విధాత, హైదరాబాద్ : వృధాగా పోతున్న గోదావరి నీళ్లను పొలాలకు పారించమని అడిగితే సీఎం రేవంత్ రెడ్డి మా రక్తం పారిస్తా అంటూ సైకో భాషా మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియతో మాట్లాడారు. రైతులకు నీళ్లు ఇవ్వడానికి మా రక్తం అవసరమైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, హిట్లర్ ఆదర్శం అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి హిట్లర్ తరహా హంతక భాష మాట్లాడుతున్నాడని..ఆయనకు హిట్లర్ కు పట్టిన గతే పడుతుందన్నారు. మేడిగడ్డ గేట్లు మూసివేయకుండా కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఎలా ఆన్ చేస్తారు అని రేవంత్ రెడ్డి అంటున్నాడని, మేడిగడ్డ గేట్లు మూసివేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేయవచ్చు అనే కనీస అవగాహన ముఖ్యమంత్రికి లేకపోవడం దౌర్భాగ్యం అన్నారు.
రిటైర్డ్ ఇంజనీర్లు ఈ విషయం చెప్పిన తర్వాత కూడా రేవంత్ రెడ్డికి సోయి రాలేదు అని విమర్శించారు. రైతుల కోసం రక్తం ఇవ్వడానికి,జైలుకి వెళ్లడానికి మేము సిద్ధమే.. కానీ రైతులకు నీళ్లు ఇవ్వాలని, నీ నోరు నీ ఇష్టం అని, కాని నీళ్లు తెలంగాణవి.. నీళ్ల అంశంలో ఇష్టమొచ్చినట్టు చేస్తానంటే కుదరదని రేవంత్ రెడ్డికి హరీశ్ రావు హితవు పలికారు.
కాపర్ డామ్ తో నీళ్లు ఎత్తి పోయవచ్చు..
కన్నెపల్లి మోటార్ ఆన్ చేయమని చెప్తే.. ప్రతిపక్షాల కంఠం నొక్కుతా…కోస్తా, రక్తం పారిస్తా అనడం, రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడితే జైల్లో పెడతా అనడం, ప్రస్తుతం ఉన్న ఇంజనీర్లు ప్రశ్నిస్తే బదిలీలు చేస్తూ ఏసీబీ దాడులు చేయించడం.. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కరెక్ట్ పద్ధతి కాదు అని హరీశ్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లాగా కాకుండా ఒక సైకో లాగా మాట్లాడుతున్నాడన్నారు. మేడిగడ్డ వద్ద రూ.8.5 కోట్ల ఖర్చుతో చిన్న కాపర్ డ్యామ్ కట్టి.. నీళ్లు ఎల్లంపల్లికి తీసుకెళ్లొచ్చని తెలంగాణ నీటి పారుదల శాఖ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ప్రభుత్వానికి లేఖ రాసిందని, ఆ లేఖ బయటపెట్టమని నేను అడిగానని, ఉన్న విషయం చెబితే రిటైర్డ్ ఇంజనీర్లను జైలులో వేస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నాడని హరీశ్ రావు విమర్శించారు. వాళ్ళు చెప్పినట్లు మోటార్లు ఆన్ చేస్తే మీరు చెప్పిన అబద్ధాలు, దుష్ప్రచారం బైట పడుతుందని నీళ్లు ఇవ్వకుండా రేవంత్ అడ్డు పడుతున్నారని ఆరోపించారు.
నీకు తెలివి ఉంటే పట్టిసీమకు నీళ్లు ఎందుకు పోతాయి
సీఎం రేవంత్ రెడ్డి 31నెలల పాలనలో బూతులు తప్ప ఏం నేర్చుకోలేదని, ప్రాజెక్టులపైన, పాలనపైన అవగాహన పెంచుకోలేదని హరీశ్ రావు ఆరోపించారు. షాబాద్ హత్య కేసు నిందితుడికి రేవంత్ రెడ్డికి తేడా లేదు అని, షాబాద్ ఘటన మీద పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాడు కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం స్పందించలేదు అని తప్పుబట్టారు. ఇంత పెద్ద ఘటన జరిగితే, నిన్న మధ్యాహ్నం ఓ పోలీస్ ఉన్నతాధికారి గోల్ఫ్ ఆడాడని.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇలా ఉందని హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డికి తెలి ఉంటే గోదావరి నీళ్లు పట్టిసీమకు ఎందుకు పోతాయని, తెలంగాణ ప్రాజెక్టులను పడావ్ పెట్టి ఏపీకి నీళ్లు పంపిస్తున్నావని ప్రశ్నించారు. కన్నెపల్లి, సీతారామ దగ్గర నీళ్లు ఒడిసిపడితే నీళ్లు కిందకి ఎలా పోతాయి? అని, దేవాదుల ప్రాజెక్టులో రెండు మోటర్లు ఆన్ చేసి 6 మోటర్లు ఎందుకు బంద్ పెట్టినవ్ ? అని నిలదీశారు. నీ గురువుకు గురు దక్షిణ కోసం కాదా? ఇదంతా చేస్తున్నావని, దేవాదుల ప్రాజెక్టుకు వెళ్లి నీ బండారం బయటపెడతానంటూ రేవంత్ రెడ్డిని హరీశ్ రావు హెచ్చరించారు. ఎలినినో వంటి కరవు పరిస్థితుల్లో చుక్క చుక్క నీరు కూడా బంగారం కంటే విలువైనదని గుర్తు చేశారు.
పార్టీలు మారిన నీకు నేను సమాధానం చెప్పడం దండగ..
నా రాజకీయం జీవితంపైన, పార్టీ మార్పుపైన సీఎం రేవంత్ రెడ్డి చేసిన చిల్లర మాటలకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని హరీశ్ రావు స్పష్టం చేశారు. చొక్కాలు మార్చినట్లు పార్టీలు మార్చిన నువ్వు కూడా నా గురించి మాట్లాడుతున్నావా? నా గురించి మాట్లాడే నైతికత రేవంత్ రెడ్డికి ఉందా? అని హరీశ్ రావు మండిపడ్డారు. నా పుట్టుక బీఆర్ఎస్ పార్టీలోనే, చావు బీఆర్ఎస్ పార్టీలోనే అని ఎన్నో సార్లు చెప్పానన్నారు. నేను బీజేపీలోకి వెలుతున్నానంటూ పదేపదే గోబెల్స్ ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ కేడర్ తో రేవంత్ రెడ్డి ఆడుతున్న మైండ్ గేమ్ రాజకీయాలు చెల్లబోవని స్పష్టం చేశారు.
