అనుకున్నదే జరిగింది..! గ్రూప్‌-2 పరీక్షలు మళ్లీ వాయిదా..

అనుకున్నదే జరిగింది..! గ్రూప్‌-2 పరీక్షలు మళ్లీ వాయిదా..

విధాత: అనుకున్నదే జరిగింది. తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షలు మరోసారి వాయిదాపడ్డాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పరీక్షలను వాయిదా వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. వాయిదా పడ్డ పరీక్షలను జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం షెడ్యూల్‌ విడుదలైన విషయం తెలిసిందే. 

నవంబర్‌ 30న పోలింగ్‌ జరుగనున్నది. ఓ వైపు పరీక్షలు, మరో వైపు ఎన్నికలకు పోలీసు భద్రతా, సిబ్బంది కేటాయింపు విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో పరీక్షలను వాయిదా వేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకున్నది. చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం టీఎస్‌పీఎస్సీ సమావేశమై.. పరీక్షల నిర్వహణపై చర్చించింది. సమావేశంలో పరీక్షలను వాయిదా వేసేందుకే నిర్ణయించారు. 783 గ్రూప్‌-2 పోస్టులకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జనవరి 18 నుంచి దరఖాస్తుల స్వీకరించింది. దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 

వాస్తవానికి ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు జరుగాల్సి ఉండగా.. నవంబర్‌ నవంబర్‌ 2, 3 తేదీలకు వాయిదా పడ్డాయి. తాజాగా ఎన్నికల నేపథ్యంలో మరోసారి పరీక్షలను వాయిదా వేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. మరో వైపు టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (TS TRT)లో భాగమైన సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌(ఎస్‌జీటీ) పరీక్షలు సైతం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబరు 20 నుంచి 30 వరకు టీఆర్‌టీ నిర్వహణకు ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇందులో స్కూల్‌ అసిస్టెంట్లు, పీఈటీ, భాషా పండితుల పోస్టులకు నవంబరు 20 నుంచి 24 వరకు, ఎస్‌జీటీ పరీక్షలు నవంబరు 25 నుంచి 30 వరకు నిర్వహించాల్సి ఉంది. పరీక్ష తేదీలు, ఎన్నికల తేదీ దగ్గరగా ఉండడంతో వాయిదా వేసే అవకాశాలున్నాయి. దీనిపై సైతం త్వరలోనే విద్యాశాఖ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.