Harish Rao : స్కామ్‌లు, స్కీములపైనే కాంగ్రెస్ ఫోకస్.. హరీశ్ తీవ్ర ఆరోపణలు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్‌లు, కమీషన్‌లపైనే దృష్టి పెట్టిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా ఆరోపించారు. రామగుండం థర్మల్ ప్రాజెక్టు నిర్మాణంలో రూ. 5 వేల కోట్ల నుండి 6 వేల కోట్ల కమీషన్లు దండుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర క్యాబినెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలు, పథకాల అమలు వంటి కీలక అంశాలు పక్కనపెట్టి, కేవలం స్కామ్‌లు, కమీషన్‌లపై మాత్రమే చర్చ జరుగుతోందని ఆయన ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా రామగుండం థర్మల్ ప్రాజెక్టులోనే రూ.5 నుండి 6 వేల కోట్ల కమీషన్ దండుకునేలా ప్రణాళికలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఎన్టీపీసీ ఒప్పందంపై సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోను చూపిస్తూ రేవంత్‌పై హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. రామగుండం 800 మెగావాట్ల యూనిట్‌కు రూ.8 చొప్పున రూ.10,880 కోట్లు ఖర్చవుతుందని, ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి ఖర్చు రూ.15 వేల కోట్లకు పెరుగుతుందని వెల్లడించారు. తాను ఒక యూనిట్ విద్యుత్‌ను రూ.5కే ఇస్తానని చెప్పిన సీఎం, ఇదే సమయంలో రామగుండం యూనిట్‌ను ఇంత అధిక ఖర్చుతో ఎందుకు పెడుతున్నారని హరీశ్ ప్రశ్నించారు. గతంలో థర్మల్ ప్లాంట్లను వ్యతిరేకించిన రేవంత్, ఇప్పుడు సీఎంగా థర్మల్ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడం విరుద్ధమన్నారు.
పాల్వంచ, రామగుండం, మత్కల్ ప్రాంతాల్లో ఒక్కోటి 800 మెగావాట్ల చొప్పున మొత్తం 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్లు ప్రాజెక్టులకు సుమారు రూ.50 వేల కోట్లు ఖర్చవుతుందని, అందులో 40 వేల కోట్లు అప్పుగా తెచ్చినా, మిగతా రూ.10 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న సమయంలో ఈ భారీ పెట్టుబడిని ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకురాబోతుందో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్టీపీసీ ఇప్పటికే 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి, తక్కువ ధరకు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉందని హరీశ్ రావు తెలిపారు. ఈ విషయంపై సంస్థ మూడుసార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందన రాలేదని ఆరోపించారు. సంస్థ సీఎండీ కూడా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు ఈ విషయంపై విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 1,600 మెగావాట్ల విద్యుత్‌ను ఎన్టీపీసీ నుంచి తీసుకున్నప్పటికీ, ఇప్పుడు మిగతా 2,400 మెగావాట్లకు అవకాశాన్ని ప్రభుత్వం వదులుకుందని హరీశ్ రావు విమర్శించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram