Minister Sridhar babu | పీసీసీ అధ్యక్షుడిగా ఆయనేనా? రేసులో ముందంజ..!

జులై మొదటివారంలోనే మంత్రివర్గ విస్తరణతో పాటు నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని అంతా భావించారు. నిజానికి పార్టీ అధిష్ఠానంతో జరిగిన చర్చల్లోనూ విస్తరణలో నాలుగు బెర్తులపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

Minister Sridhar babu | పీసీసీ అధ్యక్షుడిగా ఆయనేనా? రేసులో ముందంజ..!

(విధాత ప్రత్యేకం)

జులై మొదటివారంలోనే మంత్రివర్గ విస్తరణతో పాటు నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని అంతా భావించారు. నిజానికి పార్టీ అధిష్ఠానంతో జరిగిన చర్చల్లోనూ విస్తరణలో నాలుగు బెర్తులపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై పార్టీ ప్రధానంగా దృష్టి సారించింది. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తూ అందరినీ కలుపుకొని వెళ్లే నాయకుడి కోసం అన్వేషించింది. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్ష రేసులో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహా మంత్రులు సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, చల్లా వంశీచంద్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మాజీ ఎంపీ మధుయాష్కీ తదితరులంతా సీరియస్‌గా తమ వంతు ప్రయత్నాలు చేశారు. అయితే వీరితో పాటు మంత్రి శ్రీధర్‌బాబు కూడా ఆ పదవి తనకు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న మంత్రులందరిలో శ్రీధర్‌బాబుకు సౌమ్యుడిగా పేరుంది. విపక్షాల విమర్శలను కూడా ఆయన సునిశితంగానే విమర్శిస్తున్నారు. పార్టీలోనూ కార్యకర్తలు, నేతలందరికి ఆయనతో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో అందరికీ ఆమోదయోగ్యుడిగా శ్రీధర్‌బాబు పేరే పీసీసీ రేసులో ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పాలనపై దృష్టి సారించింది. గురువారం నుంచి రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించనున్నది. ఆరు గ్యారెంటీల అమలు కోసం కార్యాచరణ మొదలుపెట్టనున్నది. ఇవన్నీ కొలిక్కి వచ్చి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు పూర్తయ్యే నాటికి పీసీసీ అధ్యక్షుడు ఎవరు అన్నదానిపై కాంగ్రెస్‌ పార్టీ క్లారిటీ ఇవ్వనున్నది. స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త పీసీసీ అధ్యక్షుడి సారథ్యంలోనే ఎదుర్కోనున్నది. గతంలో వైఎస్‌, డీఎస్‌లా పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తూ పార్టీ శ్రేణులకు ఏకతాటిపై నడిపించడానికి శ్రీధర్‌ బాబు అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమౌతున్నది. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించకపోవచ్చని సమాచారం. ఎందుకంటే వివాదాస్పద వ్యాఖ్యలు గాని, పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నా బహిరంగంగా ఎన్నడూ ఆయన వ్యక్తం చేయలేదు. మొన్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రాజీనామా అంశంలోనూ శ్రీధర్‌బాబు పార్టీ అధిష్ఠానం సూచన మేరకు ఆయనతో చర్చలు చేసి సమస్యను జటిలం కాకుండా చూశారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

అలాగే ప్రస్తుతం పార్టీలోకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతున్నాయి. దీనిపై పార్టీ అధిష్ఠాన నిర్ణయం, రాష్ట్ర నాయకత్వం అభిప్రాయం ఎలా ఉన్న కొన్నిచోట్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల రాకను ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఈ సమయంలో పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా, ప్రభుత్వం ఐదేళ్ల కాలం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా సాగాలంటే పీసీసీ అధ్యక్షుడి పాత్ర కీలకం. అందుకే అన్నిరకాలుగా ఆలోచించి పార్టీ అధిష్ఠానం శ్రీధర్‌ బాబు అయితేనే పార్టీలో అందరినీ కలుపుకొని వెళ్లి, సంక్షోభాలు తలెత్తినా, విభేదాలు వచ్చినా పరిష్కరించే నేత ఆయన అయితేనే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. చివరి నిమిషంలో ఏదైనా జరిగితే తప్పా తదుపరి పీసీసీ అధ్యక్షుడు శ్రీధర్‌బాబే అని పార్టీ వర్గాల్లో బలంగా చర్చ జరుగుతున్నది.