జూబ్లీహిల్స్‌పై దానం కన్ను!

త్వరలో జరగాల్సిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు మాజీ మంత్రి, బీఆరెస్‌ టికెట్‌పై గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం సాగుతోంది. నాగేందర్ పోటీ చేయాలనే ఆలోచన వెనుక ప్రత్యేక కారణాలున్నాయా? లేక బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అనర్హత వేటు పడుతుందనే భయమా? అనే అంశంలో చర్చలు నడుస్తున్నాయి.

జూబ్లీహిల్స్‌పై దానం కన్ను!
  • వెంటాడుతున్న అనర్హత భయం
  • బీఆరెస్‌ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచి
  • లోక్‌సభకు కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ
  • ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్న బీఆరెస్‌
  • స్పీకర్‌ ప్రసాద్‌ వద్ద పిటిషన్‌ పెండింగ్‌
  • 3 నెలల్లో నిర్ణయానికి సుప్రీం ఆదేశం
  • తప్పించుకునేందుకు జూబ్లీహిల్స్‌ రూట్‌?
  • రాజీనామా చేసి పోటీ చేసే యోచన
  • చిట్‌చాట్‌లో ధృవీకరించిన మహేశ్‌గౌడ్‌
  • అనర్హత వేటు చాన్స్‌ లేదన్న పీసీసీ చీఫ్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (విధాత) : త్వరలో జరగాల్సిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు మాజీ మంత్రి, బీఆరెస్‌ టికెట్‌పై గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం సాగుతోంది. నాగేందర్ పోటీ చేయాలనే ఆలోచన వెనుక ప్రత్యేక కారణాలున్నాయా? లేక బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అనర్హత వేటు పడుతుందనే భయమా? అనే అంశంలో చర్చలు నడుస్తున్నాయి.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఈ ఏడాది జూన్ 8న కన్నుమూశారు. త్వరలోనే ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ స్థానం నుండి పోటీకి దానం నాగేందర్ ఆసక్తిగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. శుక్రవారం హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్ బీ మహేశ్ కుమార్ గౌడ్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ సమయంలో ఈ విషయాన్ని ధృవీకరించారు. బీఆర్ఎస్ ఫిర్యాదు ప్రకారం నాగేందర్‌పై అనర్హత వేటు పడే ప్రమాదం ఉందనే భయంతో జూబ్లీహిల్స్ నుంచి పోటీకి నాగేందర్ ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం తెరమీదికి వచ్చింది.

2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్దిగా దానం నాగేందర్ గెలిచారు. 2024 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో దానం నాగేందర్‌తోపాటు మరో 9 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్‌ను వీడి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ ఫిర్యాదులపై మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు పంపారు. ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాల్సి ఉంది. అభివృద్ది కార్యక్రమాల కోసం సీఎంను కలిశామని, కాంగ్రెస్‌లో చేరలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

భిన్నమైన పరిస్థితి ఎదుర్కొంటున్న దానం..
అందరి పరిస్థితి ఎలా ఉన్నా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ది మరో రకమైన పరిస్థితి. 2023 నవంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ అసెంబ్లీలో టెక్నికల్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కానీ.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేసిన అంశాన్ని బీఆర్ఎస్ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఈ నేపథ్యంలో అనర్హత భయాన్ని దానం ఎదుర్కొంటున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. దాని నుంచి బయటపడేందుకు జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

నోటీసులపై సమాధానం తర్వాతే నిర్ణయం
స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాల్సి ఉంది. తర్వాత స్పీకర్ వీరితో ముఖాముఖి విచారణ చేస్తారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు. అయితే దీనికి సమయం పట్టే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలోనూ ఫిరాయింపులపై స్పీకర్లకు ఫిర్యాదులు అందాయి. సాధారణంగా వీటిపై తమ విచక్షణాధికారం మేరకు స్పీకర్లు నిర్ణయం తీసుకుంటారు. దీనికి నిర్ణీత కాలవ్యవధి లేదు. ఎమ్మెల్యేల టర్మ్ పూర్తయ్యే సమయంలో నిర్ణయాలు వెలువడిన ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. గత ప్రభుత్వంలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలపై అనర్హత పడలేదు. ఈసారి ఎలా పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి గతంలో వ్యాఖ్యానించారు. నాగేందర్ పై అనర్హత వేటు పడుతోందని అనుకోవడం లేదని ఇవాళ పీసీసీ చీఫ్ బీ మహేశ్ కుమార్ గౌడ్ కూడా చెప్పడం గమనార్హం.

ఒకవేళ అనర్హత వేటు పడే ప్రమాదం పొంచి ఉందనుకుంటే దాని కంటే ముందే రాజీనామా చేయాలని కూడా ఎమ్మెల్యేలు భావిస్తున్నారనే చర్చ కూడా తెరమీదికి వచ్చింది. నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి ఈ 10 సీట్లు బీఆర్ఎస్‌వి. ఉప ఎన్నికల్లో ఈ సీట్లు తిరిగి దక్కించుకోవాలనే పట్టుదల గులాబీ పార్టీకి ఉంటుంది. అదే సమయంలో ఈ 10 సీట్లను గెలుచుకుంటే బీఆర్ఎస్ ఆధిపత్యానికి గండికొట్టామని చెప్పుకొనే అవకాశం హస్తం పార్టీకి దక్కుతుంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కోల్పోయినా అధికారానికి నష్టం లేదు. కానీ, రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలు ఆ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసే అవకాశం లేకపోలేదు.