TELANGANA | నాలుగు రోజులు భారీ వర్షాలు … పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ అలర్ట్‌

తెలంగాణలో రాగల నాలుగు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఒడిశా పరిసరాల్లో ఉన్న అల్పపీడనం ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకొని విదర్భను ఆనుకొని ఉందని.

TELANGANA | నాలుగు రోజులు భారీ వర్షాలు … పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ అలర్ట్‌

విధాత, హైదరాబాద్‌ : తెలంగాణలో రాగల నాలుగు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఒడిశా పరిసరాల్లో ఉన్న అల్పపీడనం ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకొని విదర్భను ఆనుకొని ఉందని.. అనుబంధంగా ఉపరితల ఆవర్తం సగటున సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా వంగి ఉందని పేర్కొంది. అల్పపీడనం ఈ నెల 19న పశ్చిమ మధ్య ప్రాంతాలను ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం నుంచి గురువారం వరకు ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.
ఇక గురువారం నుంచి శుక్రవారం వరకు ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలతో పాటు పలుచోట్ల భారీ వర్షాపాతం రికార్డయ్యింది. నిజామాబాద్‌ జిల్లా సలూరలో 126 మిల్లీమీటర్లు, నవీపేటలో 116, కరీంనగర్‌ జిల్లా గంగాధరలో 117 సెంటీమీటర్ల వర్షం కురిసింది.