రైతుల భూములు గుంజుకునేందుకే.. ఇక్క‌డ‌కు వ‌చ్చిన కేసీఆర్‌: రేవంత్‌రెడ్డి

రైతుల భూములు గుంజుకునేందుకే.. ఇక్క‌డ‌కు వ‌చ్చిన కేసీఆర్‌: రేవంత్‌రెడ్డి
  • కేసీఆర్‌కు అమ్మ‌గారి ఊరు 40 ఏళ్ల త‌రువాత గుర్తుకు వ‌చ్చిందా?
  • ఫ‌రీద్‌పేట స‌భ‌లో పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ప్ర‌శ్న‌

విధాత‌: రైతుల భూములు గుంజుకునేందుకే కేసీఆర్ కామారెడ్డికి వచ్చిండని పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలోని ఫ‌రీద్ పేటలోని ఎన్నిక‌ల ప్ర‌చార‌ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ ఎమ్మెల్యేగా,ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా , ముఖ్యమంత్రిగా పదవులు అనుభవించిన కేసీఆర్‌కు అమ్మ‌గారి ఊరు ఇన్నాళ్లు గుర్తుకు రాలేదా… 40 ఏళ్ల త‌రువాత గుర్తుకు వ‌చ్చిందా? ప్ర‌శ్నించారు. సీఎం కేసీఆర్ ఏనాడైనా ఈ ప్రాంత ప్రజల కోసం, అభివృద్ధి కోసం కృషి చేశాడా? అని నిలదీశాడు. రాష్ట్రంలో రైతుల వడ్లు రూ.2వేలకు కొనేవాడు లేడు కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండిన వడ్లను క్వింటాకు రూ.4250 కి కావేరీ సీడ్స్ కు అమ్ముకుండన్నారు.




 



ఇది నిజం కాదని రాజరాజేశ్వర స్వామి గుడిలో ప్రమాణం చేసేందుకు కేసీఆర్‌ సిద్ధమా? అని అడిగారు. కామారెడ్డిపై దండయాత్ర చేసిన కేసీఆర్ ను బండకేసి కొట్టేందుకే అధిష్టానం నన్ను ఇక్కడ పోటీలో దింపిందన్నారు. మీ పంట పొలాలను కబలించడానికి వస్తున్న కేసీఆర్, అతని బంధుగణం నుంచి భూములను కాపాడే బాధ్యత నాదన్నారు. బీఆరెస్ ను కేసీఆర్ ఊరు అని చెప్పుకుంటున్న కొనాపూర్ లొనే బొంద పెడదామని పిలుపు ఇచ్చారు. ధర్మం వైపు ఉంటారా.. అధర్మం వైపు ఉంటారా ఆలోచించండన్నారు. రాష్ట్రంలో దొరల రాజ్యం పోయి ప్రజా పాలన రావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాల‌ని కోరారు.