ్డి జిల్లాల కలెక్టర్లు హరిచందన, నారాయణ రెడ్డి, సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమీషనర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.