Gadari Kishore | నిరుద్యోగులు కాదు.. నువ్వే సన్నాసి: మాజీ ఎమ్మెల్యే గాదరి
టెట్, డీఎస్సీ, గ్రూప్ 1 పరీక్షల మధ్య గ్యాప్ ఉండాలని కోరుతున్న నిరుద్యోగులను సన్నాసులంటూ మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి మాటలు సిగ్గుచేటని, నిరుద్యోగ సమస్యలు అర్ధం చేసుకోలేని సన్నాసి ఆయననేనని బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ విమర్శించారు

సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే గాదరి మండిపాటు
నిరుద్యోగ పోరాటాలకు బీఆరెస్ సంఘీభావం
మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
విధాత, హైదరాబాద్ : టెట్, డీఎస్సీ, గ్రూప్ 1 పరీక్షల మధ్య గ్యాప్ ఉండాలని కోరుతున్న నిరుద్యోగులను సన్నాసులంటూ మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి మాటలు సిగ్గుచేటని, నిరుద్యోగ సమస్యలు అర్ధం చేసుకోలేని సన్నాసి ఆయననేనని బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ విమర్శించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో బీఆరెస్వీ నాయకులు పల్లా ప్రవీణ్, కడారి స్వామి, పడాల సతీష్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులను సన్నాసులంటున్న రేవంత్‌రెడ్డి గతంలో నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్‌లో తిప్పినప్పుడు.. ఆ రోజు రాహుల్ గాంధీ సన్నాసా? రేవంత్ రెడ్డి సన్నాసా? అని గాదరి కిశోర్ నిలదీశారు.
డీఎస్సీ వాయిదా వేయకపోగా రేపటి నుంచి హాల్‌టికెట్లు ఇస్తానని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నాడంటే ఢిల్లీకి కప్పం కట్టేందుకు ఇప్పటికే ఆ పోస్టులు అమ్ముకున్నాడని ఆరోపించారు. నిరుద్యోగుల సమస్యలపై ప్రశ్నించిన కేటీఆర్, హరీశ్‌రావులను దీక్షలు చేయమంటున్నాడని, నీట్ రద్ధు చేయమని రాహుల్‌గాంధీని దీక్ష చేయమని నీవు చెబుతావా అంటు ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి కోసం సీఎంగా రేవంత్‌రెడ్డి దీక్ష చేసి చనిపోవాలని మాట్లాడితే బాగుంటుందా అని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్, హరీశ్‌రావు, తాము కేసుల పాలై జైళ్లకు పోతే ఆ సమయంలో నువ్వు ఎక్కడ ఉన్నవ్ రేవంత్ రెడ్డి? అని మండిపడ్డారు.
LIVE | BRS Leaders Press Meet at Telangana Bhavan
https://t.co/rRQVN0zYzT— BRS Party (@BRSparty) July 10, 2024
నిరుద్యోగులు న్యాయమైన ఆందోళనకు బీఆరెస్ సంఘీభావం తెలుపుతుందన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమ రోజులను తలదన్నే విధంగా మళ్లీ నిన్న వికృత చేష్టలతో పోలీసులు ఉస్మానియా హాస్టళ్ల విద్యార్థులను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. టెట్ నిర్వహించిన తర్వాత 45 రోజుల సమయం ఇవ్వండని నిరుద్యోలు కోరారని, మెగా డీఎస్సీ అడుగుతున్నారని, ఎన్నికల్లో 25 వేలతో మెగా డీఎస్సీ వేస్తానని చెప్పిన రేవంత్.. ఇప్పుడు 20 వేలతో మెగా డీఎస్సీ వేయొచ్చు కదా..? అని గాదరి కిశోర్ నిలదీశారు. అయినా . మారిన సిలబస్‌ను చదవుకోవడానికి 25 రోజుల సమయం సరిపోదని మాత్రమే వారు అభ్యంతరం తెలుపుతున్నారన్నారు. సమస్యలను పట్టించుకోవడం లేదని మాజీ సీఎం కేసీఆర్‌ను విమర్శించిన కోదండరామ్ వంటి వారు ఇప్పుడున్న సీఎం రేవంత్‌రెడ్డిని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. నిరుద్యోగుల ఉద్యమాలను అణిచివేస్తూ ప్రజాపాలన అంటున్న సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన చేస్తుండని ఆరోపించారు.
రేవంత్‌రెడ్డికి నిరుద్యోగుల సమస్యలంటే చులకనగా ఉందని, వారి డిమాండ్లను తక్కువ చేస్తూ వారి ఆందోళన వెనుక కోచింగ్ సెంటర్ల హస్తముందంటూ సీఎం మాట్లాడటం దారుణమన్నారు. 1:100 రేషియో ప్రకారం పక్క రాష్ట్రంలో గ్రూప్ పరీక్షలు జరుగుతుంటే ఇక్కడ ఎందుకు జరగడం లేదన్నారు. మీకు చేత కాకపోతే కాలేదు అని చెప్పండికాని, దొంగ సాకులు , మాటలు మాట్లాడవద్దని హెచ్చరించారు. భారత దేశంలో ఉన్నముఖ్యమంత్రులలో తెలివి తక్కువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, రేవంత్ రెడ్డి లాంటి ఆఫ్ నాలెడ్జ్ వ్యక్తి సీఎం కావడం మన దౌర్భాగ్యమని, ఇంత పనికి మాలిన పాలన ఏ రాష్ట్రంలో లేదని, రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కి పోయిందని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ ఆగం ఆగం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ రేవంత్‌రెడ్డిని తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారు.