State budget | ఆదాయం అంతంతే.. అవసరాలు అనేకం.. రాష్ట్ర బడ్జెట్‌పైనే అందరి చూపులు

కాంగ్రెస్ సర్కారుకు ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. ప్రతి నెల రూ.10 వేల కోట్ల మేరకు మాత్రమే పన్నుల రూపంలో ఆదాయం వస్తోంది. మరోవైపు కేంద్రం నుంచి గ్రాంట్లు రావడం లేదు

State budget | ఆదాయం అంతంతే.. అవసరాలు అనేకం.. రాష్ట్ర బడ్జెట్‌పైనే అందరి చూపులు
  • కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు సున్నా
  • అవససరాలు తీరాలంటే అప్పులే ఆధారం
  • సొంత ఆదాయం పెంచుకోకుంటే కష్టాలే
  • పెండింగ్‌లో పలు పథకాల అమలు
  • జీతాలు, వడ్డీ మినహా అన్నీ వాయిదాలే
  • సర్కార్‌కు పొంచి ఉన్న ‘స్థానిక’ సవాల్‌
  • లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపిన పథకాల అమలులో జాప్యం
  • ఒక్క జూలై నెల లోనే 7 వేల కోట్ల అప్పు
  • కాంగ్రెస్ పాలనలోనూ పెరుగుతున్న రుణ భారం
  • విధాన నిర్ణయాలు తీసుకోకుంటే ఇబ్బందులే

విధాత: కాంగ్రెస్ సర్కారుకు ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. ప్రతి నెల రూ.10 వేల కోట్ల మేరకు మాత్రమే పన్నుల రూపంలో ఆదాయం వస్తోంది. మరోవైపు కేంద్రం నుంచి గ్రాంట్లు రావడం లేదు. కేంద్ర పన్నుల్లో వాటా కూడా చాలా తక్కువగా వస్తోంది. కానీ ఖర్చు మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో కాంగ్రెస్ సర్కారు రోజు రోజుకు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. 2024 – 2025 ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు నెలల కాలానికి సంబంధించిన రిపోర్టున కాగ్ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. దీనిని పరిశీలిస్తే కాంగ్రెస్ సర్కారు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు ఏమిటో అర్థం అవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో జీఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీతో పాటు ఇతర పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.11464.17 కోట్లు కాగా మే నెలలో రూ. 10954.96 కోట్లు మాత్రమే. ఇందులో ఏప్రిల్, మే నెలలకు కలిపి కేంద్రం పన్నుల్లో వాటాగా ఇచ్చింది కేవలం రూ.1817.74 కోట్లు మాత్రమే. ఈ రెండు నెలల్లో కేంద్రం నుంచి ఒక్క నయాపైస కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వలేదు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది.

బడ్జెట్లోనూ శూన్య హస్తాలే

ఈ నెల 24వ తేదీన కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను రిశీలిస్తే కాంగ్రెస్ పాలిత ప్రాంతాలకు నిధుల కోత భారీగా ఉందని స్పష్టమవుతున్నది. కేంద్రం తీరుకు నిరసనగా తెలంగాణ రాష్ట్రం నుంచి నీతి అయోగ్ సమావేశానికి హాజరు కావద్దని అసెంబ్లీనే ఏకంగా తీర్మానం చేయాల్సి వచ్చింది. లోటు ఆర్థిక పరిస్థితికి తోడు ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలపైనే రేవంత్‌రెడ్డి సర్కారు కేంద్రీకరించింది. అయితే.. ఇచ్చిన హామీల అమలులో జాప్యం చేయడం లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఇందులో కీలకమైన రైతు భరోసా స్కీ మ్ అమలులో జాప్యం పార్లమెంటు ఎన్నికలపై పడిందన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల ప్రభావమే కావచ్చు. రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి కావచ్చు.. రిజర్వ్ బ్యాంకు నుంచి బాండ్ల వేలం ద్వారా తీసుకు వచ్చిన రుణాలు కావచ్చు.. రైతు రుణమాఫీని లక్ష రూపాయల లోపు వరకు అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి నిధుల సమీకరణ ఎలా జరిగిందని పరిశీలిస్తే రిజర్వ్ బ్యాంకు నుంచి సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా జూలై 2వ తేదీన రూ.2వేల కోట్ల, 16వ తేదీన రూ.2 వేల కోట్ల, 23వ తేదీన రూ.3 వేల కోట్లు కలిపి మొత్తం ఒక్క జూలై నెలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.7 వేల కోట్ల రుణం తీసుకున్నది. ఈ నిధులనే రుణమఫీకి మల్లించారన్న చర్చ కూడా జరుగుతోంది.

