విధాత, హైదరాబాద్ : ఏపీ సీఎం, గురువు చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం.. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు ద్రోహం చేస్తూ..ఏసీ జలదోపిడికి సహకారం అందిస్తున్నాడని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టుకు ఆమోదం తెలిపితే బనకచర్లకు మేము ఒప్పుకుంటామని అంటున్నాడని, గోదావరిలో 700 టీఎంసీలు మనకి వస్తాయని అందరు చెప్తుంటే, రేవంత్ రెడ్డి ఏమో నాకు 90 టీఎంసీలు చాలు అంటున్నాడని, రేవంత్ రెడ్డి వైఖరి చూస్తే.. చంద్రబాబు ప్రతినిధిగా తెలంగాణ సీఎం కుర్చీలో కూర్చున్నట్టు ఉందని విమర్శించారు. నీటి పారుదల రంగంలో తెలంగాణకు రేవంత్ రెడ్డి చేసినంత అన్యాయం.. ఉమ్మడి ఆంధ్రలో ఏ సీఎం కూడా చేయలేదు అన్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణకు 167 టీఎంసీలు నష్టం కలిగేలా కుట్ర చేస్తున్నాడంటూ ఆరోపించారు.
ఇప్పటిదాకా రెండు రాష్ట్రాల మధ్య ఎన్నో మీటింగ్స్ జరిగాయని, కానీ మినిట్స్ ఆఫ్ మీటింగ్ బయటకు రావట్లేదు అని, తెలంగాణ ఇంజనీర్లను పంపకుండా.. చంద్రబాబు నమ్మిన బంటుని ఆధిత్యనాధ్ దాస్ ను మాత్రమే రేవంత్ రెడ్డి పంపిస్తూ దొంగ చేతికి తాళాలు ఇచ్చాడని, ఈ తుగ్లక్ ప్రభుత్వం వల్ల తెలంగాణకు గోదావరిలో 213 టీఎంసీలు నష్టం జరుగుతుందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు మరో 167 TMCలతో గోదావరి – బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం పావులు కడుపుతోందన్నారు.
సమ్మక్క సాగర్ – నాగార్జున సాగర్ – సోమశిల – కావేరీ పథకం గత ప్రభుత్వంలో ప్రతిపాదించిన ఇంటర్‌లింకింగ్ ఆఫ్ రివర్స్ ప్రక్రియ అని, కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కుట్ర వల్ల అసలు తెలంగాణ భూభాగానికి సంబంధం లేకుండా నదుల అనుసంధానం జరుగుతుందని హరీశ్ రావు ఆరోపించారు. పోలవరం – నల్లమల సాగర్ – కావేరీ అనే విధంగా వాళ్లు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని, అలా చేస్తే తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ రాకుండా పోతుంది, వాళ్లకి జాతీయ ప్రాజెక్ట్ కింద ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గోదావరి నీళ్లు వెళ్తాయి, తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని హరీశ్ రావు ఆందోళన వెలిబుచ్చారు. ఇంత కుట్ర జరుగుతుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనంగా ఉంటున్నారన్నారని మండిపడ్డారు. గోదావరి – నల్లమల సాగర్‌కు, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు లింకు పెట్టడం అంటే తెలంగాణ రాష్ట్రానికి ట్రిబ్యునల్ ద్వారా సంక్రమించిన నదీ జలాలపై రాజీపడడమేనని, నీ గురువు చంద్రబాబుకి తొత్తుగా మారి తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం తలపెడుతున్నావంటూ రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. 16టీఎంసీలకు పైనే ఆపుకోవాలని కర్ణాటకకు ఏపీ సర్కార్ క్లియరెన్స్ ఇస్తోందని, కర్ణాటకకు చెందిన 16టీఎంసీల గోదావరి నీళ్లు మేము వాడుకుంటామని చెప్తోందని, దీని వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మహబూబ్ నగర్ జిల్లా.. జూరాలకు నీళ్లు రావు అని, జూరాలపై ఆధారపడ్డ జిల్లా ప్రజలకు.. కనీసం మంచి నీళ్లు కూడా దొరకవు అని హరీశ్ రావు తెలిపారు.
ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను అనాటి ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు కూడా అంగీకరించాయి అని, తెలంగాణ నీటి కేటాయింపులకు నష్టం కలిగించకుండానే నదుల అనుసంధానం చేస్తామని, తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిన తర్వాతనే నదుల అనుసంధానం చేస్తామని కేంద్ర ప్రభుత్వం కూడా ఆనాడు ఒప్పుకుందని హరీశ్ రావు గుర్తు చేశారు. కానీ ఈరోజు ప్రతిపాదన అంతా మారుతుంటే, తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మౌనంగా ఉండడం దారుణం అన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై మేము అడిగే ప్రశ్నలకు తన దగ్గర సమాధానాలు లేక రేవంత్ రెడ్డి తిట్ల దండకం అందుకుంటున్నాడని, మేము ఆ తిట్లు భరిస్తాం కానీ.. రాష్ట్రానికి అన్యాయం చేస్తే మాత్రం బీఆర్ఎస్ ఊరుకోదు అన్నారు. మాకు రాజకీయ ప్రయోజనాల కంటే.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి మాదిరిగా నాకు బట్లర్ ఇంగ్లీష్ రాదు, హిట్లర్ గవర్నన్స్ కూడా తెలీదు అని హరీశ్ రావు వ్యంగ్యస్త్రాలు విసిరారు. అసలు లేఖ ఏ భాషలో ఉందనేది ముఖ్యం కాదు.. లేఖలోని సారాంశానికి నీ దగ్గర సమాధానం ఉంటే చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
అటు కృష్ణా నది వాటాలో కేఆర్ఎంబీ తెలంగాణకు ద్రోహం చేసింది, ఇటు గోదావరి జలాల్లో సెంట్రల్ వాటర్ కమిషన్ ద్రోహం చేస్తున్నదని, ఈ రాష్ట్ర నుంచి కేంత్ర మంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతారా? లేక మీ రాజకీయ ప్రయోజనాలే చూసుకుంటారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఏపీ ఎంపీల చేతిలో బీజేపీ ప్రభుత్వం కీలు బొమ్మలా మారిందని, తెలంగాణలో ఉన్న 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా కనీస సోయి లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. కేఎల్ రావు మాకు ఆదర్శం అని ఆంధ్రా నాయకులు అంటారని, మరి అలాంటి కేఎల్ రావు కూడా గోదావరి కావేరీ నదుల అనుసంధానం తెలంగాణలోని ఇచ్చంపల్లి నుండే జరగాలని స్పష్టంగా వివరించాడని హరీశ్ రావు గుర్తు చేశారు.
