Earthquake : ములుగు కేంద్రంగా భూకంపం.. హైదరాబాద్‌లోనూ ప్రకంపనలు

తెలంగాణలో భూకంపాలు అత్యంత అరుదుగా సంభవిస్తుంటాయి. దేశంలో మొత్తం నాలుగు సెస్మిక్‌ జోన్లు.. జోన్‌ 2, జోన్‌ 3, జోన్‌ 4, జోన్‌ 5.. ఉన్నాయి. వీటిలో ఐదవ జోన్‌ భూకంపాలు ఎక్కువగా వచ్చేది. జోన్‌ 2 అనేది అత్యంత తక్కువ భూకంపాలు వచ్చేది. తెలంగాణ ప్రాంతం జోన్‌ 2లో ఉన్నది.

Earthquake : ములుగు కేంద్రంగా భూకంపం.. హైదరాబాద్‌లోనూ ప్రకంపనలు

Earthquake : తెలంగాణలో బుధవారం ఉదయం7.27 గంటలకు 5.3 తీవ్రతతో భూమి కంపించింది. ములుగు కేంద్రంగా సంభవించిన ఈ భూకంపం ప్రభావం హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కూడా కనిపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ ప్రకటించింది. ఉదయం పనుల్లో నిమగ్నమైన ప్రజలు.. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఇళ్లలోని వస్తువులు చిందరవందరగా పడిపోయాయి.  అయితే ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్టు తెలియరాలేదు. ములుగు కేంద్రంగా  కిలోమీటర్ల లోతున భూమి కంపించిందని, దీని ప్రభావం 250 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్నదని ఎన్‌సీఎస్‌ తెలిపింది. పొరుగునే ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు కనిపించాయి.

హైదరాబాద్‌లోని వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు కనిపించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లెందులోనూ ప్రకంకపనలు కనిపించాయి. రెండు సెకన్ల నుంచి ఏడు సెకన్లపాటు భూమి కంపించినట్టు చెబుతున్నారు. ఏపీలోని విజయవాడ, విశాఖపట్టణం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

తెలంగాణలో భూకంపాలు అత్యంత అరుదుగా సంభవిస్తుంటాయి. దేశంలో మొత్తం నాలుగు సెస్మిక్‌ జోన్లు.. జోన్‌ 2, జోన్‌ 3, జోన్‌ 4, జోన్‌ 5.. ఉన్నాయి. వీటిలో ఐదవ జోన్‌ భూకంపాలు ఎక్కువగా వచ్చేది. జోన్‌ 2 అనేది అత్యంత తక్కువ భూకంపాలు వచ్చేది. తెలంగాణ ప్రాంతం జోన్‌ 2లో ఉన్నది. దేశంలోని 11 శాతం ప్రాంతం మాత్రమే ఐదవ జోన్‌లో ఉన్నది. మరో 18 శాతం నాలుగవ జోన్‌లో ఉన్నది. మూడవ జోన్‌లో 30 శాతం ప్రాంతం ఉన్నది.  మిగిలిన ప్రాంతం అంతా రెండో జోన్‌ పరిధిలో ఉంటుంది.