Urea | రైతుల్లో పెరుగుతున్న అసంతృప్తి.. యూరియా కోసం ఆందోళనలు

Urea | రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. యూరియా కోసం ఊర్ల నుంచి మండల, పట్టణ కేంద్రాలు, పీఎసీఎస్ లకు వస్తున్న రైతులకు అక్కడ యూరియా నో స్టాక్ బోర్టులు చూసి ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

  • By: raj |    telangana |    Published on : Aug 29, 2025 10:26 PM IST
Urea | రైతుల్లో పెరుగుతున్న అసంతృప్తి.. యూరియా కోసం ఆందోళనలు

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి

Urea | విధాత ప్రత్యేక ప్రతినిధి: రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. యూరియా కోసం ఊర్ల నుంచి మండల, పట్టణ కేంద్రాలు, పీఎసీఎస్ లకు వస్తున్న రైతులకు అక్కడ యూరియా నో స్టాక్ బోర్టులు చూసి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రోజుల తరబడి యూరియా కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో అసహనం కూడా పెరుగుతోంది. ఆందోళనలు పెరుగుతున్నాయి. వర్షంలో సైతం రైతులు యూరియా కోసం పడిగాపులు గాస్తున్నారు. శుక్రవారం రైతుల ఆగ్రహం ఓ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి దారితీసింది. యూరియా ఎప్పుడొస్తుందోననే వాస్తవ పరిస్థితులేంటిదనేది తెలియక కొందరు అమాయక రైతులు సహజంగానే కొపం వ్యక్తం చేస్తుండగా పొద్దున లేచి వ్యవసాయ పనులు చేసుకునే రైతులు పని మానుకొని యూరియా కోసం గంటల కొద్దీ పడిగాపులు గాయడాన్ని తట్టుకోలేక పోతున్నారు. అడపాదడపా ఎక్కడైన యూరియా పంపిణీ చేసినా ఒకటి, రెండు బస్తాలకు మించి లభించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. దీనికి తోడు యూరియాకు సంబంధించి ఎప్పుడొస్తోందో? సరైన సమాచారం అందించేవారు లేకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. యూరియా కోసం వచ్చే రైతులను కొందరు రాజకీయ నాయకులు వాస్తవాలేంటో చెప్పకుండా వారి అసంతృప్తిని నిరసనల వైపు మళ్ళించడంతో రాస్తారోకోలు, ధర్నాలకు దిగుతున్నారు. గంటలతరబడి పడిగాపులుగాస్తున్న రైతుల్లో కొందరు సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఒకరిద్దరు రైతులకు ఫిట్స్ వచ్చిన సంఘటనలు జరిగాయి. పైగా రైతులు ఏ మాత్రం ప్రశ్నించినా పోలీసులు వచ్చి వారిపైన ఆగ్రహాన్ని ప్రదర్శించడంతో మరింత అసహనానికి గురవుతున్నారు. ఈ యూరియా కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని రైతులు ఎదురుచూస్తున్నారు.

ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడి

మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ క్యాంప్ ఆఫీస్‌ను శుక్రవారం రైతులు ముట్టడించారు. యూరియా కోసం వచ్చిన మహిళా రైతులు తమ గోడును ఎమ్మెల్యేలకు తెలియజేసేందుకు రైతులంతా పొలోమంటూ క్యాంపు కార్యాలయానికి ప్రవాహంలా చేరుకున్నారు. కార్యాలయాన్ని ముట్టడించి ఎమ్మెల్యేను ప్రశ్నించారు. పెద్ద సంఖ్యలో రైతులు అందులో మహిళలు రావడంతో పోలీసులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మహిళలు ఎమ్మెల్యేలను నిలదీసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని వారిని ఒప్పించి పంపించారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.