Chamala Kiran Kumar Reddy : హరీశ్ రావుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు

హరీష్ రావుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఈ ఫిర్యాదుతో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపనుంది?

Chamala Kiran Kumar Reddy : హరీశ్ రావుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు

విధాత : బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావుపై కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిగులు రాష్ట్రం తెలంగాణను పదేళ్ల బీఆర్ఎస్ పాలకులు, మాజీ మంత్రి హరీష్ రావు లు దోచుకున్నారని మాజీ ఎమ్మెల్సీ కవిత ఆరోపించిన ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని యాదగిరిగుట్ట పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో చామల ఫిర్యాదు చేశారు. సంతోష్ రావు, హరీశ్ రావు, నవీన్ రావులపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య యాదవ్, డీసీసీ మాజీ అధ్యక్షుడు అండెం సంజీవ రెడ్డిలతో కలిసి ఈ ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా చామల మాట్లాడుతూ పదేళ్లలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం అప్పుల రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు. కాళేశ్వరం, ధరణి సహా సహా పలు రంగాలలో స్కామ్ లతో బీఆర్ఎస్ పాలకులు ప్రజధనాన్ని, రాష్ట్ర వనరులను దోచుకున్నారన్నారు. ఇప్పుడు దొంగే దొంగ అన్నట్లుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేందుకు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో తెలంగాణను దోచుకుందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడన్నారు. కేసీఆర్ హయాంలో లక్ష ఇళ్లు ఇచ్చామని హరీష్ రావు చెబుతున్నాడని, అవి ఎక్కడున్నాయో ఎవరికి ఇచ్చాడో చూపెట్టాలన్నారు. కమీషన్ల కోసం నాలాల మీద లక్ష ఇళ్లకు పర్మిషన్లు ఇచ్చి హైదరాబాద్ నగరాన్ని ముంచే దౌర్భాగ్య పాలన చేసి బీఆర్ఎస్ పాలకులు సొమ్ము చేసుకున్నారని చామల ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పేదల ఇళ్లను కూల్చేందుకు హైడ్రా తెచ్చాడని హరీష్ రావు ప్రచారం చేస్తున్నారని, హైడ్రా తెచ్చింది పేదల కోసం కాదన..నగరాన్ని కాపాడుకునేందుకు అని స్పష్టం చేశారు.