High-Tech Secunderabad Railway | అత్యాధునికంగా మారుతున్న చారిత్రక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
ఆధునిక సాంకేతిక హంగులతో కొత్తరూపు, అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసిపోని సౌకర్యాలు, దశాబ్దాల జ్ఞాపకాల మణిహారం ఇక కనుమరుగు.? అత్యాధునికంగా మారుతున్న చారిత్రక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

- ఆధునిక సాంకేతిక హంగులతో కొత్తరూపు
- అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసిపోని సౌకర్యాలు
- దశాబ్దాల జ్ఞాపకాల మణిహారం ఇక కనుమరుగు.?
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్… ఎన్నో దశాబ్దాలుగా లక్షలమంది జ్ఞాపకాలు పెనవేసుకున్న రైలు స్టేషన్. ఎంతోమంది రోజూ అప్ అండ్ డౌన్ చేస్తూ చదువుకున్నవారు, ఉద్యోగాలు చేసిన వారు.. ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయికి ఎదిగిన వారు ఏ వరంగల్ నుండో, జనగామ, భువనగిరిల నుండి రోజూ వచ్చి ఇక్కడ దిగి, ఆల్ఫాలో చాయ్ తాగి, వాళ్ల ఆఫీసులకో, కాలేజీలకో వెళ్లేవారు. ఉప్పల్ బస్‌స్టాప్ ఎదురుగా బ్లూ సీ కేఫ్.. హైదరాబాద్‌కు పని మీద వచ్చిన వారు బ్లూ సీ చాయ్ తాగకుండా, ఆల్ఫాలో బిర్యానీ తినకుండా వెళ్లేవారు కాదు. అటువంటి సికింద్రాబాద్ స్టేషన్ ఇప్పుడు పూర్తిగా రూపురేఖలు మార్చుకోబోతోంది.
1870ల్లో అప్పటి నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ సిద్దిఖీ(Nizam of Hyderabad) ఆలోచన నుండి పుట్టి, 1974లో సికింద్రాబాద్–వాడి లైన్ ద్వరా మొదటిసారిగా రైల్వే సేవలు ఇదే సికింద్రాబాద్ నుండి ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ స్టేట్‌ను మిగతా భారతదేశంతో కలపడానికి మొదటిసారిగా రైల్వేలైన్‌ను ప్రారంభించారు. అప్పటినుండి నిరంతరాయంగా ప్రయాణీకులకు సేవలందిస్తూనేఉంది ఈ అందరి బంధువు.
దేశంలోని వందలాది ప్రతిష్టాత్మక రైల్వేస్టేషన్లను అత్యాధునికంగా, ఎయిర్‌పోర్టులా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ అమృత్‌భారత్(Amrut Bharat) పథకంలో భాగంగానే సికింద్రాబాద్‌ను ఆధునీకరిస్తున్నారు. ఇందుకోసం దాదాపు 720 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రధాన భవనాన్ని దాదాపుగా కూల్చివేసారు. లోపల ఆధునీకరణ వేగంగా జరుగుతోంది. ఓ రెండేళ్ల తర్వాత వస్తే, సికింద్రబాద్ స్టేషన్‌ను గుర్తుపట్టడం కూడా కష్టం. అంత అందంగా మారనున్నది.
అయితే, ముందువైపు పెద్ద రోడ్డు, పెద్ద పెద్ద భవంతులు, హోటళ్లు, గణేశాలయం ఉన్నాయి కాబట్టి, స్టేషన్‌ను వెనక్కిజరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు బిల్డింగ్ ఉన్నచోట లాన్‌లు, గార్డెన్‌లు వేసి, వెనుక వైపు బోయగూడ ద్వారం.. అంటే 10వ నం. ప్లాట్‌ఫారం వైపు అభివృద్ధి కేంద్రీకృతం కాబోతుంది. అదంతా ఎటూ రైల్వే స్వంత భూమే కాబట్టి, ఇబ్బంది లేకుండా ఉంటుందని రైల్వే వర్గాల ఆలోచన.
దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన స్టేషన్ కొత్త డిజైన్లు చూస్తే మతిపోయేలా ఉన్నాయి. అంతా ఓ అంతర్జాతీయ విమానాశ్రయంలా రూపుదిద్దారు. వెనుకవైపు భూగర్భ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అది 5 లేదా 6 అంతస్థుల్లో ఉండనుంది. ఇప్పటికే దాని పనులు కూడా పూర్తయ్యాయి. ఎస్కలేటర్లు, ప్లాట్‌ఫారాల ఆధునీకరణ, అంతర్గత బ్రిడ్జిలు.. అన్నీ చాలా అత్యాధునికంగా ఉన్నాయి. చర్లపల్లిలోనే చాలా రైళ్లను ఆపేసి, అక్కన్నుంచే బయలుదేరేట్టుగా చేసి, పనులకు ఇబ్బంది లేకుండా సికింద్రాబాద్‌ను దాదాపు ఖాళీ చేసారు. కొన్ని పెద్ద పెద్ద రైళ్లు మాత్రమే అనుమతిస్తున్నారు. 1874లోని చారిత్రక సంస్కృతి, ఆనవాళ్లను పరిరక్షిస్తూనే కొత్త నిర్మాణం ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే స్పష్టం చేసింది. నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ స్టేషన్ ప్రతీరోజూ 1,70,000 మంది ప్రయాణీకులకు సేవలందిస్తుంది.
ప్రాజెక్టు విశేషాలు ఇలా ఉన్నాయి:
- ఐకానిక్ స్టేషన్ భవనం: ఆధునికతకు తలమానికంగా నిలిచే విధంగా అభివృద్ధి చేస్తున్నారు.
- 40-60 ఏళ్ల దృష్టితో నిర్మాణం: దీర్ఘకాలిక అవసరాలను తీర్చగల నిర్మాణ రూపకల్పన.
- 108 మీటర్లు × 120 మీటర్ల విస్తీర్ణంలో రెండంతస్థుల రూఫ్ ప్లాజా: ప్రయాణికులందరికీ అవసరమైన సదుపాయాలన్నీ ఒకే చోట. షాపులు, కెఫెటేరియా, వినోద విభాగాలతో రెండువైపుల స్టేషన్ భవనాల్ని మరియు అన్ని ప్లాట్‌ఫారాల్ని కలుపుతుంది.
- రెండు వైపుల నగరాలను కలిపే నిర్మాణం: రైల్వే ట్రాక్‌ల ఇరువైపులా స్టేషన్ భవనాలు ఉండటం ద్వారా నగర రెండు భాగాల మధ్య బలమైన అనుసంధానం.
- సాఫీగా సాగే ట్రాఫిక్, విశాలమైన పార్కింగ్ సదుపాయాలు.
- తూర్పు–పడమర మెట్రో, బస్ స్టేషన్లతో మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్.
- ప్రవేశం–నిష్క్రమణ ప్రయాణికుల దారులు వేర్వేరు.
- ప్లాట్ఫారాలపై రద్దీ తగ్గింపు, పూర్తిగా పైకప్పుతో ప్లాట్ఫారాలు, ట్రాక్‌లు
- 26 లిఫ్ట్లు, 32 ఎస్కలేటర్లు, 2 ట్రావెలేటర్లు.
- దివ్యాంగులకు అనుకూల సదుపాయాలు.
- సౌకర్యాలపరంగా మెరుగైన లైటింగ్, డిస్ప్లే బోర్డులు, సౌండ్ ప్రూఫింగ్, కంపన నియంత్రణ.
- రక్షణ సదుపాయాలు: సీసీ కెమెరాలు, యాక్సెస్ కంట్రోల్ వంటి అత్యాధునిక భద్రతా చర్యలు.
- హరిత భవనాలు: పర్యావరణ అనుకూల నిర్మాణ విధానాలు.
- సౌరశక్తి వినియోగం.
- నీటి సంరక్షణ, పునర్వినియోగ సౌకర్యాలు.
అత్యాధునికంగా సికింద్రాబాద్ స్టేషన్ – ఫోటోలు.
ఈ రూపుమార్పు పూర్తయ్యాక, సికింద్రాబాద్ స్టేషన్ ఒక విమానాశ్రయ స్థాయిలో ప్రయాణ సౌకర్యాలను, చారిత్రక వారసత్వాన్ని కలబోసి, రాబోయే తరాలకు కొత్త, పాత అనుభూతులను అందించబోతోంది.