Deputy CM Bhatti | పర్యాటక కేంద్రంగా నేలకొండపల్లి బౌద్ధ స్థూపం: డిప్యూటీ సీఎం భట్టి,

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక, చారిత్రాక, ప్రకృతి సందర్శన స్థలాలను అభివృద్ధి చేయడం ద్వారా జిల్లా పర్యాటక రంగానికి కొత్త సోబగులు అద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులు తెలిపారు.

Deputy CM Bhatti | పర్యాటక కేంద్రంగా నేలకొండపల్లి బౌద్ధ స్థూపం: డిప్యూటీ సీఎం భట్టి,

ఖమ్మానికి పర్యాటక సొబగులు
నేలకొండపల్లి బౌద్ధ స్తూపం అభివృద్ధికి నిధులు
జిల్లాలో ఏకో, టెంపుల్ టూరిజం అభివృద్ధి
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి, జూపల్లి వెల్లడి

విధాత, హైదరాబాద్ : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక, చారిత్రాత్మక, ప్రకృతి సందర్శన స్థలాలను అభివృద్ధి చేయడం ద్వారా జిల్లా పర్యాటక రంగానికి కొత్త సొబగులు అద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం నేలకొండపల్లి బౌద్ధ స్థూపాన్ని సందర్శించిన మంత్రులు.. అనంతరం ఖమ్మం ఖిల్లాను సందర్శించారు. వారితో ఎంపీ రఘురాంరెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక కృషి జరుగుతోందన్నారు. ఖమ్మం జిల్లాలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. టూరిజం అభివృద్ధికి నిధుల కొరత లేదన్నారు. టూరిజం అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చారిత్రాత్మక నేలకొండపల్లి బౌద్ధ స్తూపం అభివృద్ధికి 10 కోట్లు కేటాయింపులు చేస్తామని తెలిపారు. ఆర్కియలాజికల్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి అభివృద్ధి చేస్తామన్నారు. బౌద్ధ స్తూపాలతో కలిసి ఫెస్టివల్ పెట్టాలన్నారు. బౌద్ధ బోధనలను పాశ్చాత్య దేశాలలో ప్రతి వారంలో రెండు రోజుల పాటు అమలు చేస్తారని తెలిపారు. వారానికి ఒక రోజు బుద్ధిజం పేరుతో పర్యటించాలన్నారు. ఇందుకు మనమే ఆదర్శం కావాలన్నారు. ఖమ్మం ఖిల్లాపై తుమ్మల నాగేశ్వరరావు కోరిక మేరకు టూరిజం శాఖ మంత్రి జూపల్లి రోప్ వే మంజూరు చేశారని భట్టి విక్రమార్క తెలిపారు. నేలకొండపల్లి బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేస్తే విదేశాలకు చెందిన టూరిస్ట్‌లను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ రాజ్యంలో టూరిజం అభివృద్ధి చేస్తామని చెప్పారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా తెలంగాణలో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని తెలిపారు. తెలంగాణలో టూరిజం అభివృద్ధికి కేంద్రం నుంచి కూడా నిధులను కోరుతామని భట్టి విక్రమార్క వెల్లడించారు.

తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఖమ్మం నగరానికి అత్యంత సమీపంలో 500 ఎకరాలలో వెలుగుమట్ల పార్కు ఉందన్నారు. వెలుగుమట్ల పార్కులో ఏకో టూరిజానికి అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచలో కూడా ఎకో టూరిజానికి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. స్తంభాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కాకతీయుల కాలంలో నిర్మించిన కూసుమంచి గణపేశ్వర స్వామి ఆలయం, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాలను టెంపుల్ టూరిజంలో భాగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

దేశంలోనే నేలకొండపల్లి బౌద్ధ స్తూపానికి ప్రాధాన్యం ఉన్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. బౌద్ధ స్తూపం పరిసరాల్లో ఇంకా స్తూపాలున్నాయని, ఉత్తమ పర్యాటక ప్రాంతంగా దీనిని తీర్చిదిద్దాలని అధికారులకు చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే టూరిజం అభివృద్ధి జరిగిందన్నారు. పాలేరు నియోజకవర్గంలో రిజర్వాయర్ నిర్మాణం కాంగ్రెస్ హయాంలో జరిగిందన్నారు. నేలకొండపల్లి బౌద్ధ స్తూపం 1వ శతాబ్దంలోనిదన్నారు. దక్షిణ భారతదేశంలో అతి పెద్దది ఇక్కడి బౌద్ధ స్తూపమని తెలిపారు. ఇక్కడ బుద్ధిస్ట్ మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. అభివృద్ధికి సంబంధించిన సమగ్ర రిపోర్ట్ తయారు చేయాలన్నారు. ప్రభుత్వం టూరిజానికి పెద్దపీట వేస్తుందన్నారు. నేలకొండపల్లి భక్త రామదాసు జన్మించిన స్థలం అని గుర్తు చేశారు.

బౌద్ధ స్తూపం వద్ద పర్యాటక అధికారులతో సమావేశంలో పర్యాటకులకు ఆకర్షించేందుకు ఏం చేద్దాం ఎలా చేయాలో అధికారులు అంచనాలు తయారు చేయాలని ఆదేశించినట్లుగా మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నేలకొండపల్లి బౌద్ధ స్థూపం అభివృద్ధికి ఎందుకు ఇంత కాలం నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యం ఉన్న బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం తీసుకుని రావాలని ఆదేశించారు. ఇక్కడి ఎనిమిది ఎకరాలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్నారు. స్తూపానికి లైటింగ్, నీటి లభ్యత, బోటింగ్ ఏర్పాటుకు సమగ్ర ప్రణాళిక లు తయారు చేయాలన్నారు. బౌద్ధ స్థలాలు తక్కువ ఉన్నాయని, తెలంగాణాలో ఉన్న మూడు స్థలాలో పాలేరు కీలకమైందన్నారు.