గోదావరికి వరద పోటు..భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి, కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు భారీ వరద ప్రవాహాలు కొనసాగుతుండగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో భద్రాచలం వద్ద గోదావరి పొంగిపొర్లుతుంది. శుక్రవారం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉదృతి క్రమంలో ఈ సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కూడా ఉంది.

కల్యాణకట్ట, స్నానఘట్టాలు వరద నీటిలో ఉన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో ఇంకా నీటిమట్టం పెరిగే అవకాశముందంటున్నారు అధికారులు.53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచిస్తున్నారు. గోదావరి తీర ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

నిజామాబాద్‌ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి జలాశయంలోకి 74,950 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1069.20 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 21.7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు దిగువన ఉన్న శ్రీపాద ఎల్లంపల్లికీ వరద పోటెత్తుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద వస్తుండగా గేట్లు తెరిచి 1.90 లక్షల క్యూసెక్కులు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఈ వరదతోపాటు స్థానికంగానూ కురిసిన వర్షాలతో గురువారం రాత్రికి ఎల్లంపల్లి వద్ద 4.65 లక్షల క్యూస్కెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. దీంతో పంపింగ్ అవసరం లేకుండానే ఎల్లంపల్లి నిండిపోవడంతో ఇక్కడి నుంచి 15గేట్లు ఎత్తి దిగువన మేడిగడ్డకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా.. 19.70 టీఎంసీలకు నిల్వ చేరింది.

ఎల్లంపల్లి నుంచి రాజరాజేశ్వర మధ్య మానేరు జలాశయానికి గురువారం మొదలైన ఎత్తిపోతలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. నంది, గాయత్రి పంపుహౌస్‌ల మోటార్లతో 15,750 క్యూసెక్కుల ఎత్తిపోతల కొనసాగుతుంది. అంతే ప్రవాహాన్ని సొరంగాల ద్వారా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంపుహౌస్‌కు వదులుతున్నారు. గాయత్రి పంపుహౌస్‌లోనూ 5 మోటార్లతో వరదను ఎత్తిపోస్తున్నారు. వరద కాలువ ద్వారా 15,750 క్యూసెక్కుల ప్రవాహం మధ్య మానేరు జలాశయంలోకి చేరుతోంది.

ప్రాణహిత నదిలోనూ భారీ ప్రవాహం వస్తుండగా మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ నుంచి 3.31 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చే ఇంద్రావతి వరద, స్థానిక ప్రవాహాలు కలిసి జయశంకర్‌ భూపాపల్లి జిల్లాలోని సమ్మక్క బ్యారేజీ వద్ద 9.36 లక్షల క్యూసెక్కుల ప్రవాహం గోదావరిలో దిగువకు వెళ్తోంది. మేడిగడ్డ నుంచి గోదావరి 8.35లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. దీంతో తుపాకులగూడెంలోని సమ్మక్క బ్యారేజీ 59 గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. ములుగు జిల్లాలో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తుంది. వాజేడు మండలం టేకులగూడెం వద్ద రహదారిపైకి వరద నీరు చేరింది. వరద నీటితో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం మండలం బోదాపురం వంతెనపైకి వరదనీరు చేరడంతో వెంకటాపురం-భద్రాచలం మధ్య రాకపోకలకు అంతరాయమేర్పడింది.

కృష్ణా బేసిన్ లో ప్రాజెక్టులకు వరద ప్రవాహం

అటు కృష్ణా బేసిన్‌లో ముఖ్యమైన శ్రీశైలం సహా అన్ని ప్రాజెక్టులకు ప్రవాహాలు ముమ్మరమయ్యాయి. ఆల్మట్టి, నారాయణపూర్ ల నుంచి తెలంగాణలో కృష్ణా నదిపై మొదటి ప్రాజెక్టు జూరాల వద్ద 1లక్ష క్యూసెక్కులపై రావడంతో దిగువకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. జూరాల వెనుక జలాల ఆధారంగా నడిచే పథకాల్లోనూ ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. జూరాల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం వద్ద 1.12 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ఈ జలాశయం నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా శుక్రవారం నీటి నిల్వ 48 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం వెనుక జలాల ఆధారంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఉన్న మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని మొదటి దశ పంప్‌హౌస్‌ నుంచి ఎల్లూరు జలాశయంలోకి 1,600 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు.

Latest News