ఎక్సైజ్ కమిషనర్ బూతు పురాణం.. నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌కు గుండెపోటు

తెలంగాణ ఎక్సైజ్ శాఖలో కమిషనర్, డిప్యూటీ కమిషనర్ మధ్య వివాదం నెలకొంది. ఇటీవల కానిస్టేబుల్ ట్రాన్సఫర్ కోసం కమిషనర్ ఆఫీసుకు వెళ్లినప్పుడు తన పట్ల కమిషనర్ తీవ్ర అభ్యంతరకరంగా ప్రవర్తించారని నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి వెల్లడించారు. తాను ఏ తప్పు చేయకపోయినా కమిషనర్ తనను తీవ్రంగా దుర్భాషలాడినట్లు తెలిపారు. ఆ విషయాన్ని తట్టుకోలేక కిందపడిపోయానని, దీంతో ఆసుపత్రి పాలైనట్లు సామాజిక మాధ్యమంలో ఆయన పేర్కొన్నారు.

విధాత, హైదరాబాద్:

పోలీసు శాఖ కన్నా ఘోరంగా తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో ఉన్నతాధికారి తిట్లదండకం, ఒంటెత్తు పోకడలు పలువురికి గుండెపోటు తెప్పిస్తున్నాయి. ఆయన తన నోటికి ఎంత వస్తే అంత తీవ్రంగా దూషించడంతో పలువురు అధికారులు గజగజ వణుకుతున్నారు. కొందరైతే ఆయన వద్దకు వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారంటే ఆయన దురుసుతనం, దుందుడుకుతనం, బండబూతులు ఏ స్థాయిలో ఉన్నాయో తాజాగా జరిగిన ఘటనతో స్పష్టమవుతున్నది. ఒక ఉన్నతాధికారి మాట్లాడే భాష ఇదేనా? తిట్టమని ఎవరు నేర్పారు? అంటూ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లో నలుగురు కలిసిన చోట చర్చించుకుంటున్నారు. రెండు నెలల వ్యవధిలో ఇద్దరు అధికారులకు గుండెపోటుకు గురయ్యారు. ‘చేయని తప్పుకు వెధవ, ఈడియట్ అన్నప్పుడు నేను స్వీకరించలేకపోయాను, అలాంటి మాట అనొద్దు సారు అని ఎదురు చెప్పినందుకు ఎక్సైజ్ కమిషనర్ ఇగో హర్ట్ అయ్యింది’ అని నిజామాబాద్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో మానసిక సంఘర్షణకు లోనై సోషల్ మీడియాలో తన ఆవేదన, ఆక్రోషణతో పోస్టు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

