CPI | ఆదర్శ వివాహాలతో సామాజిక పరివర్తన.. సీపీఐ నేతలు చాడ వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు

ఆదర్శ వివాహాలతోనే సమాజంలో సామాజిక పరివర్తన సాధ్యమని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే శ్రీహరి అన్నారు.

CPI | ఆదర్శ వివాహాలతో సామాజిక పరివర్తన.. సీపీఐ నేతలు చాడ వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు

వరంగల్ ఎంపి కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ఆదర్శ వివాహాలను తల్లిదండ్రులు ప్రోత్సాహించాలి

విధాత, వరంగల్ ప్రతినిధి: ఆదర్శ వివాహాలతోనే సమాజంలో సామాజిక పరివర్తన సాధ్యమని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే శ్రీహరి అన్నారు. ఆదివారం హనుమకొండలో తెలంగాణ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి – రాజమౌళి కూతురు అపూర్వ-శ్రీధర్ ల ఆదర్శ వివాహం జరిగింది. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి సమక్షంలో నిర్వహించిన ఈ వివాహ కార్యక్రమంలో కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పరస్పరం అవగాహన, గౌరవంతో యువతీ యువకులు కలిసి వివాహ బంధంతో జీవించాలని సూచించారు. పిల్లల సంతోషమే తల్లిదండ్రులకు ముఖ్యం అని, తాను తన తల్లిదండ్రుల సమ్మతితోనే ఆదర్శ వివాహం చేసుకున్నానని చెప్పారు. పెండ్లి ఎంత గొప్పగా జరిగిందనేది ముఖ్యం కాదని, వారు జీవితంలో ఎంత సఖ్యతతో కలిసి ముందుకు సాగుతున్నారనేదే ముఖ్యమని అన్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఆదర్శ వివాహాలు ఆదర్శంగా జీవించడానికి దారితీయాలని సూచించారు. తన ముగ్గురు కూతుర్లలో ఇద్దరు తమ క్లాస్ మేట్స్ నే వివాహం చేసుకున్నారని చెప్పారు. కులాంతర మతాంతర ఆదర్శ వివాహాలను ప్రోత్సాహించాలని, కులాలకు, మతాలకు అతీతంగా ముందుకు సాగినప్పుడే సమాజంలో ప్రశాంతత సాధ్యమని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ వివాహ వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకున్నదేనని, ఆదర్శ వివాహాలను తల్లిదండ్రులు ప్రోత్సాహించాలని అన్నారు. మహిళా సమాఖ్య నాయకురాలిగా నేదునూరి జ్యోతి తన కూతురుకు ఆదర్శ వివాహం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, సీపీఐ జాతీయ సమితి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ, తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, కలవేణ శంకర్, ఈటి నర్సింహా, జనగామ, మహబూబాబాద్, హనుమకొండ, హైదరాబాద్, కరీంనగర్, కొత్తగూడెం,ఆదిలాబాద్ జిల్లాల కార్యదర్శులు సీహెచ్ రాజా రెడ్డి, బి. విజయ సారథి, కర్రె బిక్షపతి, చాయాదేవి, మర్రి వెంకటస్వామి, సాబీర్ పాషా, ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఉజ్జిని రత్నాకర్ రావు, టి. వెంకట్రాములు, ప్రేమ్ పావని, న్యాయవాది ఏరుకొండ జయశంకర్ తదితరులు పాల్గొన్నారు.