Harish Rao : బనకచర్లపై కేంద్రమంత్రి పాటిల్ లేఖకు రేవంత్ రెడ్డి స్పందన ఎక్కడా?
బనకచర్లపై కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ లేఖకు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని, నల్లమల పులి కాదు పిల్లి అని ఎద్దేవా చేశారు.

విధాత, హైదరాబాద్ : బనకచర్లపై కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ రాసిన లేఖపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని మాజీమంత్రి టి.హరీష్ రావు ప్రశ్నించారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలోహరీష్ రావు మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ చెప్పినవన్నీ నిజమవుతున్నాయన్నారు. కేంద్రం అండతో ఏపీ ప్రభుత్వం బనకచర్లపై ముందుకెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి దీన్ని అడ్డుకోపోగా.. పరోక్షంగా సహకరిస్తు. రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. బనకచర్లపై కేంద్రం లేఖ రాసి 20 రోజులవుతున్నా సీఎం రేవంత్ర్ రెడ్డి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి లేఖలో పేర్కొన్నారని..దీనిపై రేవంత్‌రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రాష్ట్రానికి జరుగుతోన్న నష్టంపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించట్లేదని హరీష్ రావు ప్రశ్నించారు. కేంద్ర మంత్రి లేఖపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లట్లేదు? అని హరీశ్‌రావు నిలదీశారు. కమిషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి బనకచర్లకు సహకరిస్తున్నారని ఆరోపించారు. బనకచర్లపై సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండా.. డీపీఆర్ ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. 423 టీఎంసీల గోదావరి జలాలను ఏపీ మళ్లిస్తోందని మాజీ హరీశ్‌రావు ఆరోపించారు. నీళ్లు తరలించుకుపోతున్నా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించట్లేదని విమర్శించారు. ఆయన ఎందుకు స్పందించట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎంగా ప్రజా ప్రయోజనాలు కాపాడతారా.. స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటారా? అని నిలదీశారు. అత్యంత ముఖ్యమైన బనకచర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళాలని డిమాండ్ చేశారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు వెళ్ళొద్దని చెప్పినా.. సీఎం రేవంత్ వెళ్ళటం వెనుక ఆంతర్యమేంటి అని నిలదీశారు.
నల్లమల పులి కాదు..పిల్లి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు.. నల్లమల పిల్లి అని హరీశ్‌రావు సెటైర్లు వేశారు. ఏపీ 423 టీఎంసీల నీళ్లు మళ్లిస్తే.. నేను మీద 112 టీఎంసీలు ఆపుకుంటా అని కర్ణాటక అంటుందని.. నేను 74 టీఎంసీలు ఆపుకుంటా అని మహారాష్ట్ర అంటుందని..అప్పుడు మన పరిస్థితి ఏంటని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేారు. మాట్లాడితే నల్లమల బిడ్డను అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఆ నల్లమలను అనుకొని పారే కృష్ణా నదిలో ఆ మహబూబ్ నగర్ జిల్లాకు నష్టం జరిగితే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నిజంగా నల్లమల పులి అయితే మాట్లాడేవాడివని. పిల్లివి, ఎలుకవు కాబట్టి మాట్లాడటం లేదు అని హరీశ్‌రావు ఘాటుగా విమర్శించారు. రేవంత్ రెడ్డి మొన్న మల్లికార్జున ఖర్గేను పరామర్శించడానికి కర్ణాటకకు వెళ్లినప్పుడు, ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు గురించి సిద్ధరామయ్య, శివ కుమార్ దగ్గర మాట్లాడుతాడు అనుకున్నామని..అక్కడ ఉన్నది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి మాట్లాడలేదు అని హరీష్ రావు విమర్శించారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే తెలంగాణ ఎడారిగా మారుద్దని కనీసం బుద్ధి రేవంత్ రెడ్డికి లేదు అన్నారు. రాహుల్ గాంధీతో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఫోన్ కూడా చేపించలేకపోతున్నాడన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి బ్యాగులు మోయడం ఒక్కటే పని కాదు.. తెలంగాణ బాగోగుల గురించి కూడా పట్టించుకోవాలని హరీష్ రావు సూచించారు.
బీఆర్ఎస్ తోనే రాష్ట్ర ప్రయోజనాలకు రక్షణ
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది కేసీఆర్ మాత్రమే అని హరీష్ రావు అన్నారు. తెలంగాణ నీటి హక్కులు కాపాడాలంటే బీఆర్ఎస్‌ను కాపాడుకోవాలన్నారు. కేసీఆర్ మాత్రమే తెలంగాణ హక్కులను కాపాడుతారని వెల్లడించారు. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తేనే.. తెలంగాణకు ప్రయోజనాలు కాపాడుతారని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రాణం ఏపీ ఎంపీల చేతులో ఉందన్నారు. బీఆర్ఎస్‌కు ఎంపీలు ఉండి ఉంటే తెలంగాణ హక్కులపై పార్లమెంట్‌లో కోట్లాడేవారని అన్నారు. ప్రాంతీయ పార్టీల ఎంపీలు ఉంటేనే రాష్ట్రాలకు న్యాయం హరీష్ రావు పునరుద్ఘాటించారు.