కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. క్యాబినెట్ హోదా కల్పించి, వీహెచ్‌ను సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే డీజీపీగా ఈ రోజు పదవీ విరమణ చేయనున్న బత్తుల శివధర్‌రెడ్డిని కూడా ప్రభుత్వం రాష్ట్ర భద్రతా సలహాదారుగా నియమించింది.
నిన్నమొన్నటిదాక సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుడిగా ఉన్న వేంనరేందర్ రెడ్డి రాజ్యసభకు ఎన్నికవ్వడంతో ఆయన స్థానంలో సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరిని నియమిస్తారన్న ప్రచారం కూడా గట్టిగా వినిపించింది. మరి వేంనరేందర్ రెడ్డి స్థానంలో ఖాళీయైన సలహాదారు పదవి ఎవరిని వరిస్తుందో చూడాల్సి ఉంది.
సలహాదారుల నియామకాలపై విమర్శలు
ప్రభుత్వ సలహదారుల నియామకం..కేబినెట్ హోదా కల్పన అంశాలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చాక అదే పంథాను అనుసరిస్తుండటం గమనార్హం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని ప్రభుత్వ సలహాదారు పదవులను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దుచేసింది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రభుత్వ సలహాదారులను నియమించుకోవడం విశేషం. ప్రభుత్వ సలహాదారు పదవులు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయని..దీంతో విలువైన ప్రజాధనం వృథా అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రిటైర్డ్ ఐఏఎస్, ఇతర అధికారులకు పదే పదే సలహాదారు పదవులు ఇవ్వడంపై చర్చ జరుగుతుంది.
అదిగాక సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని, అధికారుల పనితీరులో జోక్యం చేసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. ఎన్నికల్లో ఓడిపోయిన వారికి లేదా పార్టీ నేతలకు ఈ పదవుల ద్వారా రాజకీయ పునరావాసం కల్పిస్తున్నారనే ఆరోపణలు మొదటి నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఖజానా నుంచి లక్షల్లో పారితోషికం, వసతులు కల్పించడంపై ప్రతిపక్షాలు, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. శాఖల వారీగా ప్రత్యేక కార్యదర్శులు, ఐఏఎస్ అధికారులు ఉన్నప్పుడు సలహాదారుల అవసరం ఏంటనేది ప్రధాన ప్రశ్న వ్యక్తమవుతోంది. సలహాదారులు కేవలం సలహాలు ఇవ్వకుండా, అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని ఆరోపణలు చోటుచేసుకుంటున్నాయి.
ఏపీ, తెలంగాణలో ఇప్పటికే సలహాదారుల నియామకాలను ప్రశ్నిస్తూ పలువురు కోర్టులను సైతం ఆశ్రయించడం..విచారణ సందర్బంగా సదరు నియామకాలపై కోర్టులు అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.
ఇవి కూడా చదవండి :
Mini Cooper | స్పోర్టీ లుక్‌తో సరికొత్త మినీ కూపర్.. ధర ఎంతంటే..!
HMWSSB | హైదరాబాదీలకు అలర్ట్.. మే 2న తాగునీటి సరఫరా బంద్..!
