తుక్కుగూడ కాంగ్రెస్ లక్కు జాడ!!
తుక్కుగూడ ఇప్పుడది కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్రీతిపాత్రమైన ప్రాంతంగా మారిపోయింది. తుక్కుగూడ అంటే విజయానికి సంకేతంగా, అధికారానికి ముఖద్వారంగా మారిపోయింది

విధాత ప్రత్యేక ప్రతినిధి: తుక్కుగూడ ఇప్పుడది కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్రీతిపాత్రమైన ప్రాంతంగా మారిపోయింది. తుక్కుగూడ అంటే విజయానికి సంకేతంగా, అధికారానికి ముఖద్వారంగా మారిపోయింది. ఇప్పుడు తుక్కుగూడ అంటే ఆ పార్టీకి, ముఖ్యంగా టీపీసీసీకి ఇష్టమైన పేరైంది. తుక్కుగూడ తమ లక్కు ప్లేస్ అంటున్నారు. ఒక విధంగా తెలంగాణ కాంగ్రెస్ కు సెంటిమెంట్ మారింది. ఈ సెంటిమెంట్ ను పునరావృతం చేస్తోందనే పూర్తి విశ్వాసంతో…ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. ఒక సభతో తుక్కుగూడ పై ఏర్పడి ఎక్కడలేని ప్రేమ కారణంగానే శనివారం ఇదే కేంద్రంగా భారీ బహిరంగ సభ నిర్వహణకు టీపీసీసీ సిద్ధమైంది. జనజాతర పేర లక్షలాది మందితో సభ నిర్వహించి జరుగనున్న లోక్ సభ ఎన్నికలకు పొలికేక వేయనున్నది. తొలిసారి ప్రతిపక్ష పార్టీగా సభ నిర్వహించి సక్సెస్ అయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికార పార్టీ తుక్కుగూడలో సభను నిర్వహించేందుకు సిద్ధమైంది. దేశ ముఖచిత్రాన్ని మార్చివేసే కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచే జంగ్ సైరన్ ఊదాలని కాంగ్రెస్ భావిస్తోంది. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని పదేళ్ల ఎన్డీఏ పాలనకు చరమగీతం పాడాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను తెలంగాణ గడ్డమీద, అదీ శాసనసభ ఎన్నికలకు సమరశంఖం పూరించిన తుక్కుగూడ వేదికగానే విడుదల చేయాలని నిర్ణయించింది.
భారీ ఏర్పాట్లు….10లక్షల మంది టార్గెట్
హైదరబాద్ నగర శివారు తుక్కుగూడలో శనివారం నిర్వహించనున్న జనజాతర పార్లమెంట్ ఎన్నికల ప్రచారసభకు భారీ స్థాయిలో జనాన్ని సమీకరించేందుకు టీపీసీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 10లక్షల మంది జనాన్ని సమీకరించే లక్ష్యంగా పార్టీ ప్రణాళిక రచించింది. ఈ మేరకు అన్ని జిల్లాల నుంచి జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన నాయకత్వం పర్యవేక్షిస్తుండగా జిల్లా నేతలు జన సమీకరణలో నిమగ్నమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఇంచార్జ్ లతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీపీసీసీ నుంచి ఇంచార్జ్ ల ను నియమించారు. వీరంతా సభ సక్సెస్ కోసం కృషి చేస్తున్నారు.
అప్పుడు తుక్కుగూడకు అడ్డంకులు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల ప్రచార సభలో భాగంగా హైదరాబాద్ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. రకరకాల కారణాలు చెప్పి కాంగ్రెస్ సభ నిర్వహణకు సిద్ధమైన గ్రౌండ్లు ఇవ్వకుండా, పోలీసు అనుమతులు, ట్రాఫిక్ సమస్య తదితర పలు కారణాలతో అప్పటి ప్రభుత్వం ఒక రకంగా ఇబ్బందులకు గురిచేసింది. జడ్ కేటగిరి స్థాయి వ్యక్తులైన సోనియాగాంధీ, రాహూల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు ఆ పార్టీ అతిరథ, మహారథులు హాజరవుతున్నారని, భద్రతా కారణాల నేపథ్యంలో తాము కోరుతున్న స్థలాన్ని కేటాయించాలని కోరినప్పటికీ రకరకాల సాకులు చెప్పారు. ఈ నేపథ్యంలో తుక్కుగూడలోని ఒక ప్రైవేటు స్థలంలో సభ నిర్వహణకు పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుండగా సభ స్థల యజమానులపై అప్పటి బీఆర్ఎస్ నేతలు ఒత్తిడి తెచ్చారనే విమర్శలున్నాయి. చివరికి భూ యజమానులను ఒప్పించి ఎట్టకేలకు సభను ఇక్కడే నిర్వహించారు. భారీ జనసమీకరణతో సభ విజయవంతం చేశారు. ఈ సభావేదికగానే సోనియా, రాహూల్, మల్లిఖార్జున్ ఖర్గే ఆరు గ్యారంటీలను, కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మెనిఫెస్టోను ప్రకటించారు.
సెంటిమెంట్ పునరావృతం
అనేక రకాల ఇబ్బందులు, అంతర్గతంగా కుమ్ములాటలు, గ్రూపులు, అధికార పార్టీ ఒత్తిడిమధ్య నిర్వహించి విజయవంతం చేసుకున్న తుక్కుగూడ సభ కాంగ్రెస్ కు శుభసూచకంగా మారింది. అక్కడి నుంచి ప్రారంభమైన సానుకూల ఫలితాలు ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. తుక్కుగూడ నుంచి ప్రారంభమైన జైత్రయాత్ర పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతమవుతోందని భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఆశిస్తున్నట్లు 14 ఎంపీ సీట్లతో పాటు దేశంలో ఇండియా కూటమి విజయం సాధించి రాహూల్ గాంధీ ప్రధాని అవుతారని ఆశాభావంతో ఉన్నారు. ఢిల్లీ పై అధికారానికి ముఖద్వారంగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ వేదిక నుంచి కాంగ్రెస్ ఎన్నికల మెనిఫెస్టో ప్రకటించనున్నారు. ఈ మెనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక అంశాలను పొందుపరిచారు. ఈ సభకు పార్టీ నేలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఇప్పటికే తుక్కు గూడ లో జనజాతర సభ స్థలాన్ని , ఏర్పాట్లను సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు దనసరి అనసూయ సీతక్క, పొంగులేటి తదితరులు పరిశీలించారు.
దేశ ముఖచిత్రాన్ని మార్చే ఎన్నిక: సీతక్క
తుక్కుగూడలో జనజాతర పేరిట నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో మేనిఫెస్టో ప్రకటించడమే కాకుండా, అధికారంలోకి వస్తే అమలు చేయనున్న ఇరవై ఐదు గ్యారంటీలను కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ప్రకటించనున్నదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క అన్నారు. దేశముఖ చిత్రాన్ని మార్చే ఎన్నికలుగా అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీఎత్తున విజయ భేరి బహిరంగ సభను నిర్వహించింది. ఆరు గ్యారెంటీలను ప్రకటించిందన్నారు. తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకుందన్నారు. ఇప్పుడు అదే సెంటిమెంటుతో లోక్‌సభ ఎన్నికల ముందు కూడా శనివారం తుక్కుగూడలోనే ‘జన జాతర’ పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరు కానున్న ఈ సభను ధూం ధాంగా నిర్వహించాలని, పదిలక్షలమందిని సభకు తరలించాలని కసరత్తు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారని వివరించారు. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు.