ప్రజలు సద్దితిన్న రేవు తలవాలి.. కాంగ్రెస్, బీజేపీలకు కర్రుకాల్చి వాతపెట్టాలి

ప్రజలు సద్దితిన్న రేవు తలవాలని...కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విజ్ఞప్తి చేశారు

ప్రజలు సద్దితిన్న రేవు తలవాలి.. కాంగ్రెస్, బీజేపీలకు కర్రుకాల్చి వాతపెట్టాలి

 

విధాత బ్యూరో, కరీంనగర్: ప్రజలు సద్దితిన్న రేవు తలవాలని…కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని అక్కన్నపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా నిర్వహించిన రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవిందర్ రావు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాంగ్రెస్, బీజేపీలకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని, అవి రాష్ట్ర ప్రజలను ఏమాత్రం పట్టించుకోవని అన్నారు. ప్రస్తుత లోకసభ ఎన్నికలను తెలంగాణ ప్రజల తల రాతలు మార్చే ఎన్నికలుగా ఆయన అభివర్ణించారు. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీల అమలు అన్నారు… నూటయాబై రోజులైనా వాటికి దిక్కు,మొక్కు లేకుండా పోయిందన్నారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా అబద్దాలు చెప్పి ప్రజలను ఆగం చేసి, ఇప్పుడు దేవుళ్ల మీద ఓట్లు వేసి వారిని మరోసారి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడానికి కాంగ్రెస్ అన్నీ జూటా మాటలు చెప్పిందన్నారు. ఇచ్చిన హామీల మాట పక్కన పెడితే, గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ అమలు చేసిన పథకాలకు కూడా ఎగనామం పెట్టారని ఆరోపించారు. ప్రజలు మార్పు కోరుకున్నది ఇందుకేనా అని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ అడ్డుపడినప్పటికీ గౌరవెల్లి ప్రాజెక్టును 8 టీఎంసీల సామర్థ్యంతో పూర్తి చేసి ట్రయల్ రన్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గౌరవెల్లి నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజి ఇచ్చిమరీ ఆ ప్రాజెక్టు పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ వచ్చాక అన్నీ పథకాలు…’గోవింద’ అయ్యాయని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పని కూడా అదే అవుతుందన్నారు.

ఇక బిజెపి పదేళ్ల పాలనలో పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై పెనుబారం మోపిందన్నారు. జిఎస్టి పేరిట కేంద్రం పేద ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. ఐదేళ్ల కాలంలో ఎంపీగా బండి సంజయ్ ఈ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని ఆయన తెలిపారు.
తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష అని, కేసీఆర్ సీఎం గా ఉన్నన్ని రోజులు ప్రజలు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ వచ్చాక వారికి కష్టాలు మొదలయ్యాయని చెప్పారు. ఏదో ఉద్ధరిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో కరెంటుకు సాగు, తాగు నీటికి తిప్పలు తప్పడం లేదన్నారు. ప్రజలు వాస్తవాలు గమనించి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా నిలవాలని కోరారు.