Elections | ఓటరుకు తాయిలాల పంపిణీ.. మేనేజ్మెంట్లో పార్టీలు నిమగ్నం

నెలరోజులు సాగిన ఎన్నికల హంగమా, పదిహేను రోజులు హోరెత్తిన ప్రచారం ముగిసి ఆఖరి అంకానికి ప్రధాన పార్టీలు తెరతీశాయి

Elections | ఓటరుకు తాయిలాల పంపిణీ.. మేనేజ్మెంట్లో పార్టీలు నిమగ్నం

తమవైపు తిప్పుకునేయత్నం
ప్రధాన పార్టీల నేతల బిజీబీజీ
ఎన్నికల్లో భాగమైన పంపిణీ
కొరవడిన అధికారుల నిఘా
పోలింగు ఏజెంట్ల ఏర్పాటు

విధాత ప్రత్యేక ప్రతినిధి: నెలరోజులు సాగిన ఎన్నికల హంగమా, పదిహేను రోజులు హోరెత్తిన ప్రచారం ముగిసి ఆఖరి అంకానికి ప్రధాన పార్టీలు తెరతీశాయి. ఎన్నికల మేనేజ్మెంటులో అత్యంతముఖ్యమైన ఘట్టాన్ని కొనసాగించడంలో క్షేత్రస్థాయిలో నిమగ్నమయ్యారు. ఓటరుకు తాయిలాలు పంచడంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆరెస్ పోటీపడుతున్నాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే విధంగా బూతు స్థాయి నుంచి పంపిణీ కార్యక్రమం సాగుతోంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను ఆ పార్టీల ప్రధాన నేతలు, పోటీచేసిన అభ్యర్ధులు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఎన్నికలంటేనే సామాన్యులు, సాధారణ పార్టీలు భరించలేని స్థాయికి చేరాయనే విమర్శలున్నాయి.

ఇప్పటికే ప్రచారానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టినందున ఈ సారి ఓటరుకిచ్చే నగదు మొత్తం కొంత తగ్గినట్లు చర్చ సాగుతోందీ. ఈ వ్యవహారంలో ఆరితేరిన బీఆరెస్ సైతం కొంత తగ్గించి పంపిణీ చేయడంతో మిగిలిన పార్టీలు కూడా ఇదే బాటలో పయనించినట్లు చెబుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతో దూల తీరిన పార్టీలు, మరోసారి అదే స్థాయిలో పంపిణీ చేయాలంటే కొంత భారంగా మారిందనే వాదనవినిపిస్తోంది. భారీ పోటీతో పాటు డబ్బున్న అభ్యర్ధులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోందీ. గెలుపే లక్ష్యంగా ఓటరును ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

నిఘా బృందాల కళ్ళుగప్పి పంపిణీ

ఎన్నికల కమీషన్ అధికారులు, సిబ్బంది, పోలీసులు, నిఘా వ్యవస్థను నిదురపుచ్చి ఓటరుకు నగదు పంపిణీ కార్యక్రమం యధేచ్చగా ఈ వ్యవహారం సాగిపోతోంది. ఎన్నికలు అనగానే ఈ పంపిణీ సైతం షరామాములు వ్యవహారంగా మారిపోయింది. అటు ఓటరుకు ఇటు పోటీ చేసే అభ్యర్ధులు, పార్టీలకు తప్పనిసరి అంశంగా తయారైందీ. సర్వత్రా ఈ తతంగం సాగిపోతున్నా ఎన్నికల కమిషన్ అధికారులు కూడా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

ఇదంతా బహిరంగ సత్యమే అయినప్పటికీ ఎన్నికల కార్యకలాపాల్లో భాగమన్నట్లుగా పంపిణీ కార్యక్రమం సాఫీగా సాగిపోతూనే ఉంటాయి. ఇంటింటి ప్రచారం, వ్యక్తిగత ప్రచారం, పోల్ చిట్టీల పంపిణీ పేరుతో ఓటుకు నోటు పథకం సాగిపోతోంది. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే చాలా ప్రాంతాల్లో ఈ సారి ఓటు రేటు పడిపోయిందని ఓటర్లు అందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ. వెయ్యి నుంచి రూ.500 ముట్టజెప్పినట్లు సమాచారం.

బాగా పోటీ ఉన్న ప్రాంతాల్లో ఇంకొంత ఎక్కువ అందజేసి ఓటరును తమ వైపు తిప్పుకునేందుకు పోటీపడ్డట్లు చెబుతున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో వస్తు రూపేణా అందజేశారు. చీరలు, కుక్కర్లు, మిక్సీలు, యువతకు క్రికెట్ కిట్ లు అందజేశారు. ఎక్కువగా నగదు అందించేందుకు ప్రయత్నించారు. నగదు పంపిణీ సులభతరం కావడంతో ఇటీవల కాలంలో అభ్యర్ధులు దానికి ప్రాధాన్యతనిస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం మద్యం పంపిణీ చేశారు. ఎక్కువ తక్కువలో తేడా ఉన్నప్పటికీ మూడు పార్టీలు పంపిణీలో పోటీపడ్డాయి.

పోలింగ్ ఏర్పాట్లలో పార్టీలు

సోమవారం జరుగనున్న పోలింగుకు అవసరమైన ఏర్పాట్లలో ప్రధాన పార్టీలు,అభ్యర్ధులు నిమగ్నమయ్యారు. రేపటి పోలింగు సందర్భంగా తమ తమ పార్టీల నుంచి పోలింగు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. రేపటి పోలింగును నిరంతరం పర్యవేక్షించే విధంగా వారిని అప్రమత్తం చేస్తున్నారు.