విధాత, హైదారాబాద్ : ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు, సస్పెన్షన్‌లో ఉన్న అదనపు ఎస్పీ నాయిని భుజంగరావుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ బృందాలు బుధవారం హైదరాబాద్‌లో మియాపూర్ హఫీజ్‌పేట సాయిరాం టవర్స్‌లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించాయి. వనస్థలిపురం ప్రశాంత్‌నగర్‌లో ఆయనకు చెందిన మరో ఇంటితోపాటు నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాల్లోని ఆయన బంధువులు, బినామీల ఇళ్లలో 15 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో ఆయనకు చెందిన ఆస్తులను పెద్ద ఎత్తున గుర్తించారు. సదరు ఆస్తులకు లెక్కలు చూపకపోవడంతో భుజంగరావును అరెస్టు చేశారు.
భుజంగరావు ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండేళ్ల క్రితం 2024 మార్చి 23న అరెస్టయి..బెయిలుపై విడుదలయ్యారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా పలువురి ఫోన్లను రహస్యంగా విని బెదిరింపులకు పాల్పడి భారీగా అక్రమార్జన చేశాడని భుజంగరావుపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి అక్రమాస్తుల కేసులో భుజంగరావును అరెస్టవ్వడం.. జైలుకు వెళ్లడం గమనార్హం.
భుజంగరావు నివాసాలలో ఏసీబీ సోదాల్లో సుమారు రూ.5.92 కోట్ల(రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం) విలువైన చర, స్థిరాస్తుల్ని గుర్తించారు. బహిరంగ మార్కెట్ లో వాటి విలువ రూ.100కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. భుజంగరావు జూలై నెలలో పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన అక్రమాస్తుల కేసులో అరెస్టవ్వడం ఆసక్తికరంగా మారింది.