సింగరేణి నిధులతో సిరిసిల్ల, సిద్దిపేట అభివృద్ధి: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్

సింగరేణి నిధులతో సిరిసిల్ల, సిద్దిపేట అభివృద్ధి: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్

– బీఆరెస్ తో సింగరేణి ప్రాంతం ఆగమాగం

– మిషన్ భగీరథ స్కీం.. ఒక స్కాం

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో సింగరేణి కాలరీస్ కంపెనీ విస్తరించినా ఆశించిన అభివృద్ధి జరగలేదని, ఈప్రాంతానికి కేటాయించాల్సిన నిధుల్ని సిద్దిపేట, సిరిసిల్లకు కేటాయించి సింగరేణి ప్రాంత ప్రజలను బీఆరెస్ మోసం చేసిందని చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ విమర్శించారు. సోమవారం ఉదయం ఆయన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో మార్నింగ్ వాకర్స్ తో కలిసి ఓట్లను అభ్యర్థించారు.


ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ సిరిసిల్ల, సిద్దిపేట అభివృద్ధి తప్ప ఇతర ప్రాంతాల అభివృద్ధిని కేసీఆర్ విస్మరించారని ఆరోపించారు. మిషన్ భగీరథ స్కీం ఒక స్కామ్ అని ఆరోపించారు. మిషన్ భగీరథ పైపుల ద్వారా తాగునీరు రావడంలేదని తెలిపారు. భగీరథకు ముందు కాంగ్రెస్ హయాంలో ఆర్ డబ్ల్యూఎస్ స్కీం కింద ప్రతి ఊరికి 80 శాతం ప్రజలకు తాగునీటిని అందించామని తెలిపారు. అనంతరం ఠాగూర్ స్టేడియంలో ఉన్న సమస్యలను వాకర్స్ ను అడిగి తెలుసుకున్నారు. స్టేడియంలో ఉన్న సమస్యలు పరిష్కరించే బాధ్యత తనది అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అజీజ్, శ్రీనివాస్, రఘునాథ్ రెడ్డి, రాజేష్ పాల్గొన్నారు.