Danam Nagender| దానం రాజీనామా తప్పదా ?
పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో అనర్హత అభియోగాలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రేపో..ఎల్లుండో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.
విధాత, హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో అనర్హత అభియోగాలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) రేపో..ఎల్లుండో తన ఎమ్మెల్యే పదవికి(MLA Resignation) రాజీనామా చేస్తారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 10మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddepalli Prasad) 8 మంది ఎమ్మెల్యేల విచారణ ముగించారు. విచారణకు సంబంధించి రెండోసారి కూడా నోటీసు అందుకున్న దానం నాగేందర్ ఇప్పటివరకు కూడా స్పీకర్ కు వివరణ ఇవ్వలేదు. 23 తేదీ లోపు అఫిడవిట్లు ఇవ్వాలని దానం, కడియం శ్రీహరి(Kadiyam Srihari)కి స్పీకర్ ఇచ్చిన నోటీసుల గడువు ఆదివారంతో ముగియనుంది. దానంతో పాటు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం ఇంకా సమాధానం ఇవ్వలేదు. దానం, కడియంలు ఇద్దరు కూడా తమకు మరికొంత సమయం కావాలని స్పీకర్ ను కోరడం గమనార్హం. దీనిపై స్పీకర్ స్పందన ఏమిటన్నదానిపై ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు రూపంలో గట్టి ఒత్తిడి ఎదురవుతుండటం స్పీకర్ కు సమస్యగా తయారైంది.
దానం, కడియంలకే తిప్పలు
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10మంది ఎమ్మెల్యేల్లో దానం, కడియంల పరిస్థితి క్లిష్టంగా తయారైంది. మిగతా వారు తాము పార్టీ మారలేదంటూ అఫిడవిట్లు ఇవ్వడం…వారు పార్టీ మారినట్లుగా బీఆర్ఎస్ సమర్పించిన సాక్ష్యాలు బలహీనంగా ఉండటంతో స్పీకర్ తన విచక్షణాధికారంతో వారిని అనర్హత వేటు నుంచి మినహాయించేందుకు అవకాశం ఉంది. అయితే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ చేరాక..లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయన పార్టీ ఫిరాయింపుకు బలమైన ఆధారం కనిపిస్తుంది. అటు కడియం శ్రీహరి సైతం తన కూతురు కావ్య వరంగల్ ఎంపీగా పోటీ చేసిన సందర్బంలో ఆమె అభ్యర్థిత్వ ప్రతిపాదనలపై ఆయన సంతకాలు చేయడంతో పాటు ఆమె గెలుపు కోసం ప్రచారం నిర్వహించడంతో ఇరుకున పడినట్లుగా భావిస్తున్నారు. దీంతో దానం, కడియంలు అనర్హత వేటు తప్పించుకోవాలంటే రాజీనామా ఏకైక మార్గమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రాజీనామాతో మరింత గందరగోళం
పార్టీ ఫిరాయింపు అభియోగాల నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్ రాజీనామా చేసినట్లయితే..తదుపరి ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్న గందరగోళంగా మారింది. రెండు రోజులు ఢిల్లీలో ఉండి కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలతో మాట్లాడి వచ్చిన దానం, వెంటనే శాసన వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబుని కలవడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే అభిప్రాయం బలపడింది. రాజీనామా చేస్తే..ఉపఎన్నికలలో పోటీ చెయ్యనని దానం కాంగ్రెస్ హైకమాండ్ కు చెప్పినట్టు తెలుస్తుంది. ఏప్రిల్‌లో ఖాళీ కానున్న రాజ్యసభ సీటును తనకు కేటాయించడం లేదా ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలో చోటు కల్పించడం లేదా క్యాబినెట్ హోదాలో నామినేటెడ్ పదవి ఇవ్వడం వంటి ప్రతిపాదనలను దానం కాంగ్రెస్ హైకమాండ్ ముందు పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. లేదంటే ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని, గెలిచాక మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే మంత్రి పదవి కోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు మాత్రం దానం నాగేందర్ కు మంత్రి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారన్న ప్రచారం వినిపిస్తుంది. ఇన్ని గందరగోళాల మధ్య ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దానం ఉప ఎన్నికకు వెళ్తారా? లేదు ఎమ్మెల్సీ అయ్యి మంత్రి పదవి దక్కించుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram