Tammineni Veerabhadram | ఉత్పత్తి రంగానికి ప్రాధాన్యం ఏది?.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తి రంగాల ప్రాధాన్యం తగ్గించడంతో పాటు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఎలాంటి ప్రాధాన్యతా ఇవ్వలేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.

Tammineni Veerabhadram | ఉత్పత్తి రంగానికి ప్రాధాన్యం ఏది?.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

బడ్జెట్‌లో విభజన హామీల ఊసే లేదు

హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తి రంగాల ప్రాధాన్యం తగ్గించడంతో పాటు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఎలాంటి ప్రాధాన్యతా ఇవ్వలేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. పైగా దిగుమతులపై ఆధారపడే విధంగా దేశాన్ని మార్చే దిశగా ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన హామీల ఊసే ప్రస్తావన లేని ఈ బడ్జెట్‌ను సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని తెలిపారు.

‘ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్‌కు అదనంగా రు.4లక్షల కోట్లు పెంచి రు.48.20 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు’ అని విమర్శించారు. బడ్జెట్‌కు ముందురోజు విడుదల చేసిన ఆర్థిక సర్వేలోనే వ్యవసాయ ఉత్పత్తి 4.7శాతం నుండి 1.4శాతానికి గ్రోత్ రేట్ పడిపోయినట్టు చెప్పారని, గత సంవత్సరం 32.89లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాగా 2023`24 సం॥లో 32.16లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అయిందని తెలిపారని పేర్కొన్నారు.

‘ఒకవైపున జనాభా పెరుగుతుండగా ఆహారధాన్యాల ఉత్పత్తి పడిపోవడంతో దిగుమతులు పెరుగుతున్నాయి. అలాగే రు.20లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఏటా కోల్పోతున్నాము. నిరుద్యోగం పెరిగింది. అందులోనూ గ్రామీణ ఉపాధి దెబ్బతింటున్నది. దీనిపై స్పందన లేదు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నది. నిత్యావసరాలు ధరలు విపరీతంగా పెరిగాయి. దీనిపై ఎటువంటి కార్యాచరణ లేదు. మొత్తంగా ఈ బడ్జెట్లో కార్పొరేట్ విధానాలను అమలు చేస్తున్నారు’ అని తమ్మినేని ఆ ప్రకటనలో విమర్శించారు.

‘తెలుగు రాష్ట్రాల విభజన హామీలను అమలు జరపడానికి కేంద్ర బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రానికి హామీ ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఊసే లేదు. బడ్జెట్లో కేటాయింపులు లేవు. గిరిజన యూనివర్సిటీ ములుగులో ఏర్పాటు చేసినప్పటికీ అందుకు తగిన నిధులు కేటాయించలేదు. పాలమూరు ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించలేదు.

మూసీ ప్రక్షాళన గురించి రాష్ట్రప్రభుత్వం మొరపెట్టుకున్నా స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్యాస్ సబ్సిడీ, జల్ జీవన్ మిషన్ కింద తెలంగాణకు రు.16,100కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినప్పటికీ ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవు. ఈ బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపిందని సిపిఐ(ఎం) భావిస్తోందని’ అని తెలిపారు.