BRS Vs Congress | రాజయ్యను ఎందుకు పక్కనపెట్టారు? కడియానికి టికెట్ ఎందుకు ఇచ్చారూ!
రాజయ్యను పక్కన పెట్టి కడియానికి టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫైర్, కాళేశ్వరం అవినీతి పై సమాధానం చెప్పాలని డిమాండ్.

విధాత ప్రత్యేక ప్రతినిధి: స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ తాటికొండ రాజయ్యను తప్పించి ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఎందుకు ఇచ్చారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. రాజయ్యకు టికెట్ నిరాకరిస్తే కనీసం నోరు కూడా తెరువని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పైన అక్కసు వెళ్ళగక్కడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ నాయకులకు కడియం శ్రీహరిని విమర్శించే హక్కులేదని మండిపడ్డారు. కడియం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నియోజవర్గ అభివృద్ధికి పనిచేస్తున్నారని, అభివృద్ధి చేసేదెవరో,అడ్డంకులు సృష్టించేదెవరో గమనించాలని కోరారు. హనుమకొండలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎంపీ కడియం కావ్య వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు మాట్లాడారు.
సీఎం రేవంత్ హయంలో రాష్ట్ర అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు.ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పెద్దమనిషి ప్రజలకు కన్పించడంలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. అప్పుడు అన్ని పార్టీల నుంచి తమ పార్టీలో ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతి పై ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని మండిపడ్డారు. అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ నేతలు సత్య హరిచంద్రుల్లా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పై విశ్వాసం లేదంటున్న కెసిఆర్,కేటీఆర్,హరీష్ రావు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవండంటూ సవాల్ చేశారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. దిగజారకండి. మూతి మీద మీసం లేని మీరు ముఖ్యమంత్రి మొగతనం గురించి మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు.