నేను పోటీ చేస్తా: గుత్తా సుఖేందర్ రెడ్డి యూటర్న్!

రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయాన్ని పక్కన పెట్టి .. వచ్చే జమిలీ ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నట్లుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు. బుధవారం నల్లగొండలోని తన నివాసంలో మీడియా చిట్ చాట్ లో గుత్తా మాట్లాడారు.

నేను పోటీ చేస్తా: గుత్తా సుఖేందర్ రెడ్డి యూటర్న్!

విధాత : రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయాన్ని పక్కన పెట్టి .. వచ్చే జమిలీ ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నట్లుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు. బుధవారం నల్లగొండలోని తన నివాసంలో మీడియా చిట్ చాట్ లో గుత్తా మాట్లాడారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని, వచ్చే ఎన్నికల్లో తన కొడుకు అమిత్ పోటీ చేస్తాడని కొద్దిరోజుల క్రితం గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు గుత్తా తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా చిట్ చాట్ లో వెల్లడించారు. డీలిమిటేషన్ తో రానున్న ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లు పెరుగబోతున్నాయని, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తాను ఈ పరిస్థితుల్లో రాజకీయాలకు దూరంగా ఉండటం కంటే ఎన్నికల బరిలోకి దిగి ప్రజాసేవ కొనసాగించాలని భావిస్తున్నట్లుగా తెలిపారు.

యువతకు మార్గదర్శకంగా కొనసాగుతా..

వచ్చే ఏడాది నవంబర్ లో ఎమ్మెల్సీ పదవి కాలం పూర్తవుతుందని, తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండటం కంటే.. క్రీయాశీలక రాజకీయాల్లో కొనసాగుతూ యువతకు మార్గదర్శకత్వంగా నిలవాలని భావిస్తున్నట్లుగా గుత్తా చెప్పుకొచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆర్ధికంగా బలమైన కుటుంబాలు, రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న క్రమంలో వారిని సరైన మార్గంలో నడిపించేందుకు తమలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయంలో నాకు పీవీ నర్సింహారావు, నీలం సంజీవ రెడ్డిలే ఆదర్శమని చెప్పారు. రాజకీయాలు దూరంగా ఉన్న కాలంలోనే పీవీకి ప్రధాన మంత్రి అయ్యే అవకాశం కలిసొచ్చిందని, దాంతోనే దేశంలో ఆర్ధిక సంస్కరణలకు బీజం పడిందని, అలాగే రాజకీయాలకు దూరమైన నీలం సంజీవ రెడ్డిని రాష్ట్రపతి పదవి వరించిందని ఈ సందర్బంగా గుత్తా గుర్తు చేశారు.

డీలిమిటేషన్ తో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పుడున్న 12అసెంబ్లీ స్థానాలకు అదనంగా కొత్తగా ఆరు నియోజకవర్గాలు ఏర్పడవచ్చని, రెండు పార్లమెంట్ స్థానాలకు అదనంగా ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలతో కలిపి ఒకటి, రెండు ఎంపీ సీట్లు పెరగొచ్చని గుత్తా అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో నేను మరోసారి పోటీ చేసేందుకు అనుకూల పరిస్థితులు ఉంటాయని..అందుకే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా గుత్తా పేర్కొన్నారు.

రెండు విడతలుగా జమిలీ ఎన్నికలు!

దేశంలో జమిలీ ఎన్నికలు జరిగితే 18 రాష్ట్రాలు ఒకసారి, మిగిలిన రాష్ట్రాలు ఒకసారి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని గుత్తా సుఖేందర్ రెడ్డి అంచనా వేశారు. జనాభా ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగవచ్చని, దీంతో ఉన్న సీట్లకు 50 శాతం పెంచేలా కేంద్రం కొత్త విధానం ప్రతిపాదించిందన్నారు. 50 శాతం జనాభా, 50 శాతం జీఎస్టీ పరంగా చేయాలని పలు రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్నాయని, మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు వేరువేరుగా పెట్టాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయని, అయితే కేంద్రం ఏం చేయబోతున్నది చూడాల్సి ఉందన్నారు. డబ్బు ప్రవాహాన్ని కట్టడి చేస్తే తప్ప భవిష్యత్ రాజకీయాల్లో సామాన్యుడు పోటీ చేసే పరిస్తితి లేదు అన్నారు. అధికార పార్టీలో అసంతృప్తి సాధారణం అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మారుస్తారని ప్రచారం నడుస్తుందని, అసలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా ఎందుకు మార్చారో ఆ పార్టీ నాయకత్వం ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.

ధాన్యం కొనుగోళ్ల సమస్య క్లియర్ అయిందని, సన్నధాన్యం సేకరణలో ఎక్కడా సమస్య లేదు అన్నారు. సీఎంఆర్ ధాన్యం సేకరణ లో పూర్తి స్థాయి నియంత్రణ ఉండాలని, మిల్లులను క్లోజ్ చేయించే పరిస్థితి లేదు అని గుత్తా తెలిపారు. మిల్లులు బంద్ అయితే ధాన్యం కొనుగోలు చేసేవారు ఉండరని, కేంద్రం 20 శాతం బాయిల్డ్ రైస్, 80 శాతం రా రైస్ ఇవ్వాలని అడుగుతుందని, కానీ మిల్లర్లు బాయిల్డ్ రైస్ కు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. వేసవి లో రా రైస్ సేకరిస్తే నూక ఎక్కువగా ఉంటుందన్నారు. ఏఎమ్మార్పీ 4000 క్యూసెక్కుల నీరు ప్రవహించాలని, కానీ ప్రస్తుతం 2400 క్యూసెక్కులకు మించి నీరు ప్రవహించే పరిస్థితి లేదని, సాగునీటి కాలువలను విస్తరించడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని, లైనింగ్ కు ముందే కాలువలు విస్తరణ చేపట్టాలని గుత్తా సూచించారు.