Electricity Department ADE Ambedkar Arrested | రూ.300కోట్ల అక్రమాస్తులు.. విద్యుత్ ఏడీఈ అంబేద్కర్ అరెస్టు
హైదరాబాద్‌లో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్‌ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్టు చేసి రూ.300కోట్ల అక్రమాస్తులు స్వాధీనం.

విధాత, హైదరాబాద్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ను ఏసీబీ అరెస్టు చేసింది. ఏసీబీ అధికారులు 18 బృందాలుగా విడిపోయి హైదరాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో అంబేద్కర్ నివాసంతో పాటు బినామీలు, బంధువుల ఇళ్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.300కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించినట్లుగా ఏసీబీ డీఎస్సీ ఆనంద్ తెలిపారు. అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లో రూ.2 కోట్ల 18లక్షల రూపాయల నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. కొండాపూర్ లోని మ్యాగ్నాలేక్ లోని వ్యూ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న అంబేద్కర్ కు.. నానక్ రామ్ గూడాలోని అంబేద్కర్ పర్సనల్ కార్యాలయం ఉంది. ఇబ్రహీంబాగ్‌లో ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్ నివాసంలో భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ఇళ్ల డాక్యుమెంట్లు, వ్యవసాయ భూముల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో ఆరు ఇంటి స్థలాలు గుర్తించారు. 2కోట్లకు పైగా ఉన్న స్థలాల డాక్యుమెంట్లను గుర్తించారు. 70లక్షల బ్యాంకు బ్యాలెన్స్, 5.50లక్షల నగదు, 40లక్షల విలువైన రెండు కార్లు సీజ్ చేశారు. శేర్లింగంపల్లిలో అదునాతనమైన ఐదు అంతస్తుల భవనం, నగర శివారులో అధునాతన ఫామ్ హౌస్, పది ఎకరాల స్థలంలో పెద్ద కెమికల్ కంపెనీ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఇబ్రహీంబాగ్‌లో ఏడీఈగా పనిచేస్తున్న ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని ఏసీబీ దాడులు నిర్వహించింది. తనిఖీల్లో ఇప్పటికే సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో 10 ఎకరాలు వ్యవసాయ భూమి, మరో వెయ్యి గజాల్లో వ్యవసాయ క్షేత్రం గుర్తించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయని..సోదాలు ముగిశాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు.