గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ తో పౌరుల హక్కులను హరించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అనిరుధ్ రెడ్డిలు ఆరోపించారు. అన్నారు. జడ్జీలు, జర్నలిస్టులు, నటులు, రాజకీయ నేతలు ఇలా అన్ని వర్గాల ఫోన్లను ట్యాప్ చేసిందని.. దొడ్డిదారి రాజకీయాలకు, అక్రమ సంపాదనలకు పాల్పడిందని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసుల మేరకు ఈ రోజు విచారణకు హాజరై మా వాంగ్మూలం నమోదు ఇవ్వడం జరిగిందని తెలిపారు. మార్చి 2024లో మాతో పాటు పలు పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు గత ప్రభుత్వం చట్టవిరుద్దంగా చేసిన ఫోన్ ట్యాపింగ్ పై డీజీపీకి ఫిర్యాదు చేశాం అని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులు, పాత్ర ధారులను గుర్తించేందుకు విచారణ కొనసాగుతుందని తెలిపారు.
ప్రజల ఆదరణ లేక, ఓట్లు పొందలేమని గ్రహించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ తో ఎన్నికల యుద్దంలో గెలవాలని ప్రయత్నించిందని వారు విమర్శించారు. తెలంగాణ ప్రజల స్వేచ్చను హరించిన బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ప్రజలు ఓట్లు వేయరని తెలిసే…బ్లాక్ మెయిలింగ్ కోసం బీఆర్ఎస్ పాలకులు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఇటీవల ఆ పార్టీ నాయకులు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో వేల మంది ఫోన్ ట్యాపింగ్ చేశారని, మళ్లీ బీఆర్ఎస్ అధకారంలోకి వస్తే లక్షల మంది ఫోన్లను ట్యాపింగ్ చేస్తారని, ఓటు వేయని వారిని, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటారని ఆరోపించారు. అందుకే ఇలాంటి ఫెడదోరణులు ప్రజాస్వామ్యంలో ఉండకూడదంటే…అధికారానికి బీఆర్ఎస్ ను ప్రజలు దూరం పెట్టాలని కోరారు. తెలంగాణ ఉద్యమం పునాదులైన స్వేచ్చ, స్వాతంత్ర్యం పరిరక్షించబడాలంటే బీఆర్ఎస్ ను అధికారంలోకి రానివ్వరాదన్నారు.
మా భార్యభర్తల సంభాషణ కూడా విన్నారు: అనిరుధ్ రెడ్డి
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ అక్రమ ట్యాపింగ్ అనేది కేవలం రాజకీయ నాయకులకే పరిమితం కాలేదని, వారి కుటుంబ సభ్యుల ప్రైవసీని కూడా నడిబజార్లో పెట్టేలా సాగిందని మండిపడ్డారు.కేవలం తన ఫోన్ మాత్రమే కాకుండా.. తన తల్లి, భార్య ఫోన్ నంబర్లను కూడా గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ట్యాప్ చేయించిందని ఆరోపించారు. రాజకీయాల్లో ఉన్న నా ఫోన్ ట్యాప్ చేస్తే ఒక అర్థం ఉండవ్చని, కానీ నా భార్య ఫోన్ ఎందుకు ట్యాప్ చేయాలి? ఒక భార్యాభర్తలు మాట్లాడుకునే అత్యంత వ్యక్తిగత విషయాలను మూడో వ్యక్తి వింటుంటే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది? అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారం బయటపడినప్పటి నుండి ఇంటికి వెళ్తే తన భార్య తనను తిడుతోందని.. నీ రాజకీయాల వల్ల నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు, నా ప్రైవసీ పోయింది అని ఆమె నిలదీస్తుంటే తాను సమాధానం చెప్పలేక తలదించుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
