Odisha Cyclones Explained | ఒడిశాకు తుఫాన్ల ముప్పు ఎందుకు ఎక్కువ?
ఒడిశాలో తరచుగా తుఫాన్లు ఎందుకు వస్తాయి? తుఫాన్లను ఆ రాష్ట్రం ఎలా ఎదుర్కొంటుంది? ఇప్పటివరకు ఈ రాష్ట్రం ఎన్ని తుఫాన్లతో నష్టపోయింది? తుఫాన్ల సమయంలో నష్టాన్ని తగ్గించేందుకు ఆ రాష్ట్ర యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
Odisha Cyclones Explained | ఒడిశా రాష్ట్రం తుఫాన్లకు అయస్కాంతంగా పనిచేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇందుకు ఆ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు కూడా కారణం. బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడుతాయి. ఈ తుఫాన్లు వాయువ్య దిశలో పైకి ప్రయాణిస్తాయి. భారత భౌగోళిక పరిస్థితుల కారణంగాతుఫానులు సాధారణంగా అపసవ్య దిశలో తిరుగుతాయి. తూర్పు తీరంలోని రాష్ట్రాలు ఇతర తీరాలతో పోలిస్తే సాపేక్షంగా చదునైన మైదానభూమిని కలిగి ఉంటాయి. ఇవి గాలుల విక్షేపణను నివారిస్తాయి. ఒడిశా రాష్ట్రానికి అతి పెద్ద తీర ప్రాంతం ఉంది. దీని వల్ల కూడా తుఫాన్లకు ఈ రాష్ట్రం కేంద్రంగా మారుతోంది. ఫసిఫిక్ మహాసముద్రం మీదుగా ఏర్పడే తుఫాన్లను బంగాళాఖాతం కూడా ఆహ్వానిస్తుంది. ఎందుకంటే ఈ తుఫాన్లను ఆపే భూభాగం లేనందున మలేషియా, థాయ్ లాండ్, గల్ఫ్ మీదుగా బంగాళాఖాతంలోకి తుఫాన్లు ప్రవేశిస్తాయి. హిమాలయాలు, పశ్చిమకనుమలు ఈ గాలులు దాటకుండా అడ్డుకుంటాయి.దీంతో ఈ గాలులు ఇక్కడే తిరుగుతాయి. వాయువ్య భారత్ నుంచి వేడి గాలి బంగాళాఖాతం నుంచి తేమతో కూడిన గాలి కలవడంతో అల్పపీడన వ్యవస్థలను సృష్టిస్తుంది. దీంతో ఒడిశా తీరం తరచుగా తుఫాన్లకు గురవుతుంది. భౌగోళికంగా ఒడిశా పటంలో పూరీ నుండి భద్రక్ మధ్య ఉన్న భూభాగం సముద్రంలోకి కొద్దిగా బయటకు వెళ్లి ఉంటుంది. దీని వలన బంగాళాఖాతంలో తుఫాన్లకు కారణం అవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
తుఫాన్లు ఎప్పుడు వస్తాయి?
ఒడిశాలో జూన్ నుండి అక్టోబర్ వరకు తుఫాన్లు వస్తాయి. ప్రధానంగా జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో తుఫాన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జూలై, ఆగస్టులలో అల్పపీడనాలు ఈ రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తాయి. ఒడిశాకు బంగాళాఖాతం వెంట 480 కి.మీ తీర ప్రాంతం ఉంది. 1891 నుంచి 2020 వరకు ఈ రాష్ట్రం దాదాపు 110 తుఫాన్లకు గురైంది. బంగాళాఖాతం పెద్ద తుఫాన్లకు కారణం అవుతుంది. వాతావరణ కార్యకలాపాలను కేంద్రీకరించే గరాటు లాంటి ఆకారం దాని ప్రత్యేక స్థలాకృతి కూడా ఇందుకు కారణంగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఉష్ణోగ్రత కూడా కారణమే. బంగాళాఖాతం సాధారణంగా అరేబియా సముద్రం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను నమోదు చేస్తుంది. ఇది కూడా ఒడిశా రాష్ట్రం ఎక్కువగా తుఫాన్లకు గురి అవుతోంది.
