John Wesley : ఎన్ కౌంటర్లు నిలిపివేసి, చర్చలు జరపాలి

ఎన్ కౌంటర్లు నిలిపి మావోయిస్టులతో చర్చలు జరపాలని సిపిఎం నేత జాన్ వెస్లీ కేంద్రంపై విమర్శలు చేశారు. అటవీ సంపదను కార్పొరేట్లకు అప్పగించే కుట్ర ఉందన్నారు.

John Wesley : ఎన్ కౌంటర్లు నిలిపివేసి, చర్చలు జరపాలి

విధాత, వరంగల్ ప్రతినిధి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ కౌంటర్లు ఆపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఎన్ కౌంటర్లు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని హరిస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలోని అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పగించడానికి ఆపరేషన్ కగారు ద్వారా నక్సలైట్ల అనే పేరుతో ఎన్ కౌంటర్ చేస్తూ నరమేధం సృష్టించడం సరైనది కాదన్నారు. జనగామ, హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచి తప్ప చంపడం సరైనది కాదన్నారు. బలం ఉందనే పేరుతో ఏది చేసినా నడుస్తుందని విర్రవీగిన నియంతలందరూ మట్టి కలిసిపోయారని, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని వెస్లీ హెచ్చరించారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు ఉన్నంతకాలం దోపిడీ ఉన్నంతకాలం తిరుగుబాటు ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలు అమలు చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరంతరం ప్రజల కోసం పనిచేసే సిపిఎం అభ్యర్థులను గెలిపించడం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ప్రజలు అలాంటి అవకాశాన్ని సిపిఎం పార్టీకి ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలోఅబ్బాస్, యాదగిరి, శేఖర్, ప్రభాకర్ రెడ్డి, గొడుగు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.