Jalasoudha | తెలంగాణ నీటిపారుదల శాఖలో ఇంజినీర్ల ఇష్టారాజ్యం!
Jalasoudha | అక్కడ ఇంజినీర్లదే ఇష్టారాజ్యం! కర్త, కర్మ, క్రియ.. అన్నీ వారే! అక్కడ ఒక ఇంజినీరునునియమించాలన్నా, బదిలీ చేయాలన్నా, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నా.. లేక వద్దనుకున్నా.. ఇంజినీరింగ్ అధికారి మాత్రమే చేయాలి! ఆ విధానమే వారికి బలంగా, వరంగా మారింది. అదే తెలంగాణ నీటిపారుదల శాఖ!! వేల కోట్ల రూపాయల్లో అవినీతి జరుగుతున్నదని ఆరోపణలు వచ్చినా, వాటిని ఎత్తిచూపుతూ విజిలెన్స్ కమిషన్ చర్యలకు సూచిస్తున్నా, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిజనిర్ధారణ చేసినా.. ఆఖరుకు అవినీతి నిరోధక శాఖ కొందరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టకున్నా.. పట్టింపు లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిధులకు ఏ మాత్రం ఢోకాలేని ఇరిగేషన్ శాఖ
బదిలీలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వారిష్టం
శాఖలో మొత్తం 15వేల మంది ఇంజినీర్లు
కట్టడికి ఐఏఎస్‌ను నియమించాల్సిందే
ఏళ్లతరబడి కోరుతున్న అధికారులు
మంత్రికి, ముఖ్య కార్యదర్శికీ వినతులు
అయినా ఫలితం లేదంటున్న సిబ్బంది
వాలంటరీ నుంచి మహిళా అధికారి చక్రం!
ఇప్పటికే ఆమెపై ఉన్నస్థాయికి ఫిర్యాదులు?
Jalasoudha | హైదరాబాద్, జూన్ 4 (విధాత) : తెలంగాణకు వ్యవసాయమే ప్రధాన రంగం. అందుకే వరుస ప్రభుత్వాలు నీటిపారుదల శాఖకు వేల కోట్ల నిధులు వెచ్చిస్తూ వచ్చాయి. జీతాలు కూడా అదే స్థాయిలో చెల్లిస్తూ.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ వాహన సదుపాయం కల్పిస్తున్నారు. గడిచిన రెండున్నర దశాబ్దాలుగా సాగునీటి ప్రాజెక్టులు అన్ని ప్రభుత్వాలకూ ప్రాధాన్య రంగంగానే ఉంటూ వచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన ఈ దశాబ్ద కాలంలో పలు ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంటున్నాయి. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (కేఎల్ఐపీ) అప్పుల కోసం ఏకంగా కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రాంట్లు తీసుకుంటున్నారు. దీంతో సాగునీటి పారుదల శాఖలో నిధులకు ఇబ్బంది అనేదే లేకుండా పోయింది. సరిగ్గా ఈ విషయమే ఆ విభాగంలో పనిచేస్తున్న ఇంజినీర్లకు వరంగా మారిందనే చర్చ నడుస్తున్నది. లష్కర్ మొదలు ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) వరకు సుమారు పదిహేను వేల మంది వరకు నీటిపారుదల శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో లష్కర్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌ను మినహాయిస్తే 13వేల మంది వరకు ఇంజినీర్లు ప్రధాన కార్యాలయంతోపాటు క్షేత్రస్థాయి వరకు విధుల్లో ఉన్నారు.
గతంలో శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో అక్రమాలు పెద్ద ఎత్తున వెలుగు చూశాయి. ఆ తరువాత ప్రత్యేక రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దేశంలో అతి పెద్ద కుంభకోణంగా ఇది అపఖ్యాతి మూటగట్టుకున్నది. తెలంగాణ విజిలెన్స్ కమిషన్ తొలి విడతగా 57 మంది ఇంజినీరింగ్ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, బారాజ్ మరమ్మత్తుకు అయ్యే వ్యయాన్ని సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీ ఎల్ అండ్ టీ పీఈఎస్ జాయింట్ వెంచర్ నుంచి వసూలు చేయాలని నీటి పారుదల శాఖకు సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ ఒక్క ప్రాజెక్టు కాకుండా చాలా ప్రాజెక్టులలో ఇంజినీర్లు జేబులు నింపుకోవడం తప్ప నాణ్యత విషయంలో ఏమాత్రం పట్టింపు లేకుండా ఉన్నారనే విమర్శలు చాలా కాలం నుంచీ ఉన్నాయి. ఇంజినీర్ల తప్పిదాలపై ఎన్ని విచారణలు జరిగినా, ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా, విజిలెన్స్ కమిషన్ సిఫారసులు చేసినా, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిజ నిర్ధారణలు చేసినా కఠిన చర్యలు తీసుకున్న ఉదంతాలు మాత్రం పెద్దగా కనిపించడం లేదు. దీని వెనుక చాలా విషయాలు ఉన్నాయని సాగునీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి.