ఒడిశాలో 95 ఏళ్లు విపత్తులే…
గత 105 ఏళ్లలో 95 ఏళ్లు విపత్తు ప్రభావిత ప్రాంతంగా ఒడిశా ఉంది. అయితే తుఫాన్లు, లేదా కరవుకు ఒడిశా గురైంది. 50 ఏళ్లుగా వరదలు, 32 ఏళ్లుగా కరువు, 11 ఏళ్లుగా తుఫాన్లు రాష్ట్రాన్ని తాకాయి. 1891 నుంచి 1970 మధ్య దాదాపు 952 చిన్న, పెద్ద తుఫాన్లు సంభవించాయి. 451 టోర్నడోలను ఒడిశా ఎదుర్కొంది. 1901 నుంచి 1981 వరకు 380 తుఫాన్లు సంభవించాయి. ఇందులో 272 బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండాల ఫలితంగా సంభవించాయి. ఈ తుఫాన్లలో ఇరవై తొమ్మిది విధ్వంసకరమైనవి. ప్రకృతి వైపరీత్యాల ప్రభావాలపై జరిపిన అధ్యయనంలో 1963 నుంచి 1999 మధ్య ఒడిశా 13 పెద్ద విపత్తులను ఎదుర్కొంది. ఈ తుఫాన్లలో 22, 228 మంది మరణించారని నివేదికలు చెబుతున్నాయి. 34 లక్షలకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. 2019లో ఒడిశాను తాకిన ఫణి తుఫాన్ రాష్ట్రంలో 9000 కోట్లకు పైగా విలువైన నష్టాన్ని కలిగించింది. 20,367 గ్రామాలు దెబ్బతిన్నాయి. 1.6 కోట్ల మంది ప్రజలు ఈ తుఫాన్లతో ఇబ్బందిపడ్డారు. బంగాళాఖాతంలో 121 ఏళ్లలో అంటే 1891 నుంచి 2011 వరకు 1301 తుపాన్లు ఏర్పడ్డాయి. ఇందులో 389 తుఫాన్లు ఒడిశా తీర ప్రాంతంలోనే తీరాన్ని తాకాయి. 1999 వచ్చిన అతి తీవ్ర తుఫాన్ కారణంగా ఒడిశా రాష్ట్రంలో సుమారు 10 వేల మంది చనిపోయారు. ఈ తుఫాన్ నుంచి ప్రజలు బయటపడడానికి ఏళ్లు పట్టింది. ఈ తుఫాన్ తర్వాత ఒడిశా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తుఫాన్ల సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రజలను తరలించేందుకు వెయ్యికి పైగా తుఫాన్ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒడిశా విపత్తు యాక్షన్ ఫోర్స్ ను కూడా డెవలప్ చేశారు. ఇది దేశంలోనే ఫస్ట్ మల్టీపుల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఈ టీమ్ కు అత్యవసర పరిస్థితులనైనా తీర్చేందుకు అన్ని ఆధునిక పరికరాలను సేకరించారు.
ఉష్ణ మండల తుఫాన్లు ఎలా ఏర్పడుతాయి?
ఉష్ణమండల తుఫానులు అనేవి రెండు ఉష్ణమండలాల మధ్య ఏర్పడి అపసవ్య దిశలో తిరుగుతాయి. సముద్ర జలాల ఉపరితలం సూర్యుని కారణంగా వేడెక్కుతుంది. వెచ్చని సముద్ర జలాల ఉపరితలం నుండి వెచ్చని గాలి, తేమ పైకి లేచినప్పుడు ఎక్కువ గాలి లోపలి స్థలాన్ని నింపడానికి పరుగెత్తుతుంది. ఈ గాలి తేమతో పైకి లేచి వెచ్చని తేమతో కూడిన గాలి పైకి లేచే చక్రాన్ని సృష్టిస్తుంది. ఈ వ్యవస్థ ఎత్తు, పరిమాణంలో పెరుగుతుంది. ఇది విస్తరించి ఉష్ణమండల తుఫానుకు కారణమవుతుంది.భారతదేశానికి సమీపంలో అవి దేశానికి ఇరువైపులా ఏర్పడతాయి. బంగాళాఖాతంలో ఏర్పడేవి అరేబియా సముద్రంలో ఏర్పడే వాటి కంటే చాలా భిన్నంగా ఉంటాయి. అంతేకాదు సంఖ్యలో ఎక్కువ. తూర్పు ఆఫ్రికాలోని పర్వతాలు అరేబియా ద్వీపకల్పం వైపు చాలా గాలులను మళ్ళిస్తాయి. అరేబియా సముద్రం అంతటా వేడిని మరింత సమర్థవంతంగా వెదజల్లుతాయి. ఫలితంగా సముద్రంలోని ఈ భాగం సాపేక్షంగా చల్లగా ఉంటుంది. తక్కువ తుఫానులను ఉత్పత్తి చేస్తుంది. కానీ బంగాళాఖాతం చుట్టూ ఉన్న భూమి ఆకారం కారణంగా సముద్రంపై గాలులు నెమ్మదిగా కదులుతాయి, బలహీనంగా ఉంటాయి. వర్షాకాలం ముందు మార్చి-మే కంటే వర్షాకాలం తర్వాత అక్టోబర్-డిసెంబర్ కాలంలో తుఫానులు ఎక్కువగా వస్తాయి. వర్షాలకు ముందు వేడి, పొడి గాలి భూమి నుండి సముద్రంలోకి కదులుతుంది. ఇది వెచ్చని నీటి ఉపరితలం పైన ఉండి, గాలి,తేమ పెరుగుదలను అడ్డుకుంటుంది. వర్షాకాలంలో జూన్-సెప్టెంబర్ కూడా ఉష్ణమండల తుఫానులు ఏర్పడతాయి. కానీ నైరుతి రుతుపవనాల గాలులు వాటిని తుఫాను స్థాయికి బలోపేతం చేయడానికి అనుమతించవు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram