CPM | మెట్రో రైల్లో కోచ్‌లు పెంచాలి..మెట్రో భవన్ వద్ద సీపీఎం నిరసన
మెట్రో రైల్లో రద్దీకి అనుగుణంగా కోచ్ లను పెంచాలని సీపీఎం ఆధ్వర్యంలో మెట్రో భవన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. రోజు 5 లక్షలకు పైగా ప్రయాణికులు మెట్రోలో ప్రయాణం చేస్తున్నారని, నిలబడేందుకు కూడా చోటు లేకుండా మెట్రోలో ప్రయనించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

సీఎం చొరవ తీసుకుని పార్కింగ్ ఫీజులు ఆపాలి
విధాత, హైదరాబాద్ : మెట్రో రైల్లో రద్దీకి అనుగుణంగా కోచ్ లను పెంచాలని సీపీఎం ఆధ్వర్యంలో మెట్రో భవన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. రోజు 5 లక్షలకు పైగా ప్రయాణికులు మెట్రోలో ప్రయాణం చేస్తున్నారని, నిలబడేందుకు కూడా చోటు లేకుండా మెట్రోలో ప్రయనించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రద్దీ పెరిగితే 3 కోచ్ ల నుండి 6 కోచ్ లకు పెంచుతామని ఎల్‌ఆండ్‌టీ అధికారులు గతంలో చెప్పారని గుర్తుచేశారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా కోచ్ లు పెంచాలని డిమాండ్ చేశారు. టాయిలెట్స్‌తో పాటు కొత్తగా పార్కింగ్ కు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకొని పార్కింగ్ ఫీజులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెట్రో స్టేషన్ వద్ద ఉచిత పార్కింగ్ ఉన్నట్టుండి ఎత్తివేయడం వివాదానికి దారి తీస్తుందన్నారు. పార్కింగ్ చేసుకోవడానికి ‘పార్క్ హైదరాబాద్’ అనే యాప్ నుంచి చెల్లింపు చేయాలని కండిషన్ పెట్టారని, ఆ యాప్ గూగుల్ నుంచి డౌన్ లోడ్ కావడం లేదని వాహనదారులు చెబుతున్నారని, అసలే ఆఫీసులకు వెళ్లే తొందరలో ఉన్న వారిని ఈ పార్కింగ్ సమస్య తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని సీపీఎం నాయకులు తెలిపారు. నగదు చెల్లించి పార్కింగ్ చేసేందుకు అనుమతించకపోవడంతో చాలా మంది వాహనదారులు వారిపై తిరగబడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సీపీఎం నాయకుల నిరసనలతో మెట్రో స్టేషన్ వద్ద భారీగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.