ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్యపై సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన ఆరోపణల

యాదాద్రి భువనగిరి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామెల్ సంచలన ఆరోపణలు చేసి కాంగ్రెస్ లో ఉద్రిక్తత రేపారు.

ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్యపై సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన ఆరోపణల

విధాత : యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముసలం రేగింది. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై సొంత పార్టీ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సంచలన ఆరోపణలు చేశారు. లఫంగి రాజకీయాలు చేయకు..రాజకీయ వ్యభిచారం మానుకో..మీ బంధుత్వం కోసం కాంగ్రెస్ పార్టీ ని బొందపెట్టకు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో మా జిల్లా నాయకులు కొంతమంది నా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టకుంటున్నారంటూ సామేల్ ఆరోపించారు. ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య, డీసీసీ అధ్యక్షుడు, మదర్ డెయిరీ చైర్మన్ లు వారి బంధుత్వం కోసం, స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీని బొందపెట్టవద్దని హితవు పలికారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో డైరెక్టర్ గా లక్ష్మినర్సింహారెడ్డికి ఓటు వేయకండని కోరారు.

సీఎం, పీసీసీ చీఫ్ లకు ఫిర్యాదు చేస్తా

మదర్ డెయిరీఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే..నైతిక బాధ్యత వహిస్తూ బీర్ల ఐలయ్య రాజీనామా చేయాలని సామెల్ డిమాండ్ చేశారు. బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. ప్రలోభాలకు పోకుండా ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని..కాంగ్రెస్ అభ్యర్థులు ఓడితే పార్టీ నాయకులు, కార్యకర్తలు మీకు సరైన బుద్ది చెపుతారని హెచ్చరించారు. బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి..రాజకీయ వ్యభిచారం చేస్తే మంచిదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మదర్ డెయిరీ ఎన్నికలలో బీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకున్న అంశంపై నేను వెంటనే సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు, ఇంచార్జి మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేస్తున్నట్లుగా తెలిపారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడితే ఐలయ్యపైన, డీసీసీ అధ్యక్షుడు, మదర్ డెయిరీ చైర్మన్లపైన చర్యలు తీసుకోవాలని వారిని కోరుతున్నానన్నారు.