అరేయ్, ఒరేయ్, వెధవ, ఈడియట్, యూజ్ లెస్ ఫెలో వంటి అవమానకరమైన తిట్లు తిట్టినా, దూషించినా ఇన్నాళ్లు నెట్టుకు వస్తున్న ఎక్సైజ్ అధికారులు, మిత్రులకు సోమిరెడ్డి నమస్కారాలు తెలిపారు. ‘నేను పెరిగిన వాతావరణంలో ఆత్మాభిమానంతో బ్రతకడమే జీవితం అని అని నమ్మాను, ఆకలితోనైనా చస్తా కాని… ఆత్మాభిమానం వదులుకోలేము అని అన్న కాళోజీ మాటలు యాది చేసుకుంటూ చేతకాని, చావలేని, చైతన్యం చచ్చిన ఎక్సైజ్ శాఖలో గత మూడు దశాబ్ధాలుగా ఉద్యోగం చేసినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను. నా కుటుంబంతో చర్చించిన తరువాత, ఆత్మాభిమానం కన్నా ఉద్యోగం ముఖ్యం కాదని భావించి కొలువు వీడి వెళ్లాలని నిర్ణయించుకున్నాను’ అని  సోమిరెడ్డి తెలిపారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఇప్పటి వరకు తనతో ప్రయాణం చేసిన సహచరులు, సహకరించిన ఉన్నతాధికారులు, మిత్రులు, సిబ్బందికి సోమిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. ‘మీరు చూపిన ఆదరాభిమానాలకు ధన్యవాదాలు. నాలాంటి అధికారి ఎక్సైజ్ శాఖలో ఇమడ లేడని చాలా సార్లు అనుకున్నాను. నా మేలు కోరే ఉణ్నతాధికారుల సహకారంతో ఉద్యోగం కొనసాగించాను. వారందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని తెలిపారు. ‘ఇటీవల ఎక్సైజ్ ఉన్నతాధికారి తిట్లదండకం, వ్యక్తిగత దూషణలతో ఇక నేను డిపార్ట్ మెంట్ లో ఇమడలేనని, కొనసాగలేనని అర్థమైంది. గురువారం నాడు నేను చేయని తప్పుకి వెధవ, ఈడియట్ అని గట్టిగా అరిచినప్పుడు నా గుండెను గాయపరిచింది. నా సున్నిత మనస్తత్వం స్వీకరించలేకపోయింది. ఈ తిట్ల దండకానికి నేను ఎదురు చెప్పాను. ఇలాంటి సూటిపోటి మాటలు అనొద్దు సార్ అని ఎదురు చెప్పడంతో కమిషనర్ ఇగొ హర్ట్ అయ్యింది’ అనిొ సోమిరెడ్డి తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. తనలా డిపార్ట్ మెంట్ లో ఎవరు కూడా ఎదురు సమాధానం ఇచ్చి ఉండరు కదా అన్నారు. దీంతో కమిషనర్ తన ఆగ్రహావేశం చూపించారు. పది నిమిషాల పాటు నన్ను అనరాని మాటలతో దూషించారు. నువ్వు వెధవాతి వెధవవు, నువ్వు చేసిన వెధవ పనులు అంటూ నాకు సంబంధం లేని అంశాలను చదివి విన్పించాడు. నేను పుట్టి పెరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నడు ఎదుర్కోని విధంగా ఘోరంగా అవమానం చేశాడు. నా నోటితోనే వెధవ అనిపించే ప్రయత్నం చేశాడు. కమిషనర్ దూషిస్తున్న సమయంలో తనతో పాటు నలుగురు అధికారులు, ఉద్యోగులు కూడా ఉన్నారు. అందరి ముందు ఈ విపత్కర పరిస్థితి చాలా మానసిక వ్యథకు, ఒత్తిడికి గురికి చేసినా గుండె నిబ్బరం చేసుకుని కూర్చుండిపోయాను. ఆ తరువాత బయటకు వచ్చి తనకు జరిగిన వేధింపులు, అవమానాలు, సూటిపోటి మాటలను సహచర అధికారులు, మిత్రులకు వివరించాను. ఇలా ఎలా వ్యక్తిగతంగా దూషిస్తాడని, ఆయనను ప్రశ్నించాలని అందరికీ తెలియచేశాను. కమిషనర్ అవమానించిన దాని కన్నా, అన్యాయాన్ని ప్రశ్నిద్ధాం అన్నప్పుడు సహచరులు ఆలోచనలో పడడం, మిత్రులు మౌనం వహించడం నన్ను తీవ్రంగా కలచి వేసింది’ అన్నారు. ఈ స్పందన చూసి అక్కడే కుప్పకూలి పోగా, వెంటనే కొందరు మిత్రులు తనను చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారని కోలుకున్న తరువాత తనకు తెలిసిందని తెలిపారు. తనకు ప్రాణాపాయం తప్పిందని పేర్కొన్నారు. తనను హాస్పిటల్ లో చేర్పించిన మిత్రులకు కుటుంబ సభ్యుల తరఫున సోమిరెడ్డి తన సోషల్ మీడియా పోస్టులో ధన్యవాదాలు తెలిపారు.

చెవ్వూరి హరికిరణ్ పై చర్యలు తీసుకోవాలి

డిప్యూటీ కమిషనర్ వీ సోమిరెడ్డిని తీవ్రంగా పరుష పదజాలంతో దూషించిన ఎక్సైజ్ క‌మిష‌న‌ర్‌ చెవ్వూరి హరికిరణ్ పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మ‌న్ ల‌చ్చిరెడ్డి, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఓడనాల రాజ‌శేఖ‌ర్‌ డిమాండ్ చేశారు. అవ‌మాన ప‌ర్చిన క‌మిష‌న‌ర్‌ను వెంట‌నే స‌స్పెండ్ చేయాలన్నారు. అధికారులు, ఉద్యోగుల‌ను నిత్యం దూషిస్తూ, అవ‌మాన‌ప‌రుస్తున్న క‌మిష‌న‌ర్ వ్య‌వ‌హారంపై ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేసి విచార‌ణ జ‌రుపాలని ప్రభుత్వాన్ని కోరారు. ప‌రుష ప‌ద‌జాలంతో ఉద్యోగుల‌ను దూషిస్తూ, వారి జీవితాల‌తో ఆడుకుంటున్న క‌మిష‌న‌ర్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 30 ఏళ్లు గా బాధ్యతగా పనిచేస్తున్న సోమిరెడ్డిని క‌మిష‌న‌ర్ అకార‌ణంగా దూషించ‌డాన్ని ఖండిస్తున్నామన్నారు. చేయని తప్పుకి “ వెధవ , ఇడియట్” అంటూ క‌మిష‌న‌ర్‌ చేసిన దూష‌ణ‌లు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావన్నారు. కమిషనర్ హరికిరణ్ వ్యవహరించిన జుగుప్సాకరమైన తీరుపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మ‌న్ ల‌చ్చిరెడ్డి, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌ ఓడనాల రాజ‌శేఖ‌ర్ డిమాండ్ చేశారు.

Latest News