TELANGANA ASSEMBLY | ధరణిలో కొల్లగొట్టిన భూముల లెక్కలు బయటపెట్టాలి : బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
ధరణిలోని సమస్యలపై చర్చిస్తున్న ప్రభుత్వం పెద్ద ఎత్తున భూ దోపిడి సాగిందని చెబుతున్నందునా ధరణి పోర్టల్ ద్వారా కొల్లగొట్టబడిన భూముల వివరాలు బయటపెట్టాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు

విధాత, హైదరాబాద్ : ధరణిలోని సమస్యలపై చర్చిస్తున్న ప్రభుత్వం పెద్ద ఎత్తున భూ దోపిడి సాగిందని చెబుతున్నందునా ధరణి పోర్టల్ ద్వారా కొల్లగొట్టబడిన భూముల వివరాలు బయటపెట్టాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ధరణిపై చర్చలో మాట్లాడిన మహేశ్వర్‌రెడ్డి ధరణితో బీఆరెస్ నేతలు వేల కోట్ల ఎకరాలు కబ్జా చేశారన్న ఆరోపణలున్నందునా ఆ నేతలు ఎవరు? కాజేసిన భూమి ఏదన్న వివరాలను ఎందుకు ప్రభుత్వం బహిర్గతం చేయడం లేదని, వాటి వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గతంలో ఇది 2 లక్షల కోట్ల కుంభకోణమని మంత్రి ఆరోపణలు చేశారని మహేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. భారీ కుంభకోణాలు జరిగాయంటున్న ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ఈ పోర్టల్ ను గత ప్రభుత్వం విదేశీ కంపెనీకి అప్పగిస్తే.. ఈ ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. ధరణి పోర్టల్ నిర్వహణను ఎన్‌ఐసీకి ఇచ్చే ఆలోచన ఉందా అని, ధరణి పోర్టల్ పై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపిస్తారా అని మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ధరణి వచ్చాక అటవీ భూములు, ప్రభుత్వ భూములు తగ్గాయని అంటున్నారని వాటిపై విచారణ జరిపించాలన్నారు.