KTR | కేటీఆర్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

మల్లు రవి మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలు బిట్స్ పిలానీలో చదివిన వారే పట్టభద్రులు మిగతా వాటిలో చదివిన వారు కాదన్నట్లుగా ఉన్నాయని, అలాంటప్పుడు ఆయన బిట్స్ పిలానీలో చదివిన వారి ఓట్లు మాత్రమే అడగాలని సెటైర్లు వేశారు.

KTR | కేటీఆర్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

బిట్స్ పిలానీ..పల్లీ బఠాణీ వ్యాఖ్యలపై ఆగ్రహం

విధాత, హైదరాబాద్ : వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న(నవీన్‌)ను కించపరుస్తూ చేసిన బిట్స్ పిలానీ..పల్లీ బఠాణీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పీసీసీ ఉపాధ్యక్షులు మలు్ల రవి శనివారం రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. డ్రీమ్డ్ యూనివర్సిటీ బిట్స్ పిలానీతో కేయూ, ఓయూ, జెఎన్‌టీయూ వర్సిటీలను పోలుస్తూ పల్లీ బఠాణీలంటూ ఇక్కడి యూనివర్సిటీలను, అందులో చదివిన తీన్మార్ మల్లన్నతో పాటు ఇతర విద్యార్థులను కూడా కేటీఆర్ అవమానించారని మల్లు రవి ఆరోపించారు. వెంటనే ఆయనపై ఈసీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు.

అనంతరం మల్లు రవి మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలు బిట్స్ పిలానీలో చదివిన వారే పట్టభద్రులు మిగతా వాటిలో చదివిన వారు కాదన్నట్లుగా ఉన్నాయని, అలాంటప్పుడు ఆయన బిట్స్ పిలానీలో చదివిన వారి ఓట్లు మాత్రమే అడగాలని సెటైర్లు వేశారు. కేటీఆర్‌కు తెలంగాణ పట్టభద్రులపై ఎంత గౌరవం ఉందో ఆయన చేసిన పల్లి బఠాణీ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను ఒక్కసారి తెలంగాణలోని యూనివర్సిటీల పట్టభద్రులు సీరియస్‌గా ఆలోచించాలన్నారు. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచాక కాంగ్రెస్ భావజాలాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తారని, శాసన మండలిలో పట్టభద్రులు, నిరుద్యోగులు, మహిళల గురించి తన గొంతు వినిపిస్తారని మల్లు రవి పేర్కోన్నారు.