పెండింగ్‌లో కీలక హామీలు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామన్న ఆరు గ్యాంరెటీలలో కీలకమైన పెన్షన్ల స్కీమ్ పెండింగ్ లోనే ఉన్నది. ముఖ్యంగా మహిళలకు నెలకు రూ.2500 పెన్షన్, ఆసరా పెన్షన్లు రూ.4 వేలకు పెంపుతో పాటు ఇందిరమ్మ ఇల్లు, ఇంటి స్థలాలు, రూ.5 లక్షల విద్యా భరోసా తదితర ఆర్థిక పరమైన గ్యాంరెటీల అమలు అలాగే మిగిలింది. దీనికి తోడు రైతు రుణమాఫీ లక్ష వరకు అమలు చేస్తున్నారు. మరో లక్ష వరకు రుణమాఫీ అమలు చేయాల్సి ఉన్నది. ఇది ఇలా ఉండగా రైతు భరోసా వర్షాకాలం పంటకు ఇంత వరకు ఇవ్వలేదు. ఇప్పటికే వర్షాకాలం సీజన్ మొదలైంది. రైతులు పెట్టుబడికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొన్నది. వీటన్నింటికీ ఏకకాలంలో అమలు చేయడానికి భారీగా నిధులు అవసరం అవుతాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు అతి త్వరలో నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. ఈ లోగా పథకాలన్నీ గ్రౌండింగ్ కాకపోతే స్థానిక ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే ప్రమాదం కూడా ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

కేంద్రం నుంచి గ్రాంట్‌ లేవు

ఏప్రిల్, మే నెలలకు కాగ్ తన వెబ్ సైట్‌లో పొందుపరిచిన తెలంగాణ నివేదికను పరిశీలిస్తే కేంద్రం నుంచి నయాపైస గ్రాంట్ ఇన్ ఎయిడ్ రాలేదు. రాష్ట్ర పన్నుల ద్వారా వచ్చే ఆదాయం సరాసరిన నెలకు రూ.10 వేల కోట్లు మాత్రమే వస్తున్నట్లు అర్థం అవుతోంది. ఇందులో పాత అప్పులకు వడ్డీలు, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, సబ్సిడీలకు అగ్ర భాగం వెళుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్, మే నెలల్లో వడ్డీ కింద రూ.3,729 కోట్లు, తీసుకున్న అప్పులో అసలు కింద రూ.2040 కోట్లు చెల్లించింది.
రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంకు వద్ద, ఇతర రుణ సంస్థల వద్ద కాసింత పతేరా ఉండాలంటే విధిగా క్రమం తప్పకుండా రుణవాయిదాలు చెల్లించాల్సిందే. ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతోనే ఉద్యోగులకు జీతాలు మినహా ఇతర పేమెంట్స్ ఇవ్వడం లేదని సమాచారం. ఇప్పటి వరకు 4 డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. అయితే.. డీఏల విషయంలో త్వరలో శుభవార్త వింటారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం మండలిలో చెప్పారు. మరోవైపు కాంట్రాక్టర్లకు చెల్లింపులు కూడా చేయలేక పోతున్నారని సమాచారం. వానకాలం రైతు బంధు ఇంకా రైతులకు చేరని పరిస్థితి ఏర్పడింది.

కేంద్రం నుంచి అదనపు నిధులు వస్తేనే..

కేంద్రం అదనపు నిధులు ఇస్తేనే స్కీములు సాఫీగా ముందుకు సాగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కేంద్రం తెలంగాణపై రాజకీయం ఉద్దేశంతో వివక్ష చూపుతుందని నివేదికను పరిశీలిస్తే అర్థమవుతోంది. దీనికి తోడు బడ్జెట్ ప్రతిపాదనలు అసలు విషయాన్ని తెలియజేసింది. కేంద్రం వివక్ష చూపిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కారు స్వంత ఆదాయ వనరులు పెంచుకోవాల్సిందేనన్న చర్చ రాజకీయ, వ్యాపార వర్గాలలో జరుగుతోంది. ముఖ్యంగా ఆదాయం ఆర్జించడానికి కీలకమైన ఇన్వెస్ట్ మెంట్స్ వచ్చే విధంగా పాలసీలు తీసుకురావాల్సి ఉంటుందంటున్నారు. ఇప్పటి వరకు రేవంత్ సర్కారు రాజకీయాలపై చూపించినంత శ్రద్ధ పాలసీలపై చూపించడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి రాజకీయాలు కాస్తంత పక్కన పెట్టి ప్రభుత్వానికి సొంత ఆదాయం వనరుల సేకరణపై కేంద్రీకరించాలని అంటున్నారు. ఇందుకోసం ముఖ్యంగా పవర్ పాలసీ, పెట్టుబడుల పాలసీ, పారిశ్రామిక పాలసీ, ల్యాండ్ పాలసీ తీసుకురావాల్సి ఉంటుందంటున్నారు. దీనికి తోడు హైదరాబాద్ కు కీలకమైన రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు నిచ్చే విధంగా ప్రభుత్వం వైపు నుంచి కార్యక్రమాలు లేవన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా ఎల్ఆర్ఎస్, బీపీఎస్, జీవో 166 అమలుతో పాటు నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చే చర్యలు చేపట్టక పోవడం వల్ల తెలంగాణకు భారీగా ఆదాయం తగ్గిందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంపై అపారమైన అవగాహన ఉన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ రియల్ వ్యాపారం ఊపందుకునే విధంగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న చర్చ కూడా జరుగుతోంది. దీనివల్ల అనేక నిర్మాణ సంస్థలు పక్క రాష్ట్రమైన అమరావతిపైపు చూస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణ ఆదాయాన్ని రెట్టింపు చేస్తేనే మనుగడ సాధ్యం అవుతుందని, ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అవసరమైన నిధులు వస్తాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ దిశగా గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బడ్జెట్ ఉండాలని కోరుకుంటున్నారు.