సాగునీటిపారుదల శాఖ పరిధిలో ఎర్రమంజిల్‌లోని జలసౌధలో ప్రధాన కార్యాలయం ఉన్నది. ఇక్కడి నుంచే ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ, డిజైన్లతో పాటు ఇంజినీర్ల బదిలీలు జరుగుతుంటాయి. అలా ఈ కార్యాలయం కీలకంగా నిలిచింది. ఈ కార్యాలయంలో ఇంజినీర్లు, ఉద్యోగులను పర్యవేక్షించేందుకు ఇంజినీర్ ఇన్ చీఫ్ (అడ్మినిస్ట్రేషన్) ఉన్నారు. ఈయన కింద ఒక సూపరింటెండెంట్ ఇంజినీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ విభాగం నియామకాలు, పదోన్నతులు, బదిలీలు, డెప్యుటేషన్లు, శాఖాపరమైన చర్యలు, ఇంక్రిమెంట్లు, జీతాల చెల్లింపులు, విజిలెన్స్ కమిషన్ సిఫారసులను అమలును పర్యవేక్షించి అమలు చేయాల్సి ఉంటుంది. మెజారిటీ ఉద్యోగులు ఇంజినీర్లే కావడం, అడ్మినిస్ట్రేషన్ ఈఎన్సీ కూడా వారే కావడంతో పదోన్నతులు, బదిలీల్లో వారికి ఎదురులేకుండా పోతున్నదని అంటున్నారు. తమకు నచ్చిన వారికి ఎక్కడో ఒకచోట సర్ధుబాటు చేసి పదోన్నతులు ఇస్తున్నారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
కోరుకున్న చోటుకు బదిలీలు!
బదిలీల్లో కూడా కోరుకున్న చోటుకు పంపిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిందే తడవు, సంబంధిత ఇంజినీర్‌కు వెంటనే సమాచారం వెళ్తుందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ విషయం బయటకు పొక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని, దీంతో సదరు ఇంజినీర్ సచివాలయం వెళ్లి పైరవీ చేసుకుని శిక్ష నుంచి తప్పించుకోవడం పరిపాటయిందని చెబుతున్నారు. ఎవరికైనా పదోన్నతి కావాలని అనుకుంటే ఆ అధికారిని సెలవులో పంపించి, పదోన్నతి తీసుకోవడం, ఆ తరువాత నిబంధనలకు విరుద్ధంగా కొనసాగడం ఆనవాయితీగా వస్తోందనే చర్చ వినిపిస్తున్నది. ప్రధాన కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఇంజినీర్ల సేవలు అవసరం లేకపోయినా అక్రమంగా కొనసాగిస్తున్నారని ఉద్యోగులు అంటున్నారు. పరిపాలనా విభాగంలో క్లరికల్ స్టాఫ్ మాత్రమే విధులు నిర్వర్తించాలి. కానీ పదుల సంఖ్యలో డిప్యూటేషన్ ముసుగులో కొనసాగుతూ కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు, అవినీతికి పాల్పడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన 57 మంది ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సుదీర్ఘమైన సిఫారసులు చేసింది. మున్ముందు ఇలాంటి అక్రమాలు, అవినీతి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతున్నందున ఇంజినీర్లపై చర్యలు తీసుకోవాలా? వద్దా? అనేదానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది. ఒకవేళ చర్యలు తీసుకుంటే జ్యుడిషియల్ ఎంక్వరీపై ప్రభావం చూపిస్తుందా? అనే అంశంపై న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని మాజీ ఇంజినీర్లు సూచిస్తున్నారు.
ఐఏఎస్ అధికారి నియామకం ఉండదా?
కార్యదర్శి స్థాయి ఐఏఎస్ అధికారిని ఎర్రమంజిల్‌లోని జలసౌధలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా నియమించాలనే అభిప్రాయం కొన్నేళ్లుగా ఉన్నది. ఇదే విషయాన్ని సచివాలయంలోని నీటి పారుదల శాఖలో పనిచేస్తున్న కొందరు అధికారులు పలు సందర్భాలలో మంత్రి, ముఖ్య కార్యదర్శి చెవులకు చేరవేశారని అంటున్నారు. అక్రమాలు, అవినీతి పనులకు అడ్డుకట్ట వేయాలంటే ఐఏఎస్ అధికారికి పరిపాలన బాధ్యతలు అప్పగించాలని ఒత్తిడి పెంచారు కూడా. కాళేశ్వరం ప్రాజెక్టు తప్పిదాలు మున్ముందు పునరావృతం కాకుండా ఉండేందుకు, ప్రజాధనం దుర్వినియోగం అరికట్టేందుకు అడ్డుకట్ట పడాల్సిందేనంటున్నారు. పరిపాలనా విభాగం నుంచి బదిలీపై వెళ్లి, రాజేంద్రనగర్ వాలంటరీలో పనిచేస్తున్న ఒక మహిళా అధికారి ఇప్పటికీ తన హవా కొనసాగిస్తున్నారని జలసౌధ సిబ్బంది అంటున్నారు. అక్కడినుంచే ఆమె తనకు సంబంధం లేని పరిపాలన విభాగాన్ని శాసిస్తున్నారని చెబుతున్నారు. ఆమెకు సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులు, సిబ్బంది ఆదేశాలను అమలు చేస్తుంటారని తెలిసింది. షాడోగా వ్యవహరిస్తున్న ఆమెపై విచారణ జరపాలని ఇంజినీర్ ఇన్ చీఫ్ కు ఫిర్యాదులు వెళ్లాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.